ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పురపాలనలో చిత్రం.. భళారే విచిత్రం!

ABN, Publish Date - Aug 24 , 2024 | 05:31 AM

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తున్న మున్సిపల్‌శాఖ... ప్రధాన కార్యాలయమైన డైరెక్టరేట్‌లో తిష్ఠ వేసిన అధికారులను మాత్రం కదిలించలేకపోతున్నదన్న విమర్శలున్నాయి.

కమిషనర్లు, అడిషనల్‌ డైరెక్టర్ల పోస్టుల్లో మాయాజాలం

డైరెక్టరేట్‌లో ఏళ్లకేళ్లుగా అధికారుల తిష్ఠ

బదిలీలంటే కమిషనర్లకే పరిమితం!

ఇదీ మునిసిపల్‌ శాఖ పనితీరు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తున్న మున్సిపల్‌శాఖ... ప్రధాన కార్యాలయమైన డైరెక్టరేట్‌లో తిష్ఠ వేసిన అధికారులను మాత్రం కదిలించలేకపోతున్నదన్న విమర్శలున్నాయి. జేడీ కేడర్‌ పోస్టులో సీనియర్‌ అడిషనల్‌ డైరెక్టర్లు ఏళ్ల తరబడి తిష్ఠ వేశారని, దీంతో కమిషనరేట్‌ పనితీరులో ఎలాంటి మార్పులూ రావడం లేదన్న వాదనా ఉంది. కొందరు అధికారులు గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కేసుల్లోనూ ఉన్నారు. ఆ కేసులను మాఫీ చేసుకునేందుకు డైరెక్టరేట్‌ను కేంద్రంగా చేసుకున్నారనే విమర్శలున్నాయి. ఓ అడిషనల్‌ డైరెక్టర్‌ అయితే 11 సంవత్సరాలుగా డైరెక్టరేట్‌లోనే జేడీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తనపై ఉన్న అభియోగాలను క్లియర్‌ చేసుకునే పనిలో ఉన్నారు. మరో ముగ్గురు ఇదే స్థాయి అధికారులు జేడీలుగా ఉన్నారు. వారికి కొన్నేళ్లుగా బదిలీలే లేవు. మరో ఇద్దరు ఏడీలు కూడా డైరెక్టరేట్‌లో ఒకే సీట్‌లో ఏళ్ల తరబడి పాతుకుపోయారు. పలువురు అడిషనల్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులైతే, తక్కువ కేడర్‌లో పనిచేసినా... డైరెక్టర్‌ కార్యాలయం సేఫ్‌గా భావిస్తున్నారు. పలు కార్పొరేషన్లలో ఐఏఎస్‌ అధికారులను కమిషనర్లుగా నియమించడం, కొన్ని పట్టణ అథారిటీలకు ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్లపై వచ్చి వాలిపోవడంతో పదోన్నతి పొందిన అడిషనల్‌ డైరెక్ట్టర్లు తక్కువ కేడర్‌లో పనిచేయాల్సి వస్తోంది.

పదోన్నతితో హోదా వచ్చింది.. పోస్టు రాలే!

గత ప్రభుత్వ హయాంలో పలువురు అధికారులు పైరవీలు చేసుకుని, డీపీసీ ఏర్పాటు చేసుకుని పదోన్నతులు పొందారు. కొత్తగా పట్టణాభివృద్ధి అథారిటీలు ఏర్పాటు చేసి, పోస్టులు క్రియేట్‌ చేశారు. దీంతో అడిషనల్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులుగా పలువురు పదోన్నతి పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది అడిషనల్‌ డైరెక్టర్లుగా పదోన్నతి పొందినా... ఆ పదవులు మాత్రం వారికి దక్కలేదని చెబుతున్నారు. కడప, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులాంటి పలు కార్పొరేషన్ల కమిషనర్‌ పోస్టులు అడిషనల్‌ డైరెక్టర్‌, రీజినల్‌ డైరెక్ట్టర్‌ స్థాయి పోస్టులైనప్పటికీ వాటిని ఐఏఎస్‌ అధికారులతో భర్తీ చేశారు. కొన్ని పట్టణ అథారిటీల్లో ఇతర శాఖలకు చెందిన అధికారులు డిప్యూటేషన్‌పై వచ్చి పనిచేస్తుండడంతో మున్సిపల్‌ శాఖలో పదోన్నతులు పొందినా ప్రయోజనం లేదని, ఆ పోస్టుల్లో ఇతరులు దూరిపోయారని పలువురు అధికారులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా గురువారం మున్సిపల్‌ కమిషనర్ల బదిలీల్లో ఏలూరు కార్పొరేషన్‌కు ఆర్‌డీ కేడర్‌ స్థాయికి బదులు గ్రేడ్‌-1 కమిషనర్‌ను నియమించారు. అలాగే, ఒంగోలు కార్పొరేషన్‌లో కూడా గ్రేడ్‌-1 అధికారిని ఆర్‌డీ కేడర్‌ పోస్టులో పెట్టారు. ఆయా కార్పొరేషన్ల స్థాయిని అనుసరించి కాకుండా ఇష్టారీతిగా అధికారులను నియమించారు. దీంతో మున్సిపల్‌ శాఖలో అధికారుల సర్దుబాటు గందరగోళంగా మారిపోయింది.


