పల్లెకొచ్చిన.. చంద్రుడు
ABN, Publish Date - Aug 24 , 2024 | 01:04 AM
పల్లెకు చంద్రుడొచ్చాడు..వెలుగులు తెచ్చాడు.. మీ సమస్యలన్నీ పరి ష్కరిస్తానని వానపల్లిలో వరాలజల్లు కురిపించాడు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వాన పల్లిలో శుక్రవారం జరిగిన గ్రామసభలో సీఎం చంద్ర బాబు పాల్గొని మాట్లాడారు. పెట్టుబడి తగ్గించి ఆదాయం పెరిగేలా రైతులు వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
గ్రామాల రూపురేఖలు మారుస్తా
డ్వాక్రా మహిళల అభివృద్ధికి కృషి
రైతులకు అండగా ఉంటా
మూడు పంటలకు నీళ్లిస్తా
పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తా
తోటివారిని దత్తత తీసుకోండి
ఉమ్మడి జిల్లాలో సీఎంగా తొలిసభ సక్సెస్
అమలాపురం/కొత్తపేట,ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): పల్లెకు చంద్రుడొచ్చాడు..వెలుగులు తెచ్చాడు.. మీ సమస్యలన్నీ పరి ష్కరిస్తానని వానపల్లిలో వరాలజల్లు కురిపించాడు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వాన పల్లిలో శుక్రవారం జరిగిన గ్రామసభలో సీఎం చంద్ర బాబు పాల్గొని మాట్లాడారు. పెట్టుబడి తగ్గించి ఆదాయం పెరిగేలా రైతులు వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పెట్టుబడిని తగ్గించే ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తాం. రాష్ట్రంలో వర్షాలు పడడం శుభసూచకం. రాబోయే రోజుల్లో కరువు అనేది రాదు. ఇక్కడే పోలవరం ప్రాజెక్టు ఉంది. వీలైనంత త్వరలో దాని పూర్తిచేసి గోదావరి జిల్లాల ప్రజలకు మూడు పంటలకు నీళ్లిస్తామని స్పష్టంచేశారు. రైతులకు అన్ని విధా లా అండగా ఉంటామని చెప్పారు. ఇటీవల రూ.1,670 కోట్ల ధాన్యం బకాయిలను రైతులకు చెల్లించాం. 48 గంటల్లోనే ధా న్యం బకాయిలు చెల్లించే విధానాలతో ప్రభుత్వం ముందుకు వస్తోందని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు రూపకల్పనచేసిన తానే.. ఆయా సంఘాల్లో ఉన్న మహిళల అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని చెప్పారు. గ్రామాల్లోని మహిళల ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధి పొందుతూ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కింది స్థానంలో ఉన్న వారి ని దత్తత తీసుకుని వారి ఆదాయం పెంచే విధంగా సహకరించాలని సూచించారు. జన్మభూమి స్ఫూర్తితో ఈ తరహా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. సభలో చంద్రబాబు ఎవరి పేర్లను ప్రస్తావించకుండానే ప్రసంగాన్ని ముగించేశారు. గ్రామసీమల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఇస్తున్న అధిక ప్రాధాన్యతలను మాత్రం సభలో పదేపదే ప్రస్తావించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోగలిగారు.
రెండున్నర గంటలపాటు గ్రామసభ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాకతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. రెండున్న గంటలపాటు సభ జరగ్గా గంటా 20 నిమిషాలపాటు చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. మధ్యాహ్నం 2.20 గంటలకు అయినవిల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న కాన్వాయ్‌లో వానపల్లికి మ ధ్యాహ్నం 2.50 గంటలకు వానపల్లి చేరుకు న్నారు. అక్కడ నాయకులు, గ్రామ స్తులు ఘనస్వాగతం పలి కారు. వానపల్లి పళ్లాలమ్మవారి ఆలయంలోకి వెళ్లిన చంద్రబాబు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం నేరుగా సర్పం చ్ పల్లి భీమారావు అధ్యక్షతన గ్రామసభ జరిగే వేదిక వద్దకు చేరుకున్నారు. సర్పంచ్, ఏపీడీల ప్రసంగం తరువాత నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గంటా 20 నిమిషాల పాటు అనర్గళంగా ప్రసంగించడంతో ఎమ్మెల్యే బండారు, ఎంపీ హరీష్‌మాధుర్‌లకు మా ట్లాడే అవకాశం రాలేదు. చంద్రబాబు ప్రసంగం తరువాత గ్రామస్తుల్లో కొందరికి అవకాశం కల్పించారు. చంద్రబాబు సభావేదికపైకి రాకముందు మాలమహానాడుకు చెందిన కొందరు కార్యకర్తలు సభలోకి ప్రవేశించడం తో వారిని గుర్తించిన పోలీసులు తక్షణమే సభాప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లారు. వేదికపై కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్‌మాధుర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తది తరులు ఉన్నారు. కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతికి వేదికపై సీటు లేకపోవడంతో మీటింగ్ జరుగుతున్నంతసేపు నిల బడే ఉన్నారు. సభా వేదిక పక్కనే ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, గిడ్డి సత్యనారాయణ, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, ఆకుల రామకృష్ణతో సహా అనేకమంది కీలక నాయకులంతా సభావేదిక పక్కనే కుర్చీల్లో ఆశీనులు కావడం కనిపించింది.
