తొలిరోజు 99 శాతం పంపిణీకి చర్యలు
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:20 AM
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల మొత్తాన్ని ఆగస్టు 1, గురువారం లబ్ధిదారుల ఇళ్ల వద్ద అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు.
కృష్ణలంక, జూలై 30 : ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల మొత్తాన్ని ఆగస్టు 1, గురువారం లబ్ధిదారుల ఇళ్ల వద్ద అందించే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ సృజన, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఎల్‌డీఎం కె.ప్రియాంకతో కలిసి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ పధాన కార్యదర్శి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన అధికారులతో మాట్లాడారు.
తొలిరోజే 99 శాతం..
ఉదయం 6 గంటలకు పింఛన్ పంపిణీని ప్రారంభించి ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలన్నారు. తొలిరోజే 99 శాతం మేర పూర్తిచేసేందుకు కృషి చేయాలన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఇందుకు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో 2,34,143 మంది లబ్ధిదారులకు రూ.98.80 కోట్లు అందించాల్సి వుందని, పింఛన్ల పంపిణీకి ప్రభుత్వ ఉద్యోగులతో మ్యాప్ చేయడం జరిగిందన్నారు. ఎ.కొండూరు మండలంలో 7,485, చందర్లపాడులో 10,017, జి.కొండూరులో 8,728, గంపలగూడెంలో 11,583, ఇబ్రహీంపట్నంలో 4,845, జగ్గయ్యపేట (అర్బన్)లో 4,910, జగ్గయ్యపేటలో 10,338, కంచికచర్లలో 10,363, కొండపల్లి (అర్బన్)లో 5,305, మైలవరంలో 9,734, నందిగామలో 8,048, నందిగామ (అర్బన్)లో 4,298, పెనుగంచిప్రోలులో 8,580, రెడ్డిగూడెంలో 7,284, తిరువూరులో 6,865, తిరువూరు (అర్బన్)లో 3,430, వత్సవాయిలో 9,693, వీరులపాడులో 8,841, విజయవాడ (అర్బన్)లో 68,224, విజయవాడ రూరల్‌లో 17,277, విస్సన్నపేట మండలంలో 8,295 పింఛన్లు వున్నట్టు వివరించారు. 31వ తేదీ సాయంత్రంలోగా బ్యాంకుల నుంచి నగదును విత్‌డ్రా చేసి, పంపిణీ ప్రక్రియను సరళీకృతం చేసేలా డినామినేషన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పింఛన్ల పంపిణీ తీరును ఎప్పటికప్పుడు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని కలెక్టర్ సృజన పేర్కొన్నారు.
Updated Date - Jul 31 , 2024 | 12:20 AM