కేశవరెడ్డి రాజకీయ అరంగేట్రం
ABN, Publish Date - Jul 14 , 2024 | 03:47 AM
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత ఎన్.కేశవరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు.
బీజేపీలో చేరిన కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత
రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో భేటీ
కర్నూలు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత ఎన్.కేశవరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇటీవలే ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆయన శనివారం విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. విద్యారంగంలో సాధించిన విజయాల స్ఫూర్తితో క్రియాశీల పాత్ర పోషించి ప్రజలకు తనవంతు సేవలందించే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు.విద్యా రంగంలో 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన కేశవరెడ్డి.. ఆర్‌ఎ్‌సఎస్ భావజాలం, విద్యా రంగంలో సాధించిన విజయాలు స్ఫూర్తిగా రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేశాయని ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం కాకరవాడ గ్రామానికి చెందిన కేశవరెడ్డి చదువుకునే రోజుల్లో ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తగా పని చేశారు. 1983లో బీఈడీ పూర్తి చేసిన ఆయన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉపాధ్యాయునిగా పని చేసిన అనుభవంతో 1993లో నంద్యాల పట్టణంలో కేశవరెడ్డి స్కూల్ పేరిట ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. అది అనతికాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో 30 శాఖల్లో ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు 30 వేల మందికి పైగా విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ రంగాల్లో 3 వేల మందికిపైగా ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు.
ప్రజా సేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి..: కేశవరెడ్డి
విద్యా రంగంలో 30 ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందిస్తూ లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దాను. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చాను. గతంలో ఆర్‌ఎ్‌సఎస్ కార్యకర్తగా, సరస్వతి విద్యా మందిరాల్లో ఉపాధ్యాయుడిగా పని చేసిన అనుభవం, ఆ సంస్థలతో ఉన్న అనుబంధంతో బీజేపీలో చేరాను. ఏ మాత్రం రాజీపడకుండా కులమతాలకు అతీతంగా ప్రజా సేవ చేయడంతో ముందుంటాను. బీజేపీ ఆశయాలకు, తన మనోభావాలకు ఎంతో సారూప్యత ఉండడంతోనే ఆ పార్టీలో చేరాను. ఓ వైపు విద్యా సేవలు, మరో ప్రజా సేవలో ముందుంటూ పార్టీ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను.
Updated Date - Jul 14 , 2024 | 03:47 AM