గనుల’ ఫైళ్లు గల్లంతు!
ABN, Publish Date - Jun 21 , 2024 | 03:50 AM
గనుల శాఖలో చీకటి దందాలు బయటకు రాకుండా అక్రమార్కులు ముందుగానే జాగ్రత్త పడ్డారు. కొత్త ప్రభుత్వం అప్రమత్తమయ్యేలోపే కీలకమైన నోట్‌ఫైళ్లను,
ఇసుక, సర్వేరాళ్లు, సెక్యూరిటీ డిపాజిట్ల నోట్ ఫైళ్లు మాయం
ఎన్నికల ఫలితాలు రాగానే
చించేసిన కీలక అధికారులు
రెగ్యులర్ రికార్డుల్లో
ఆనవాళ్లు కూడా లేకుండా జాగ్రత్తలు
ఉన్నతాధికారి వ్యక్తిగత సహాయకుడికి
వాటిని తగులబెట్టే బాధ్యతలు
ఫైళ్లు, ఇతర సామగ్రిని బయటికి
తీసుకెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డు
అంతా ముగిసిన తర్వాత గనుల శాఖ,
ఏపీఎండీసీ కార్యాలయాలు సీజ్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గనుల శాఖలో చీకటి దందాలు బయటకు రాకుండా అక్రమార్కులు ముందుగానే జాగ్రత్త పడ్డారు. కొత్త ప్రభుత్వం అప్రమత్తమయ్యేలోపే కీలకమైన నోట్‌ఫైళ్లను, ఇతర డాక్యుమెంట్లను మాయం చేసేశారు. ఇసుక, మాంగనీస్, బీచ్‌శాండ్, బొగ్గు, వివిధ రకాల ఖనిజాలకు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్ (ఎల్‌వోఐ)లకు సంబంధించిన నోట్ ఫైళ్లను గనుల శాఖ కీలక అధికారి, మరో ముగ్గురు అధికారులు కలసి ఆనవాళ్లు కనబడకుండా చేసినట్లు సమాచారం. మాంగనీస్ టెండర్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను దారి మళ్లించిన కేసులో ఉన్నతాధికారుల పాత్ర వెలుగు చూస్తుండటంతో ఈ కేసుతో పాటు ఇసుక, బొగ్గు, సర్వే రాళ్లకు సంబంధించిన ఫైళ్లను కూడా రెగ్యులర్ రికార్డుల నుంచి తొలగించి, చింపివేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వాటిని తగులబెట్టే బాధ్యతను శాఖలోని ఓ ఉన్నతాధికారి వద్ద పనిచేసే వ్యక్తిగత సహాయకుడికి అప్పగించినట్లు సమాచారం.
ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే పెద్ద ఎత్తున ఫైళ్లు, ఇతర సామగ్రిని అతను బయటకు తీసుకెళ్లడం ఇతర ఉద్యోగులు గమనించారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలోనూ రికార్డయిందని తెలిసింది. చేతికి మట్టి అంటకుండా, అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు ముందుగానే నోట్‌ఫైళ్లను తొలగించినట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో గనుల శాఖ కీలక అధికారితో పాటు మరో ముగ్గురు సీనియర్ అధికారుల పాత్రపై చర్చ జరుగుతోంది. నిధుల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు వెలుగు చూసిన తర్వాతే కూటమి సర్కారు అప్రమత్తమైంది. ఇబ్రహీంపట్నం, తాడిగడపలోని గనుల శాఖ, ఏపీఎండీసీ కార్యాలయాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసింది. అయితే అప్పటికే ఈ మొత్తం గోల్‌మాల్ జరిగిపోయినట్లు తెలిసింది.
