సిమెంట్ స్వాహా
ABN, Publish Date - May 26 , 2024 | 01:31 AM
సచివాలయాల నిర్మాణాల్లో చేతివాటం ప్రదర్శించారు. నిర్మాణం కూడా ప్రారంభించని ప్రాంతాల్లో సిమెంట్, ఇనుమును స్వాహా చేశారు. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని నందివాడ మండలంలో బయటపడిన ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు, వైసీపీ నాయకుల అవినీతి బాగోతం నిజమేనని నిర్ధారణ అయినా పంచాయతీరాజ్ అధికారులు ఇంతవరకు చర్యలు చేపట్టింది లేదు, ఇనుము అడ్వాన్స్‌లు రాబట్టిందీ లేదు.
సచివాలయాల నిర్మాణం చేపట్టకుండానే సిమెంట్, ఇనుము మింగేశారు
నందివాడ మండలంలో వైసీపీ నాయకుల అవినీతి బాగోతం
సోషల్ ఆడిట్‌లో బయటపడిన నిజాలు
ఇనుము అడ్వాన్స్ పేమెంట్ రాబట్టలేదు..!
అధికార పార్టీకి పంచాయతీ అధికారుల దాసోహం
సచివాలయాల నిర్మాణాల్లో చేతివాటం ప్రదర్శించారు. నిర్మాణం కూడా ప్రారంభించని ప్రాంతాల్లో సిమెంట్, ఇనుమును స్వాహా చేశారు. గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని నందివాడ మండలంలో బయటపడిన ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు, వైసీపీ నాయకుల అవినీతి బాగోతం నిజమేనని నిర్ధారణ అయినా పంచాయతీరాజ్ అధికారులు ఇంతవరకు చర్యలు చేపట్టింది లేదు, ఇనుము అడ్వాన్స్‌లు రాబట్టిందీ లేదు.
గుడివాడ: గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని నందివాడ మండలానికి చెందిన 12 గ్రామాల్లో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్ క్లినిక్‌లు నిర్మించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్ శాఖ అనుమతులిచ్చింది. ఉపాధి హామీ పథకం నిధులతో వీటి నిర్మాణాలు చేపట్టారు. నందివాడ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా వస్తు సామగ్రి నిధుల కింద సిమెంట్, ఇనుమును సరఫరా చేశారు. అయితే, అరిపిరాల, పోలుకొండ గ్రామ సచివాలయాల నిర్మాణానికి సిమెంట్‌ను విడుదల చేయగా, అది పక్కదారి పట్టింది. సాధారణంగా ఇలాంటి పనులు పంచాయతీల పర్యవేక్షణలో జరగాలి. కానీ, అనధికారికంగా వైసీపీ నాయకులకు కట్టబెట్టారు. అయితే, గోదాములు లేనిచోట పనులు చేయిస్తామని ముందుకొచ్చిన వైసీపీ నేతలు తొలుత సిమెంట్‌ను వారి ఇళ్లలో నిల్వ చేశారు. ఆ తర్వాత ఆ సిమెంట్ కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచారు. అయితే, నిర్మాణాలు చేపట్టకపోవడంతో సిమెంట్‌ను వేరే గ్రామాల్లోని నిర్మాణాలకు తరలించామని పంచాయతీరాజ్ అధికారులు కవర్ చేస్తున్నారు. కొంతమేర సిమెంట్ వాడకముందే పాడైపోయిందని, ఇంకొంత వైసీపీ నాయకులే వాడుకున్నారని స్థానికులు, టీడీపీ నాయకుల వాదన. కానీ, సిమెంట్‌ను పంచాయతీ ఇంజనీర్ల పేరున సరఫరా చేయడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం వారి మెడకు చుట్టుకుంది.
ఆ రెండు గ్రామాల్లో..
2021-22 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పథకం ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించారు. అరిపిరాల గ్రామ సచివాలయ నిర్మాణానికి రూ.4.84 లక్షల విలువైన సిమెంట్, ఇనుమును విడుదల చేశారని పీఆర్ అధికారులు ధ్రువీకరించారు. ఇనుము నిమిత్తం రూ.2,39,693, మిగతా సిమెంట్ కోసం అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నారు. కానీ, నిర్మాణం చేపట్టలేదని 2022లో సామాజిక తనిఖీల్లో తేల్చారు. వారం వ్యవధిలో పని ప్రారంభించాలని, లేనిపక్షంలో నిధులు తిరిగి రాబట్టాలని పంచాయతీరాజ్ ఏఈని డ్వామా ఏపీడీ ఆదేశించారు. రెండేళ్లు కావస్తున్నా నేటికీ నిర్మాణం ప్రారంభం కాలేదు. నిధుల రికవరీ జరగలేదు. ఇక పోలుకొండ గ్రామంలో మూడు నిర్మాణాల నిమిత్తం రూ.79.30 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో రూ.3.71 లక్షలను సిమెంట్, ఇనుము నిమిత్తం వినియోగించుకున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు ధ్రువీకరించారు. సదరు సిమెంట్ ఎక్కడికి వెళ్లిందో, మిగిలిన నిధులు ఏమయ్యాయో తెలియదు.
కొడాలి నాని అనుచరులే..
నందివాడ మండలంలో సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టులను దక్కించుకుంది ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులే. స్వాహా చేసిన సిమెంట్, ఇనుము అడ్వాన్స్ నగదు రాబట్టే విషయంలో పంచాయతీరాజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రికవరీ చేయలేదు. అధికార పార్టీ సేవలో తరిస్తూ వారు చెప్పిందే వేదంగా నడుచుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగా నిర్మాణాలు కూడా నత్తనడకనే సాగుతున్నాయి.
సిమెంట్‌ను వేరేచోటకు తరలించాం..
అరిపిరాల, పోలుకొండ గ్రామాలకు సంబంధించి వస్తు సామగ్రి నిధుల నుంచి విడుదలైన సిమెంట్‌ను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేరేచోట నిర్మాణాలకు వినియోగించాం. రెండు గ్రామాల్లో ఎటువంటి నిర్మాణాలు ప్రారంభం కాలేదన్న మాట వాస్తవమే.
- బి.రాధాకృష్ణ, పంచాయతీరాజ్ నందివాడ ఏఈ
రెండు రోజుల్లో జమ చేయిస్తాం..
నిర్మాణాలు చేపట్టని గ్రామాల నుంచి సిమెంట్‌ను వేరేచోట వాడుకునేందుకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చాం. ఎక్కడైతే వాడమో అక్కడి గ్రామాల నుంచి సిమెంట్‌ను ఇండెంట్ పెట్టి తిరిగి అరిపిరాల, పోలకొండ గ్రామాల్లోని నిర్మాణాలకు వినియోగిస్తాం. రికవరీ మొత్తాలను విజయవాడ ఆర్‌డీ ఖాతాల్లో రెండు రోజుల్లో జమ చేయిస్తాం.
- హరినాథ్‌బాబు, పీఆర్‌డీఈ
Updated Date - May 26 , 2024 | 01:31 AM