రైల్వేకోడూరును పండ్ల రాజధానిగా చేస్తా
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:29 AM
రైల్వేకోడూరును పండ్ల రాజధానిగా చేస్తామని, ఇక్కడ స్కిల్ డెవపల్‌మెంట్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని తద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్ తెలిపారు. శుక్రవారం రైల్వేకోడూరు మండలంలోని మైసూరివారిపల్లె
కూటమి ప్రభుత్వంతోనే గ్రామాలు బలోపేతం
స్వర్ణ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఉపముఖ్యమంత్రి పవనకళ్యాణ్
మైసూరివారిపల్లె గ్రామసభ విజయవంతం
రైల్వేకోడూరు, ఆగస్టు 23: రైల్వేకోడూరును పండ్ల రాజధానిగా చేస్తామని, ఇక్కడ స్కిల్ డెవపల్‌మెంట్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని తద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్ తెలిపారు. శుక్రవారం రైల్వేకోడూరు మండలంలోని మైసూరివారిపల్లె జనసేన మహిళా సర్పంచ కారుమంచి సంయుక్త అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు ఆయన హాజరయ్యారు. ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి, వందేమాతరం గేయాన్ని విద్యార్థులు ఆలపించిన అనంతరం సభ ప్రారంభించారు. ఈ సందర్భంగా పవనకళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం పచ్చగా ఉంటుందన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సగర్వంగా గ్రామ సభలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా చేస్తే.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నిధులు ఇచ్చి బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలను స్వర్ణ పంచాయతీలుగా తీర్చిదద్దడమే గ్రామసభ లక్ష్యమని తెలిపారు. రైల్వేకోడూరును పండ్ల రాజధానిగా చేస్తామని అన్నారు. రైల్వేకోడూరులో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక్కడ నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే రైల్వేకోడూరు ప్రాంతమే కాకుండా మొత్తం రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఒక మహిళ ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. అన్నమయ్య డ్యాం తెగిపోయినప్పుడు జరిగిన నష్టాన్ని చూసి తన హృదయం చలించిపోయిందన్నారు. ఆ పరిస్థితిలో తనకు అధికారం ఉంటే ఏదో ఒకటి చేయగలిగే వాడినని తెలిపారు. యువత నుంచి తాను కోరుకునేది ఒకటేనని.. అదే సామాజిక బాధ్యత అని యువతకు సందేశం ఇచ్చారు. అదేవిధంగా మంగంపేట బెరైటీస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని, మంగంపేటలో ఉద్యోగాలను యువతకు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైసూరివారిపల్లెలో పక్కా గృహాలు కావాలని అడిగారని వెంటనే మంజూరు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే ఏపీఎండీసీపై దృష్టి సారించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అదేవిధంగా రైతులకు పంటను గిట్టుబాటు ధరలకు అమ్ముకునేందుకు శీతలగిడ్డంగి ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా పర్యవేక్షించి ఏర్పాటు చేయిస్తామన్నారు. ఆస్పత్రి కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. అరటికి బీమా రావడం లేదని రైతులు చెప్పడంతో దీన్ని కూడా పర్యవేక్షిస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసిందని, పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. మైసూరివారిపల్లె మహిళా సర్పంచ కారుమంచి సంయుక్త భర్త వెంకటసుబ్బయ్య మాజీ సైనికుడు అని, ఆయన భౌతికంగా లేకపోయినా గ్రామ ప్రజలు అండగా నిలిచి పంచాయతీ సర్పంచగా గెలిపించడంతో తన గుండె కదిలిందన్నారు. ఇలాంటి ఆడబిడ్డ రాజకీయాల్లో ఉండాలని అనుకున్నామని తెలిపారు.
అనంతరం మైసూరివారిపల్లె సర్పంచ కారుమంచి సంయుక్త మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్ తమ గ్రామ పంచాయతీకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యాన పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని, గుంజననదికి రక్షణగోడ నిర్మాణం, సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజి సౌకర్యం కావాలని కోరారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ రైల్వేకోడూరును ఆంధ్రప్రదేశ ఉద్యాన రాజధానిగా పిలుస్తారన్నారు. ఏపీఎండీసీలో రైల్వేకోడూరు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కలెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా పరిపాలన పారదర్శకత, జవాబుదారీ తనాన్ని బలోపేతం చేయవచ్చని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తితో జిల్లాను ముందుకు తీసుకెళ్లడానికి అన్ని విధాల కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్టీరామారావు తర్వాత చలనచిత్ర పరిశ్రమ నుంచి వచ్చి రాజకీయంగా బలమైన నేతగా ఎదిగిన నాయకుడు పవనకళ్యాణ్ అని కొనియాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గ్రామాలు బలోపేతం అవుతాయని, గత ప్రభుత్వం గ్రామాలను నిర్వీర్యం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జ్ ముక్కా రూపానందరెడ్డి, రాయలసీమ జోన ఇనచార్జులు పగడాల వెంకటేశ, జోగినేని మణి, జనసేన నాయకుడు యనమల భాస్కర్‌రావు, జనసేన కడప నియోజకవర్గ ఇనచార్జి సుంకర శ్రీనివాస్, జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
మైదానానికి 30 సెంట్ల స్థలం వితరణ
మైసూరివారిపల్లెలో ప్రభుత్వ భూమి 8 సెంట్లు మాత్రమే ఉండడం ఆశ్చర్యంగా ఉందని పవన కళ్యాణ్ అన్నారు. యువత, విద్యార్థులు క్రీడా మైదానం కావాలని కోరుతున్నారని, దాతలు ముందుకు వస్తే ఆటస్థలం ఏర్పాటు చేస్తామన్నారు. వెంటనే స్పందించిన రైతు కారుమంచి నారాయణ తనకు ఉన్న 30 సెంట్ల స్థలాన్ని ఇస్తానని ప్రకటించడంతో పవనకళ్యాణ్ ఆయనను వేదికపైకి పిలిచి అభినందించారు.
పలువురు ఘనస్వాగతం
గ్రామసభకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్‌కు కూటమి నాయకులు ఘనంగా స్వాగతం ఫలికారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో పవన రేణిగుంట విమాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన 10:40 గంటలకు మైసూరివారిపల్లెకు చేరుకున్నారు. పవనకళ్యాణ్‌కు అడుగుడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. సభ మధ్యాహ్నం 12:40కు ముగియగా, 1:20కు రాజంపేటకు బయలుదేరివెళ్లారు.
Updated Date - Aug 24 , 2024 | 12:29 AM