కొలకలూరులో ఆహ్వాన నాటికల పోటీలు ప్రారంభం
ABN, Publish Date - May 17 , 2024 | 01:16 AM
రూరల్ మండలంలోని కొలకలూరులో ఆహ్వాన నాటికల పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి.
తెనాలి అర్బన్, మే 16: రూరల్ మండలంలోని కొలకలూరులో ఆహ్వాన నాటికల పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. కొలంకపురి నాటక పరిషత్, వైకే నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలను బొప్పన నరసింహారావు, కారంపూడి వెంకట్రావు ప్రారంభించారు. పరిషత్ గౌరవాధ్యక్షుడు స్వామి అధ్యక్షతన జరిగిన సభలో లంకా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కళలను, కళాకారులను ఆదరిస్తున్న పరిషత్‌లను అభినందించారు. సమాజాన్ని నాటికలు తట్టి లేపుతాయని, సన్మార్గంలో నడిచేలా చూపుతాయన్నారు. రంగస్థల నటుడు ముత్తవరపు సురే్‌షబాబు, రచయిత పిన్నమనేని మృత్యుంజయరావులను ఘనంగా సన్మానించారు. కాట్రపాడు ఉషోదయ కళానికేతన్ కళాకారులు విముక్తి నాటిక ప్రదర్శించారు. ఈ నాటికను చెరుకూరి సాంబశివరావు రచించి, దర్శకత్వం వహించారు.
హైదరాబాద్ కళాంజలి కళాకారులు ప్రదర్శించిన రైతేరాజు నాటికను కంచర్ల సూర్యప్రకాశరావు రచించగా, కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. సమాజాన్ని ముందుండి నడిపించాల్సిన యువత మత్తు పదార్ధాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్న వైనాన్ని కళాకారులు నాటికలో ప్రదర్శించారు. వారిని మత్తు నుంచి విముక్తుల్ని చేద్దామంటూ నాటిక సందేశం ఇచ్చింది. గోపరాజు రమణ తదితరులు పర్యవేక్షించారు.
Updated Date - May 17 , 2024 | 01:16 AM