రుణ మాయ
ABN, Publish Date - Jul 31 , 2024 | 01:17 AM
అదే రుణాన్ని భూమి తనఖా పెట్టి తీసుకుంటే అది సక్రమం! రుణం కట్టకపోతే బ్యాంకు అధికారులు భూమిని జప్తు చేయడమో స్వాధీనం చేసుకోవడమో జరుగుతుంది. ఇక రుణం జోలి రారు. ఈ సూత్రమే ఆ అక్రమార్కులకు వరమైంది. ఎవరూ కొనని భూమికి ఆకాశమంత ధర కట్టి భారీగా రుణం తీసుకుని ఎగ్గొడితే కట్టాల్సిన రుణంలో నాలుగో వంతు
అక్రమార్కులతో కలిసి కేడీసీసీబీ అధికారుల దొంగాట
రూ.10 లక్షల భూమికి రూ.1.75 కోట్ల రుణం
వడ్డీతో కలిపి రూ.4.10 కోట్ల బకాయి
భూమి కొనేందుకు వేలంలో ఎవరూ రాని వైనం
బకాయి కింద బ్యాంకుకు భూమి స్వాధీనం
రుణగ్రహీతలతో బ్యాంకు అధికారుల కుమ్మక్కు
విచారణలో అక్రమం బట్టబయలు
ఇదే బాటలో మరో 10 స్థలాల జమకు సిద్ధం
బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఎగ్గొడితే అది మోసం!
అదే రుణాన్ని భూమి తనఖా పెట్టి తీసుకుంటే అది సక్రమం! రుణం కట్టకపోతే బ్యాంకు అధికారులు భూమిని జప్తు చేయడమో స్వాధీనం చేసుకోవడమో జరుగుతుంది. ఇక రుణం జోలి రారు.
ఈ సూత్రమే ఆ అక్రమార్కులకు వరమైంది. ఎవరూ కొనని భూమికి ఆకాశమంత ధర కట్టి భారీగా రుణం తీసుకుని ఎగ్గొడితే కట్టాల్సిన రుణంలో నాలుగో వంతు ధర కూడా లేని ఆ భూమిని బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకుని వదిలేశారు.
అక్రమార్కులకు ప్రయోజనం చేకూరింది. రుణానికి రుణం వచ్చింది. ఎవరూ కొనని భూమిని ఊహకు కూడా అందని ధరకు పోయింది. అక్రమం కాస్తా సక్రమం అయింది. అక్రమార్కులు, బ్యాంకర్లు కలిసి నీకింత.. నాకింత అని వాటాలు వేసుకుని పంచుకుతిన్నారు.
ఈ మోసం మచిలీప్నటంలోని జవ్వారుపేట కేడీసీసీబీ బ్రాంచిలో జరిగింది.
(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నం జవ్వారుపేట బ్రాంచిలో జోగి కుమార్ సాయి మరో ఆరుగురు పెడన - బంటుమిల్లి రోడ్డులోని సర్వే నంబరు 662/4సీలోని 65 సెంట్లును హామీగా చూపి ఐదేళ్ల క్రితం రూ.1.75 కోట్లు రుణం తీసుకున్నారు. వ్యవసాయ భూమి అయిన దీన్ని ఇంటి స్థలం కింద గజాల్లో చూపి ఈ రుణం తీసుకున్నారు. కప్పలదొడ్డి పైడమ్మ ఆలయం సమీపంలోని డోర్ నంబరు 1/68గా చూపి గజం రూ.10,600 విలువ ఉన్నట్టు రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారు. గజాల్లో భూమి మొత్తం విలువ రూ.3.33 కోట్లుగా చూపారు. వాస్తవంగా అప్పట్లో అక్కడ భూమి విలువ ఎకరా రూ.10 లక్షల్లోపే ఉంది. ఆ ప్రాంతంలో వ్యవసాయ భూవిపై కేవలం రూ.3.90 లక్షల రుణం ఇవ్వాల్సి ఉండగా రూ.1.75 కోట్లు రుణం పొందారు. దీనిపై అప్పట్లోనే విచారణ జరగ్గా బ్యాంకు అధికారుల ప్రమేయాన్ని గుర్తించి వేటు వేశారు.
ఎవరూ కొనని భూమి బ్యాంకుకు స్వాధీనం
సర్వే నంబరు 662/4సిలోని 65 సెంట్ల భూమిని ఇటీవల బ్యాంకు అధికారులు వేలం వేశారు. దాన్ని 3146 గజాలుగా చూపుతూ వేలం పాట నిర్వహించారు. కానీ వేలం పాటలో ఎవ్వరూ పాల్గొనలేదు. దీంతో బ్యాంకు ఆ భూమిని ఖరీదు కట్టి స్వాధీనం చేసుకుంది. దానికి బ్యాంకు అధికారులు కట్టిన ధర అక్షరాలా రూ.4.10 కోట్లు. ఇప్పటికీ అక్కడ ఎకరా భూమి రూ.కోటిలోపే ఉంది. అలాంటిచోట 65 సెంట్లకు రూ.4.10 కోట్లు ఖరీదు కట్టడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మళ్లీ తప్పు
వ్యవసాయ భూమిని గజాల్లో చూపి కోట్లాది రూపాయలు రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో రుణగ్రహీతలు.. వారితో కుమ్మక్కయిన బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని చూపేందుకు మళ్లీ బ్యాంకు అధికారులు మరోసారి తప్పుడు మార్గంలో అడుగులు వేస్తుండటం గమనార్హం. అప్పట్లో తాము ఇచ్చిన రూ.1.75 కోట్ల రుణాన్ని వడ్డీతోసహా బ్యాంకుకు జమ చేశామని చెప్పుకొనేందుకు ఆ 65 సెంట్లకు రూ.4.10 కోట్లు ఖరీదు కట్టి బ్యాంకుకు అంటగట్టడం గమనార్హం. ఈ స్థలం విషయంలో సక్సెస్ అయితే మున్ముందు ఇదే తరహా అక్రమాలకు కారణమైన మరో 10 స్థలాలను ఇదే రీతిన బ్యాంకుకు అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫలితంగా బ్యాంకుకు నష్టం వాటిల్లి అంతిమంగా ఖాతాదారులపై ఆ ప్రభావం పడుతుంది. ఈ వ్యవహారంలో బ్యాంకు సీఈవో, జీఎం మొదలు ఉన్నతాధికారులు అందరూ పాత్రధారులే. దీనిపై తక్షణం కలెక్టర్, జేసీ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు.
Updated Date - Jul 31 , 2024 | 07:57 AM