రాములోరి లగ్నం... వేదిక సిద్ధం...
ABN, Publish Date - Apr 21 , 2024 | 11:34 PM
ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. గతంలో లాగా రాత్రి 8 గంటలకు కాకుండా ఈ ఏడాది సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య కల్యాణాన్ని నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.
నేడు అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ ఏర్పాటు
గ్యాలరీలో ఎయిర్ కూలర్లు.. భక్తుల కోసం ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు
సీతారాముల కల్యాణం చూతము రారండి...
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి..
చూచువారులకు చూడముచ్చటట... పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట....
భక్తి యుక్తులకి ముక్తి ప్రాదమట...
కళ్యాణం చూతము రారండి....
సరి కల్యాణపు బొట్టును పెట్టి...
మణి బాసికమును నుదుటను కట్టి... నుదుటను కట్టి...
పారాణిని పాదాలకు పెట్టి... పెళ్లి కూతురై వెలసిన సీతా కళ్యాణం చూతము రారండి...
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి..
రాజంపేట/ఒంటిమిట్ట, ఏప్రిల్ 21 : ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. గతంలో లాగా రాత్రి 8 గంటలకు కాకుండా ఈ ఏడాది సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య కల్యాణాన్ని నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఒంటిమిట్ట కోదండరామాలయ కల్యాణోత్సవానికి దేశంలోనే విభిన్న నేపధ్యం ఉంది. అన్నిచోట్లా పగటి పూట కల్యాణం నిర్వహిస్తే ఇక్కడ మాత్రం నెలరాజు నిండు పున్నమి వెన్నెల్లో రాత్రివేళ కల్యాణం జరపడం ఓ ప్రత్యేకత. శ్రీరాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. అందువల్ల ఆయన పరిణయ మహోత్సవాలు అయోధ్యలోనైనా.. భద్రాద్రిలోనైనా.. దేశవ్యాప్తంగా ఏ ఇతర ప్రసిద్ధ రామాలయ క్షేత్రాలలోనైనా నవమినాడే అభిజిత్ లగ్నంలో పగటిపూట మాత్రమే జరపడం ఆనవాయితీ. అయితే అందుకు భిన్నంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు, మహాలక్ష్మీ స్వరూపిణి సీతమ్మను పరిణయమాడే మహత్తర ఉత్సవం చైత్రశుద్ధ పౌర్ణమి నాటి రాత్రివేళ నిర్వహించడం ఏకశిలా నగరి ఒంటిమిట్టకు మాత్రమే ప్రత్యేకత.
కల్యాణ వేదిక సిద్ధం
సీతారాముల కల్యాణానికి కళ్యాణ వేదికను సర్వాంగసుందరంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్నప్రసాదాలు, తాగునీరు, విద్యుత్, పుష్ప, అలంకరణలు, భద్రత, సౌండ్ సిస్టమ్, ఎల్‌ఈడీ టీవీలను టీటీడీ ఏర్పాటు చేసింది. టీటీడీ నిఘా, భద్రత విభాగం జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అదే విధంగా వేదిక వద్ద బారికేడ్లు, రోప్‌లు, మెగా ఫ్యాన్లు కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. భక్తులకు వేసవి ఉపశమనం కోసం 200కి పైగా ఎయిర్ కూలర్‌లు ఏర్పాటు చేశారు. కల్యాణ వేదికను 30 వేల కట్‌ఫ్లవర్‌లతో సహా నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలతో తెలుగుదనం ఉట్టిపడేలా అలంకరిస్తున్నారు. దాదాపు 100 మంది నిపుణులు రెండు రోజులుగా పుష్పాలంకరణలు చేస్తున్నారు. కల్యాణానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు
సీతారాముల కల్యాణం సందర్భంగా ఎస్పీ సిద్ధార్త్ కౌశల్ పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి భద్రతా ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. సీతారాముల కల్యాణానికి పెద్దఎత్తున భక్తులు రానున్న నేపధ్యంలో పకడ్భందీ భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాలన్నారు. ఒంటిమిట్టలోని కోదండరామాలయం కల్యాణ వేదిక, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ వెంకటరాముడు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్‌ఎ్‌సఎ్‌సవి కృష్ణారావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ బి.రాజు, ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు, ఎస్‌ఐ మధుసూదన్‌రావు, సిద్దవటం ఎస్‌ఐ పెద్ద ఓబన్న తదితరులు పాల్గొన్నారు.
కల్యాణోత్సవానికి కోటి తలంబ్రాలు
శ్రీరాముని కల్యాణానికి శ్రీచైతన్య సంఘం కోరుకొండ తూర్పు గోదావరి జిల్లా వారు ప్రతిఏటా శ్రీరామచంద్రునికి గోటితో చేసిన కోటి తలంబ్రాలు పంపించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ నుంచి అప్పారావు నేతృత్వంలో తీసుకువచ్చిన తలంబ్రాలకు టీటీడీ అర్చకులు శ్రావణ్‌కుమార్, వీణారాఘవాచార్యులు రామాలయం ఎదురుగా ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
మోహినీ అలంకారంలో జగన్మోహనుడు
కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఆదివారం ఉదయం మోహినీ అలంకారంలో రాములవారు జగన్మోహనకారుడిగా దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళవాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.
గరుడవాహనంపై కోదండరాముడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు రాత్రి గరుడ వాహనంపై సీతారామలక్ష్మణులు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి వాహన సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
Updated Date - Apr 21 , 2024 | 11:34 PM