రోడ్ల విస్తరణ పేరుతో దోపిడీ
ABN, Publish Date - May 11 , 2024 | 12:43 AM
బాపట్ల పట్టణంలో రోడ్ల విస్తరణ పేరిట ఎమ్మెల్యే కోన రఘుపతి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్ ఆరోపించారు.
బాపట్ల,మే 10 : బాపట్ల పట్టణంలో రోడ్ల విస్తరణ పేరిట ఎమ్మెల్యే కోన రఘుపతి పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు అన్నం సతీష్ ప్రభాకర్ ఆరోపించారు. కూటమి అభ్యర్ధుల విజయం కోరుతూ శుక్రవారం సాయంత్రం భారీ ఎత్తున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నం సతీష్ ప్రభాకర్ పాల్గొని ఆయాప్రాంతాలలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ దోపిడి చేసిన వ్యక్తికి మద్దతుఇస్తారా లేక ప్రశాంతంగా బాపట్ల ప్రజలు జీవించేందుకు అవసరమైన తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారో మీరే నిర్ణయించుకోవాలన్నారు. బాపట్ల నియోజకవర్గాన్ని ఈ స్థాయిలో దోపిడి చేసిన వ్యక్తి గతంలో ఎన్నడూ లేరన్నారు. బాపట్ల చీలురోడ్డు ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్న రామాలయాన్ని తొలిగించాలని చూడటం దారుణమన్నారు. ఎమ్మెల్యే తండ్రి విగ్రహాన్ని పెట్టటానికి రామాలయాన్ని తొలిగించాలని చూసిన దుర్మార్గమైన వ్యక్తి బాపట్ల ప్రజలకు అవసరంలేదన్నారు. రామాలయంలోని శ్రీరాముని తొలిగించి ఆయన తండ్రిని పెట్టాలనుకునే కోన రఘుపతి దుర్మార్గపు చర్యలను తిప్పికొట్టాలన్నారు. బాపట్ల నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రామాలయం చుట్టూ ఉన్న ప్రహరి పడిపోతే నిర్మించటానికి వచ్చిన వ్యక్తిని బెదిరించి నిర్మించకుండా చేసిన వ్యక్తి కోన రఘుపతి అని విమర్శించారు. దుర్మార్గుడు, అహంకారి, అవినీతిపరుడు బాపట్ల ప్రజలకు అవసరమా అని అన్నం సతీష్ ప్రశ్నించారు? ఓటు ద్వారా ఇలాంటి వ్యక్తులను తరిమికొట్టి వేగేశన నరేంద్రవర్మను ఎమ్మెల్యేగా గెలిపించి దేవాలయానికి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు.
మత్తు పదార్దాలకు బానిసలవుతున్న యువత : తెన్నేటి
డ్రగ్స్, గంజాయి, నాసిరకం మద్యంతో యువత జీవితాన్ని పాలకులు నాశనం చేస్తున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్ధి తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల రైల్వేస్టేషన్ పరిసరాలలో గంజాయి తాగుతూ వచ్చిపోయే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. బాలికలు పాఠశాలకు వెళ్ళాలంటే వీరిని చూచి భయపడే పరిస్థితి నెలకొని ఉందన్నారు. ఇలాంటి వాటిని అరికట్టి స్వచ్ఛమైన పాలన, సేవలందించటానికి కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువతకు ఉద్యోగాలు, జిల్లాలో పెద్దఎత్తున పరిశ్రమలు వస్తాయన్నారు. తద్వారా లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
Updated Date - May 11 , 2024 | 12:43 AM