ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్వేతపత్రంలో.. మన అక్రమాలు

ABN, Publish Date - Jul 15 , 2024 | 11:38 PM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జరిగిన అక్రమాలను ప్రస్తావించారు.

గుంటూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై సీఎం చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జరిగిన అక్రమాలను ప్రస్తావించారు. ఇసుక, అటవీ భూముల కబ్జా, మాజీ సీఎం జగన్‌కు చెందిన సరస్వతి పవర్‌ భూముల జీవో రద్దు అంశాలను వివరించారు. ఇసుక తవ్వకాలను ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టారని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా యంత్రాలను వినియోగించి కృష్ణానదిలో నుంచి ఇసుకని తోడేశారు. గుండిమెడ(తాడేపల్లి)లో 3 లక్షల మెట్రిక్‌ టన్నులను ఈ విధంగా నది గర్భంలో నుంచి బయటకు తీశారని పేర్కొన్నారు. ఇక అమరావతిలో ఏకంగా నదిలోనే ర్యాంపులు నిర్మించి ఇసుక వాహనాల కోసం రాచమార్గం ఏర్పాటు చేశారు. దాని వలన నది ప్రవాహానికి ఆటంకం మారి దిశలు మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. అంతేకాకుండా ఇసుకని ఒక మీటర్‌ కంటే ఎక్కువ లోతులోకి వెళ్లి తవ్వారు. మరోవైపు వారికి కేటాయించిన ప్రదేశాన్ని దాటి తవ్వేశారని చెప్పారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ గత ఏడాది మార్చి 23వ తేదీన ఇసుక తవ్వకాలను నిలిపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు చెందిన దండా నాగేంద్ర, కంచేటి సాయి దీనిపై ఫిర్యాదు చేశారు. వారి వాదనలతో ఎన్‌జీటీ ఏకీభవించి రూ. 18 కోట్లు మధ్యంతర పెనాల్టీని జేపీ వెంచర్స్‌ లిమిటెడ్‌పై విధించింది. ప్రభుత్వంపై కేసు వేశారన్న అక్కసుతో కంచేటి సాయి, దండా నాగేంద్రలను వేధించారు. ఎస్‌సీ ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టం, పీడీ యాక్టు కేసులు పెట్టి జిల్లా నుంచి బహిష్కరించారని చెప్పారు. అయినప్పటికీ ఆపకుండా అక్రమ ఇసుక తవ్వకాలను కొనసాగించారని తెలిపారు. దాంతో వారు సుప్రీం కోర్టుని ఆశ్రయించారని చెప్పారు. ఎన్‌జీటీ ఆదేశాలను యథాతథంగా అమలు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు చెప్పడంతో కలెక్టర్ల ద్వారా ఇసుక తవ్వకాలన్ని సవ్యంగా జరిగాయని తప్పుడు నివేదికలు ఎన్‌జీటీకి పంపించారని సీఎం చంద్రబాబు చెప్పారు. దీని దృష్ట్యా తమ ప్రభుత్వం శాటిలైట్‌ చిత్రాలు, ఇతర సాంకేతిక విఽధానాలను అవలంభించి ఇసుక ఎంత మేరకు అక్రమంగా తవ్వకాలు చేశారో త్వరలోనే నిర్ధారిస్తామన్నారు.

పల్నాడు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో మొత్తంగా 108.81 హెక్టార్ల అటవీ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై అటవీ చట్టం కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగిందన్నారు. కాగా 2014కు ముందు మాజీ సీఎం జగన్‌ తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని పల్నాడు జిల్లా మాచాయపాలెంలో సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమెటెడ్‌ని ఏర్పాటు చేసి ప్రజల భూములను తక్కువ ధరకే సేకరించారు. అయితే ఐదేళ్లలో సున్నపురాయి లీజులను ఆపరేషన్‌లోకి తీసుకురాకపోవడంతో తమ ప్రభుత్వం అప్పట్లో లీజులను రద్దు చేసిందన్నారు. 2019లో జగన్‌ సీఎం అయ్యాక హైకోర్టులో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ ద్వారా ఆ ఉత్తర్వులను రద్దు అయ్యేలా చేసుకొన్నారని చెప్పారు. ఈ విధంగా శ్వేతపత్రంలో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జరిగిన అక్రమాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.

Updated Date - Jul 15 , 2024 | 11:38 PM

Advertising
Advertising
<