తెల్లారితే కొత్తింట్లోకి.. ఈలోపే తెల్లారిన బతుకులు
ABN, Publish Date - Jul 15 , 2024 | 04:21 AM
తెల్లారితే కొత్త ఇంట్లోకి వెళ్దామనుకున్న ఆ దంపతులు.. శిథిలావస్థకు చేరిన మట్టి మిద్దె కూలి తెల్లారకముందే ప్రాణాలు కోల్పోయారు.
వర్షానికి మట్టి మిద్దె కూలి దంపతుల మృతి
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
అనంతపురం జిల్లా హావళిగి గ్రామంలో విషాదం
విడపనకల్లు, జూలై 14: తెల్లారితే కొత్త ఇంట్లోకి వెళ్దామనుకున్న ఆ దంపతులు.. శిథిలావస్థకు చేరిన మట్టి మిద్దె కూలి తెల్లారకముందే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. అనంతపురం జిల్లా విడపకనల్లు మండలం హావళిగి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన కోనప్పగారి మారెప్ప(48) వ్యవసాయ కూలి. ఆయనకు భార్య లక్ష్మీదేవి(44), కుమార్తె మానస, ఇద్దరు కుమారులున్నారు. మానసకు పుట్టుకతోనే మాటలు రావు. పెద్ద కుమారుడు బేల్దారి పనికి వెళ్తుండగా, చిన్న కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వీరు నివసిస్తున్న మట్టి మిద్దె శిథిలావస్థకు చేరింది. దీంతో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. శనివారమే కొత్త ఇంటి స్లాబు కూడా వేశారు. పాత ఇల్లు కూలిపోతుందనే భయంతో వెంటనే కొత్త ఇంట్లోకి వెళ్లిపోదామనుకున్నారు. అయితే, స్లాబు వేసిన రోజే కొత్త ఇంట్లో నిద్రించకూడదని, శనివారం రాత్రికి అందరూ పాత ఇంట్లోనే నిద్రించారు. ఆదివారం ఉదయం కొత్త ఇంట్లోకి చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. లక్ష్మీదేవి తమ్ముడు రాము కూడా వీరితోపాటు అదే ఇంట్లో నిద్రించారు. శనివారం సాయంత్రం కురిసిన చిన్నపాటి గాలి వానకు మట్టి మిద్దె తడిసిపోయి అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఇంటి మధ్యలో నిద్రిస్తున్న మారెప్ప, లక్ష్మీదేవి మట్టి కింద కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. మానస, రామును గ్రామస్థులు కాపాడి 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. మారెన్న కుమారులు అంజి, హనుమంతు ఇంటి వరండాలో నిద్రించడంతో క్షేమంగా బయటపడ్డారు.
వైసీపీ కార్యకర్తకు దక్కని జగనన్న ఇల్లు..
మారెప్ప పక్కా వైసీపీ కార్యకర్త. అయినా వీరికి వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లు మం జూరుకాలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మారెప్ప పేరున ఇంటి బిలు ్లను కాంగ్రెస్ నాయకులు డ్రా చేసుకుని స్వాహా చేయడం వల్ల మారెప్పకు వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు మంజురు కాలేదని తెలిసింది. ప్రమాద ఘటనపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదంపై జిల్లా అధికారులకు సమగ్ర నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.
Updated Date - Jul 15 , 2024 | 04:21 AM