అతిసార నియంత్రణకు చర్యలు
ABN, Publish Date - Jun 23 , 2024 | 12:31 AM
అతిసారను నివారించేందుకు జూలై 1 నుంచి ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్నైట్ క్యాంపైన్‌ను ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
అమలాపురం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): అతిసారను నివారించేందుకు జూలై 1 నుంచి ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్నైట్ క్యాంపైన్‌ను ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆగస్టు 31 వరకు ఈ క్యాంపైన్ జరుగుతుందన్నారు. కలెక్టరేట్‌లో శనివారం హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లల్లో అతిసారాన్ని అరికట్టేందుకు జింక్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల వినియోగాన్ని పెంచాలన్నారు. ఓఆర్‌ఎస్, జింక్ ప్యాకెట్లను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి అతిసారపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీల వద్ద కూడా వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సంపూర్ణ పారిశుధ్యం ఉండేలా పంచాయతీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సీడీపీవోలు, మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కలుషిత నీటిని తాగడం వల్ల అతిసార ప్రబలే ప్రమాదం ఉందన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్ర పరచడంతో పాటు క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్‌అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ ఎం.ఝాన్సీ, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.దుర్గారావుదొర, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి బి.సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి డి.రాంబాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
Updated Date - Jun 23 , 2024 | 12:31 AM