ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రెక్కలొస్తే..!

ABN, Publish Date - Jul 18 , 2024 | 01:40 AM

కాకినాడ-కోనసీమ మధ్యలో ఒక విమానాశ్రయం నిర్మిస్తామని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురంలో చేసిన ప్రకటనతో జిల్లావాసులు పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం ఏర్పాటు చేస్తే కాకినాడ, కోనసీమ జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం యానానికి మహర్ధశ పట్టే అవకాశ ఉంది.

కాకినాడ మాస్టర్‌ ప్లాన్‌లో విమానాశ్రయానికి ప్రతిపాదించిన కరప మండలం పెనుగుదురులోని సాల్ట్‌ భూములు

  • రాష్ట్రంలో ఆరు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన

  • కాకినాడ-కోనసీమ మధ్యలో ఒకటి నిర్మిస్తామనడంతో జిల్లావాసులకు చిగురిస్తున్న ఆశలు

  • కాకినాడ సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు అనువైన ప్రదేశం

  • కరప మండలంలో 216 జాతీయ రహదారిని చేర్చి 1,127ఎకరాల సాల్ట్‌ భూములు

కరప, జూలై 17: కాకినాడ-కోనసీమ మధ్యలో ఒక విమానాశ్రయం నిర్మిస్తామని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురంలో చేసిన ప్రకటనతో జిల్లావాసులు పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం ఏర్పాటు చేస్తే కాకినాడ, కోనసీమ జిల్లాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం యానానికి మహర్ధశ పట్టే అవకాశ ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడకు, కనీస రైలు మార్గం కూడా లేని కోనసీమకు ఈ విమానాశ్రయం మణిహారంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో కొత్తగా ఆరు విమానాశ్రయాలు నిర్మించాలని, అందులో తొలి ప్రాధాన్యంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్‌పోర్టు అధారిటీ ఆఫ్‌ ఇండియా అధికారుల దృష్టికి ఈ ప్రతిపాదనను తీసుకెళ్లారు. ఇది కార్యరూపం దాల్చితే యానాం, కాకినాడ, కోనసీమ జిల్లా వాసులకు, ఉద్యోగులకు, పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

1,127 ఎకరాల ఉప్పు భూములు విమానాశ్రయానికి అనుకూలం

పెన్షనర్స్‌ ప్యారడైజ్‌ కాకినాడకు అతిదగ్గర్లో 216వ జాతీయ రహదారిని చేర్చి కేంద్ర ప్రభుత్వం అధీనంలో 1,127 ఎకరాల ఉప్పు భూములు ఏళ్ల తరబడిగా నిరుపయోగంగా ఉన్నాయి. కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురులోని సర్వే నెంబర్‌ 201లో 566 ఎకరాలు, గురజనాపల్లి పరిధిలోని సర్వే నెంబర్‌ 202లో 561 ఎకరాలు ఉన్నాయి. కేంద్రం పట్టించుకోకపోవడంతో ఆ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. కొంతమంది అక్రమార్కులతో సాల్ట్‌ అధికారులు కుమ్మక్కై ఈ భూముల్లో అనధికారికంగా రొయ్యల సాగు చేస్తున్నారు. పరాధీనంలోకి పోతున్న ఈ భూములను సంరక్షించి విమానాశ్రయానికి వినియోగిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. పైగా భూసేకరణకు వేలకోట్లు వెచ్చించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాకినాడ మాస్టర్‌ ప్లాన్‌లో కూడా ఇదే విషయాన్ని పొందుపరుస్తూ గుడా, ఆ తర్వాత కుడా అధికారులు విమానాశ్రయానికి ఈ భూములనే ప్రతిపాదించారు. భోగాపురంలో ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత పలువురు నాయకులు విమానాశ్రయానికి ఈ సాల్ట్‌ భూములను వినియోగించాలని కోరుతూ కేంద్ర పౌరవిమానయానశాఖా మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడికి వినతులు పంపిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లను కలిసేందుకు కూటమి నాయకులు సిద్ధమవుతున్నారు.

‘ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఉప్పు భూములను వినియోగించాలి’

వ్యవసాయ, పారిశ్రామిక, ఉపాధి అవసరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే విమానాశ్రయ నిర్మాణానికి పెనుగుదురు, గురజనాపల్లి గ్రామాల పరిధిలోని సాల్ట్‌భూములను వినియోగించాలని రాష్ట్రీయ హిందూ చైతన్య సదస్సు అధ్యక్షుడు పడాల రఘు, బీజేపీ నాయకుడు బుద్దాల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. పెనుగుదురులో బుధవారం ఎయిర్‌పోర్టు లక్ష్య సాధన సమావేశంలో వారు మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న ఈ భూములను సేకరించడంవల్ల ప్రభుత్వానికి రూ.1,200కోట్ల వరకు భారం తగ్గుతుందన్నారు. విలువైన ఈ భూములు అన్యాక్రాంతానికి గురికాకుండా ప్రజాప్రయోజనాలకు వినియోగించే దిశగా ఆలోచన చేయాలన్నారు. కాకినాడ నగరానికి సమీపంలో ఈ భూము లు ఉన్నందున ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే అన్నివర్గాలకు, పారిశ్రామిక, వ్యవసాయరంగాలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కోనసీమ, కాకినాడ జిల్లాలనుంచి కొబ్బరి, చేపలు, రొయ్య లు, ఫార్మా తదితర ఉత్పత్తుల రవాణాకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. త్వరలోనే సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులను, అధికారులను కలిసి ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరతామని వారు స్పష్టం చేశారు. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరుతూ ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖామంత్రి రామ్మోహన్‌నాయుడికి వినతిపత్రం పంపినట్టు ఏపీ-తెలంగాణ ఐక్య కాపునాడు అధ్యక్షుడు పబ్బినీడి వెంకటేశ్వరరావు తెలిపారు.

Updated Date - Jul 18 , 2024 | 01:40 AM

Advertising
Advertising
<