జోగి రమేశ్‌ను అదుపులోకి తీసుకోవాలి
ABN, Publish Date - Aug 08 , 2024 | 02:18 AM
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఇంటిపై జరిగిన మూకదాడి వెనుక కుట్రకోణం ఉందని,
ముందస్తు బెయిల్‌కు అనర్హుడు
బాబు ఇంటిపై దాడి వెనుక కుట్ర
ఏం జరిగిందో తేలాలంటే విచారించాల్సిందే
హైకోర్టులో పోలీసుల తరఫున
సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వాదనలు
దురుద్దేశంతోనే కేసుజోగి తరఫు న్యాయవాది
అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఇంటిపై జరిగిన మూకదాడి వెనుక కుట్రకోణం ఉందని, దీనిని వెలికి తీస్తేనే వాస్తవాలు తెలుస్తాయని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టుకు తెలిపారు. కుట్ర కోణం తెలియాలంటే మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేయాల్సి ఉందన్నారు. పిటిషనర్(జోగి) ప్రోద్బలంతో 30 నుంచి 40 మంది చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని తెలిపారు. అదేసమయంలో పలువురిపై దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ‘‘బయటకు రా! చంపేస్తాం’’ అంటూ చంద్రబాబును బెదిరిస్తూ నినాదాలు చేశారని వివరించారు. కేసు దర్యాప్తును పిటిషనర్ ప్రభావితం చేశారని తెలిపారు. అప్పట్లో దర్యాప్తు అధికారి నామమాత్రపు సెక్షన్లు పెట్టి, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారన్నారు.
పిటిషనర్, ఆయన అనుచరుల దాడిలో బాధితులపై అట్రాసిటీ కేసులు పెట్టారని తెలిపారు. ప్రస్తుత కేసులో హత్యాయత్నం(సెక్షన్ 307)ను చేర్చారని, ముందస్తు బెయిల్ పొందేందుకు పిటిషనర్ అనర్హుడని పేర్కొన్నారు. కోర్టుకు వాస్తవ వివరాలు వెల్లడించకుండా పిటిషనర్ దాచిపెట్టారన్నారు. వాటిని కోర్టుముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వీఆర్‌కే కృపాసాగర్ విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు. టీడీపీ అధినేత నివాసంపై మూకదాడి వ్యవహారంలో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీమంత్రి జోగి రమేశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని తెలిపారు. గతంలో పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చారన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి పిటిషనర్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారని తెలిపారు. కాగా, బుధవారం కోర్టు సమయం ముగియడంతో వాదనల కొనసాగింపు కోసం విచారణను వాయిదా వేశారు.
Updated Date - Aug 08 , 2024 | 02:19 AM