AP Govt : మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులకు 50% రిజర్వేషన్
ABN, Publish Date - Dec 11 , 2024 | 03:47 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్వోఆర్) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సగం పోస్టులు బీసీ, ఎస్సీ, ఎస్టీలకే
మొత్తం పదవుల్లో మహిళలకు 50 శాతం
జిల్లా యూనిట్‌గా ఖరారు చేయనున్న కలెక్టర్లు
అమరావతి, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్వోఆర్) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని మార్కెట్ కమిటీ చైర్మన్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు నియమితులు కానున్నారు. పలువురు ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు చైర్మన్ పదవులకు రిజర్వేషన్ అమలు చేయాలని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం 2019లో ఇచ్చిన జీవో77 ప్రకారం చైర్మన్ పదవులను రిజర్వుడు వర్గాలకు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా యూనిట్‌గా చైర్మన్ పదవులను 50% రిజర్వుడు వర్గాలకు కేటాయించనున్నారు. మిగతా 50% ఇతరులకు ఇవ్వనున్నారు. మొత్తంగా మహిళలకు 50% పదవులు దక్కనున్నాయి. బీసీ, మైనార్టీలకు 29%, ఎస్సీలకు 15% , ఎస్టీలకు 6% చైర్మన్ పదవులు ఇవ్వనున్నారు.
Updated Date - Dec 11 , 2024 | 03:47 AM