వేరే శాఖల నుంచి వచ్చినోళ్లే కమిషనర్లు!

ఇతర విభాగాల నుంచి అధికారులు మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖలోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చి చేరుతున్నారు. ఎమ్మెల్యేలతో సిఫారసులు చేయించుకుని మునిసిపల్‌ కమిషనర్లుగా చేరిపోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50 మంది ఇలా కమిషనర్లుగా చేరారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి కమిషనర్ల సర్వీస్‌ రూల్స్‌లో ఏ పోస్టు కూడా డిప్యుటేషన్‌పై నియమించాలని లేకపోయినప్పటికీ అందుకు విరుద్దంగా నియామకాలు చేపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమాలకు నెలవుగా మున్సిపల్‌శాఖ

మున్సిపల్‌ శాఖలో ఎన్ని తప్పులు జరిగినా పట్టించుకునే నాథుడే లేరని, ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి ఇక్కడ అవినీతికి పాల్పడి నేరుగా సొంత శాఖలోకి వెళ్లిపోతున్నారని, జవాబుదారీతనం పూర్తిగా లోపించిందని చెబుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో, ఇతర తుఫానులు తదితర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అవసరమైన చోట పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇంజనీర్లు అడ్వాన్సులు తీసుకుంటారు. పనులు పూర్తయిన తర్వాత తిరిగి ఆయా బిల్లులు పూర్తిస్థాయిలో సమర్పించాలి. అలాంటి వారు బదిలీలు అయ్యేటప్పుడు వారు చేపట్టిన పనులు పోను మిగిలిన సొమ్ము తిరిగి చెల్లించాలి. అలా చేయకపోతే లాస్ట్‌ పే సర్టిఫికేట్‌(ఎల్‌పీసీ)లు ఇవ్వరు. అలా బదిలీ అయిన ఉద్యోగులు ఎల్‌పీసీలు లేకుండా జీతాలు పొందలేరు. పాలకొల్లులో ఓ ఇంజనీర్‌ ఎల్‌పీసీ లేకుండా బదిలీ కావడంతో రెండేళ్లుగా జీతం లేకుండానే పనిచేస్తున్నారు. డైరెక్టరేట్‌లో ఉన్న అధికారులు ఇవేమీ పట్టించుకోకపోవడం అసలు విషాదం. డైరెక్టరేట్‌ నిర్వహణ కోసం ప్రతి నెలా లక్షల్లో బిల్లులు పెట్టి అప్పనంగా ప్రభుత్వ సొమ్ము అక్రమంగా నొక్కేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇటీవల వచ్చిన కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ హరినారాయణ్‌ ఒక్క కాఫీ బిల్లు తప్ప తన వద్దకు ఆఫీసు నిర్వహణకు సంబంధించి బిల్లులు రాకూడదని హెచ్చరించాల్సి వచ్చిందంటే ఇక్కడ ఏ మేరకు నిర్వహణా వ్యయం దోపిడీ జరుగుతుందో అర్థమవుతుంది.

ఇతర శాఖల్లోని ఉద్యోగులే ఇక్కడ కమిషనర్లు. ఇతర విభాగాల్లో కింది కేడర్‌లో ఉండే అధికారులు ఇక్కడ పెద్ద పోస్టుల్లో చేరిపోతారు. ఇక్కడుండే పెద్ద కేడర్‌ అధికారులు వారి కింద పని చేయాల్సి ఉంటుంది. దీన్నంతటినీ సరి చేయాల్సిన ప్రధాన కార్యాలయంలోని అధికారులూ ఆ తానులోని ముక్కలే అన్నట్లుంది పరిస్థితి. ఏళ్లకు ఏళ్లు డైరెక్టరేట్‌లో పాతుకుపోయిన కొందరు అధికారులు తమపై ఉన్న అవినీతి ఆరోపణలను క్లియర్‌ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇక కొత్తగా అవినీతి అంతు చూసేదెక్కడ? ఇదీ స్థూలంగా మునిసిపల్‌ శాఖలోని విచిత్ర పరిస్థితి.

Updated Date - Aug 24 , 2024 | 05:33 AM

Advertising
Advertising
<