ప్రభుత్వాస్పత్రికి రక్షణ కరవు
ABN, Publish Date - Aug 24 , 2024 | 11:29 PM
బి.కొత్తకోట కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు రక్షణ కరువైంది. గేటు వద్ద భద్రత లేకపోవడంతో ఎప్పుడు ఏంజరుగుతుందోన ని ఆస్పత్రిలో పనిచేసే మహిళా సిబ్బందితోపాటు ఆస్పత్రికి రోగులకు తోడుగా వచ్చే మహిళలు ఆందోళన చెందుతున్నారు.
ఇష్టారాజ్యంగా ద్విచక్రవాహనాల పార్కింగ్ రాత్రింబవళ్లు అపరిచితుల కదలికలు ఆందోళనలో మహిళా సిబ్బంది
బి.కొత్తకోట, ఆగస్టు24: బి.కొత్తకోట కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌కు రక్షణ కరువైంది. గేటు వద్ద భద్రత లేకపోవడంతో ఎప్పుడు ఏంజరుగుతుందోన ని ఆస్పత్రిలో పనిచేసే మహిళా సిబ్బందితోపాటు ఆస్పత్రికి రోగులకు తోడుగా వచ్చే మహిళలు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో ట్రైనీ వైద్యురాలిపై పైశాచికదాడితో పాటు హత్యా సంఘటన నేపథ్యంతో దేశం యావత్తూ ఉలిక్కిపడింది. దీంతో ప్రతి రాష్ట్రం, జిల్లా, స్థానిక ఆసు పత్రులలో మహిళా వైధ్యసిబ్బందికి రక్షణ ఏ మేరకు ఉందన్న చర్చ, పరిశీలన మొదలైంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట నగరపంచాయతీ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మహిళా సిబ్బంది రక్షణపై ఆందోళన నెలకొంది. బి.కొత్తకోట కమ్యూనిటీ హెల్త్‌సెం టర్‌లో 24గంటలు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళల్లో సైతం మహిళాసిబ్బంది విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే ఈ సిబ్బంది రక్షణపై అనేక అనుమానాలున్నాయి. ఆసుపత్రి భవనం నగరంలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉండటం, ప్రధానద్వారం వద్ద సెక్యూరిటీ లేకుండా పోవడంతో ప్రతిరోజూ వందలసంఖ్యలో ఆసుపత్రి ఆవరణలో ద్విచక్రవాహనాల పార్కింగ్ జరుగుతోంది. ఎప్పుడో ఉదయం నిలిసిన వాహనాలను ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుని వెళ్లడంతోపాటే ఏ అర్థరాత్రికో వచ్చి వెళుతున్న ఘటనలు నిత్యకృత్యం. మరోవైపు ఆసుపత్రి భవన సముదాయం లోంచి వెనుక వైపునున్న వీధిలోనికి దారిచేసుకొని అపరిచిత వ్యక్తులు రాత్రిళ్లు సంచారం చేస్తూనే ఉంటారు. ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ లేదు. ఆ ద్వారం ఎల్లప్పుడూ తెరచుకునే ఉం టుంది. దీంతో ఎవరు పేషెంట్ల తాలూకు వ్యక్తులో... ఎవరు కాదో తెలుసుకునే వారూ..లేరు , తెలుసుకునే అవకావమూ లేదు. జరగరాని సంఘ టనలు ఏదైనా జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆసుపత్రి సిబ్బంది, పట్టణ ప్రజలు కోరుతున్నారు.
ఆస్పత్రిలో శాంతిభద్రతల బాధ్యత పోలీసులదే..
బి. కొత్తకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో ద్విచక్ర వాహనాల నిలిపివేత, శాంతిభద్రతలు పోలీసు శాఖా వారిదేనని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చీఫ్ కిరణ్ పేర్కొన్నారు. ఆస్పత్రి రక్షణ విషయం పోలీసులదే. ఇక ఆస్పత్రి ప్రధాన ద్వారం 24 గంటలు అత్యవసర పరిస్థితులలో రోగులు, ఇతర అంబులెన్సలు వచ్చిపోవడానికి వీలుగా తెరిచే ఉంటుంది. ప్రధాన ద్వారం మూయడానికి వీలుండదు. ఇక ఆస్పత్రి ఆవరణలో ద్విచక్రవాహనాలు పెట్టకుండా చర్యలు తీసుకోవాల్సింది పోలీసుల పని. ఇందులో వైద్యులకు ఎలాంటి సంబంధం లేదు. కమ్యూనిటీ సెంటర్‌కు సెక్యురిటీ తక్కువగా ఉండడంతో ఒక్కొక్కరే విధులు నిర్వర్తింస్తుండడంతో ఆస్పత్రికి ఎవరంటే వారు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటే వారిని కంట్రోలు చేయడం కష్టంగానే ఉంటుందన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 11:29 PM