గుట్టు విప్పే నోట్‌ఫైళ్లు ముక్కలు
మాంగనీస్ టెండర్లకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసిన సెక్యూరిటీ డిపాజిట్ గనుల శాఖ ఖాతాల్లో ఉంది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వాడుకొని ఆ నిధులను ఉన్నతాధికారులు దారిమళ్లించి సొంతానికి వాడుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన మూడు నోట్‌ఫైళ్లను ఇబ్రహీంపట్నంలోని ఆఫీసులో ఈ నెల 6వ తేదీ రాత్రే ముక్కలు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత సర్వేరాళ్ల కొనుగోలు ఫైళ్లలోని నోట్‌ఫైళ్లను కూడా తొలగించి చింపివేసినట్లు సమాచారం. శాఖలో ఓ ఉన్నతాధికారి తన బావమరిదితో కంపెనీ ఏర్పాటు చేయించి సర్వేరాళ్ల సరఫరా టెండర్ ఆయనకే దక్కేలా చక్రంతిప్పారు. ఈ ఒక్క అంశంలోనే దాదాపు రూ.350కోట్ల మేర అక్రమాలు జరిగాయి. గత నవంబరులో ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో రాళ్ల కొనుగోలు ఫైలులోని నోట్‌ఫైళ్లనూ చింపివేసినట్లు తెలిసింది.
ఇదే సమయంలో తాడిగడప ఏపీఎండీసీ కార్యాలయంలోనూ కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లను ఇద్దరు అధికారులు తొలగించినట్లు సమాచారం. 2019 ఆగస్టు నుంచి 2021 వరకు జరిగిన ఇసుక వ్యాపారంలోని లావాదేవీలు, వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపు, నోట్‌ఫైళ్లను కూడా గల్లంతు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మధ్యప్రదేశ్‌లోని సులియారీలో ఏపీఎండీసీకి బొగ్గు నిక్షేపాలున్నాయి. బొగ్గు తవ్వితీయడంతో పాటు ముడిబొగ్గును అమ్మే కాంట్రాక్టులు అదానీకి కట్టబెట్టారు. దీనికి సంబంధించిన ఫైళ్లను కూడా గుట్టుగా మాయం చేసినట్లు తెలిసింది. ఈ అంశాలపై విచారణ జరిగితే గనుల శాఖలో కీలక అధికారితో పాటు, ఆయన వ్యక్తిగత సహాయకుడు, మరో ముగ్గురు సీనియర్ అధికారులు, ఏపీఎండీసీలోని ఓ సలహాదారు, మరో ఇద్దరు సీనియర్ అధికారుల పాత్ర బయటకొస్తుంది. వీరంతా కలసి కీలక ఫైళ్లను మాయం చేసిన తర్వాతే రెండు ఆఫీసులను సీజ్ చే శారని సీనియర్ అధికారులు కూడా చెబుతున్నారు.
ఆ కేసుతోనే అప్రమత్తం
గనుల శాఖ డైరెక్టరేట్ పరిధిలో సెక్యూరిటీ డిపాజిట్‌గా ఉన్న కోట్లాది రూపాయల నిధులను దారిమళ్లించి దోచుకున్న అంశం ఇటీవల వెలుగు చూసింది. దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, గుంటూరుకు చెందిన ఇసుక కాంట్రాక్టర్, మరో ప్రైవేటు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ కార్యాలయంలో కీలక అధికారి ప్రోద్బలంతో కేవలం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై మాత్రం కేసు నమోదు చేసి, ఉన్నతాధికారులను తప్పిస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు రావడంతో గనుల శాఖ అధికారులకు భవిష్యత్తు గుర్తుకొచ్చింది. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని కలలు కన్నవారు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆ తర్వాత 6వ తేదీ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10 గంటల వరకు శాఖలోని నలుగురు అధికారులు కీలక మంత్రాంగం నడిపారు. ఆ తర్వాతే ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసుకు సంబంధించిన నిధుల మళ్లింపులో వాస్తవాలు బయటపెట్టే మూడు నోట్ ఫైళ్లను చింపివేసినట్లు తెలిసింది.
Updated Date - Jun 21 , 2024 | 03:50 AM