మా గ్రామంలో ఫ్యాక్టరీ పెట్టించండి సార్..
అమలాపురం/కొత్తపేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): గ్రామ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువకుడు తాను మాట్లాడతానని పెద్దగా అరిచాడు.. ఇది గమనిం చిన సీఎం అతడిని వేదికపైకి పిలిచి మైకు ఇచ్చారు. అతను ఏఐ వస్తుంది కదా సార్ ఏం చేస్తారని ప్రశ్నించాడు. ఇంతలో మరో యువకుడు మాట్లాడేందుకు వేదిక దగ్గరికి వచ్చాడు. ఇటు రావయ్యా అంటూ అతడిని పిలిచి బాబు మైకు అందించారు. వేదికపై పాల్గొన్న అందరి పేర్లు సంభోదిస్తూ ఏలూరి శ్రీనివాసధనరాజు (రేజ్‌నాయుడు) ప్రసంగాన్ని ప్రారంభించాడు. అక్కడే ఉన్న మహిళలను చూపించి వీరంతా ఈ ఊరి నుంచి సుమారు 40 కిలోమీటర్లు వెళ్లి రవళి స్పిన్నింగ్ మిల్‌లో షిఫ్టుల వారీగా పనులు చేస్తున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఇక్కడే ఏదైనా మహిళలకు ఉపాధి కలిగే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండని అభ్యర్థించాడు. దానిపై చంద్రబాబు స్పందించి ఇక్కడ మహిళలకు ఉపాధి కలిగేలా ఫ్యాక్టరీ ఏదైనా నెలకొల్పేందుకు చర్యలు తీసుకోండని కలెక్టర్‌కు సూచించారు. ఎంతో మహిమగల అమ్మవారు పళ్లాలమ్మ తల్లి. ఆమె చుట్టూ ప్రకృతివనం ఒకటి ఏర్పాటు చేయండని అభ్యర్థించాడు. వెంటనే స్పందించిన చంద్రబాబు పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. నువ్వు ఏం చేస్తావని అతడిని అడిగినప్పుడు నేను ఆటో నడుపుతాను అని బదులిచ్చాడు. అయితే నీకు ఎలక్ర్టికల్ ఆటో తీసి ఇస్తా నడుపుకుంటావా అని చంద్రబాబు అనగా అందుకు ఆ యువకుడు ఈ రోడ్లలో ఎలక్ర్టికల్ ఆటో పనికిరాదు సార్ అంటూ సున్నితంగా తిరస్కరించాడు. సామాజిక స్పృహ ఉన్న ఇటువంటి యువకుడు సమాజానికి అవసరమంటూ చంద్రబాబు అభినందించారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటుకు అవకాశాలను గుర్తించి బండారు సత్యానందరావు ద్వారా తనకు నివే దిక పంపాలని, వాటిని మంజూరు చేస్తామని చెప్పారు. గండ్రోతు సతీష్ అనే యువకుడు మాట్లాడుతూ గౌతమీ గోదావరి నది మధ్యలో కృష్ణ జింకల సంరక్షణకు చర్యలు తీసుకోవడంతోపాటు టీడీపీని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఆకుల రామకృష్ణకు పార్టీ నామినేటెడ్ పదవి ఇవ్వాలని చంద్రబాబును అభ్యర్థించారు. వానపల్లి గ్రామానికి చెందిన కంచుస్తంభం లక్ష్మణరావు మాట్లా డుతూ మీతోనే రాష్ట్ర భవిష్యత్ అంటూ చెప్పడంతో సీఎం చంద్రబాబు అతడిని భుజం తట్టారు. అనంతరం చింతపల్లి కిరణ్, ఇళ్ళ సత్తిబాబులకు ఎలక్ట్రికల్ బైక్‌లు, చల్లపల్లికి చెందిన పోలిశెట్టి వీరవెంకట సత్యనారాయణకు ఒక ఇల్లు, రూ.లక్ష ఆర్థిక సాయం చేయమని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను ఆదేశించారు.
Updated Date - Aug 24 , 2024 | 01:04 AM