వచ్చే నెల 5 వరకు ఈ-పంట నమోదు
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:35 AM
జిల్లాలో ఈ పంట నమోదు సెప్టెంబరు 5వ తేదీ నాటికి 100 శాతం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జేసీ ఎస్.చినరాముడు అధికారులను ఆదేశించారు.
కొవ్వూరు, ఆగస్టు 20 : జిల్లాలో ఈ పంట నమోదు సెప్టెంబరు 5వ తేదీ నాటికి 100 శాతం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని జేసీ ఎస్.చినరాముడు అధికారులను ఆదేశించారు. కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ అనుబంధ సంఘాలు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు.ఖరీఫ్ 2024కు సంబంధించి జిల్లాలో ఈ పంట నమోదు 96,571 ఎకరాల్లో పూర్తిచేశారన్నారు.పంట నమోదును ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రారంభించామన్నారు. జిల్లాలో వ్యవసాయ సాగు విస్తీర్ణం 1,72,494 ఎకరాలు, ఉద్యాన సాగు విస్తీర్ణం 1,37,759 ఎకరాలు ఉందన్నారు. జిల్లాలో వివిధ పంటల సాగు విస్తీర్ణం 3,10,253 ఎకరాల అన్నారు. ఈ పంట నమోదుకు సెప్టెంబరు 15వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు. సాగు ధ్రువీకరణ పత్రాలు అవసరమైన రైతులకు వీఆర్ వోలు వెంటనే అందించేలా తహశీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. కెఆర్సీ డిప్యూటీ కలెక్టర్, కొవ్వూరు ఇన్‌చార్జి ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా ఉన్న 30 వేల హెక్టార్ల భూమిలో పంట సాగుకు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు మాట్లాడుతూ ఈ నెల 3న వారంలో జరిగే సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనే విధంగా చైతన్యం కల్పించాలన్నారు. ఇప్పటికే వ్యవసాయశాఖ కార్యాలయాలకు ఎలుకల మందు చేరవేశామన్నారు. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి పి.విజయబాస్కర్ మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు, మండల తహశీల్దార్లు రేషన్ దుకాణాలను తనిఖీచేసి నివేదికలు సమర్పించాలన్నారు. అక్రమ నిల్వలు, పీడీఎస్ రైస్ కొనుగోలు చేయకుండా నిఘా పెట్టాలన్నారు.కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి టి.రాధిక,ఉద్యానశాఖాధికారి బి. సుజాత కుమారి, కొవ్వూరు డివిజన్ తహశీల్దార్లు పాల్గొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 12:35 AM