kidnap సినీ ఫక్కీలో కిడ్నాప్
ABN, Publish Date - Aug 21 , 2024 | 11:55 PM
సినీ ఫక్కీలో జరిగిన ఓ చిరు వ్యాపారి కిడ్నాప్ జిల్లాలో కలకలం రేపింది. అయితే ఆ వ్యాపారి కిడ్నాపర్లను ప్రతిఘటించి మండల పరిధిలోని జంతులూరు గ్రామం వద్ద బయటపడ్డాడు.
ప్రతిఘటించి తప్పించుకున్న చిరు వ్యాపారి
బుక్కరాయసముద్రం, ఆగస్టు21: సినీ ఫక్కీలో జరిగిన ఓ చిరు వ్యాపారి కిడ్నాప్ జిల్లాలో కలకలం రేపింది. అయితే ఆ వ్యాపారి కిడ్నాపర్లను ప్రతిఘటించి మండల పరిధిలోని జంతులూరు గ్రామం వద్ద బయటపడ్డాడు. పోలీసులు, బాధితుడు తెలిపిన మేరకు... అనంతపురం నగరంలోని తపోవనం ప్రాంతానికి చెందిన కుళ్లాయప్ప చీరలు, మిక్సీలు, వంట సామగ్రి వస్తువులను ప్రతి రోజు ద్విచక్రవాహనంలో తీసుకెళ్లి బుక్కరాయసముద్రం, నార్పల, శింగనమల మండలాల్లోని గ్రామాల్లో విక్రయించి పొట్టపోసుకునేవాడు. వ్యాపారం నిమిత్తం బుధవారం నార్పలకు వెళ్తుండగా... బుక్కరాయసముద్రం గాంధీనగర్ వద్ద కారులో నలుగురు వచ్చి కుళ్లాయప్పను కిడ్నాప్ చేశారు. కారులోనే మూడు గంటల పాటు నార్పల, బుక్కరాయసముద్రం పరిధిలోని పలు గ్రామాల్లో తిప్పారు. ముసుగువేసి కారులోనే చితకబాదారు. ఐదు నెలలుగా తిరుగుతున్నాం... ఇప్పుడు దొరికావ్ అంటూ చితకబాదారని కుళ్లాయప్ప వాపోయాడు.
ప్రతిఘటించడంతో... తప్పిన ప్రమాదం
పథకం ప్రకారం చిరు వ్యాపారి కుళ్లాయప్పను కిడ్నాప్ చేసి కారులోనే చితకబాదారు. చివరికి ఇంకా హత్య చేస్తారని భావించిన కుళ్లాయప్ప ... కారు డ్రైవర్ గొంతు గట్టిగా చేతులతో పట్టుకున్నాడు. దీంతో కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారు అదుపు చేయలేక జంతులూరు గ్రామం వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొని చిన్న గోతిలో దించాడు. దీంతో కారు బయటకు రాకపోవడంతో కిడ్నాపర్లు జంతులూరు గ్రామం వద్ద నుంచి పరారీ అయ్యారు. అనంతరం 100కు ఫోన చేసి సమాచారాన్ని పోలీసులకు తెలిపినట్లు పేర్కొన్నారు. సీఐ వెంకటేశ్వర్లు బాధితుడుని అనంతపురం సర్వజన అస్పత్రికి తరలించారు. తన ద్విచక్రవాహనా న్ని కిడ్నాపర్లు ఎత్తుకెళ్లినట్లు పోలీసులుకు బాధితుడు తెలిపారు.
ఎందుకీ కిడ్నాప్..?
చిరు వ్యాపారి కుళ్లాయప్పను పట్టపగలే ఎందుకు కిడ్నాప్ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నా్‌పనకు ఉపయోగించిన కారు అనంతపురంలోని జనశక్తినగర్‌లో నివాసంటున్న ఓ వీఆర్వో పేరుమీద ఉన్నట్లు పోలీసులు విచారణలో తేలింది. అయితే ఆ వీఆర్వోను విచారించగా అదే కాలనీకి చెందిన అనిల్ అనే వ్యక్తి తన పేరుమీద కారు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనిల్‌ను పోలీసులు విచారణ చేయగా ఆరు నెలల కిందట నగరంలోని ఓ ప్రైవేటు డ్రైవింగ్ స్కూలుకు లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 19న నలుగురు వ్యక్తులు ఆ డ్రైవింగ్ స్కూలు వద్దకు వెళ్లి తమ ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స ఇచ్చి, వారి ద్విచక్రవాహనంను డిపాజిట్టు చేసి కారును అద్దెకు తీసుకుని, అదే కారును కిడ్నాప్‌నకు ఉపయోగించారు. నిందితుల వివరాలను పోలీసులు ఇప్పటికే రాబట్టినట్లు తెలిసింది. ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసుల వర్గాల ద్వారా అందిన సమాచారం. బుక్కరాయసముద్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Aug 21 , 2024 | 11:55 PM