‘హోదా’ కోసం పోరాడలేదు.. ప్రతిపక్ష హోదా కావాలట!
ABN, Publish Date - Jul 25 , 2024 | 03:33 AM
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం, పోలవరం కోసం ఏనాడైనా ధర్నా చేశాడా? కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్లాడు.
జగన్ కోర్టుకు వెళ్లడంపై పీసీపీ చీఫ్ షర్మిల ఎద్దేవా
తాడేపల్లిగూడెం రూరల్, జూలై 24: ‘జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం, పోలవరం కోసం ఏనాడైనా ధర్నా చేశాడా? కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్లాడు. నిజంగా ప్రజల పక్షాన నిలవాలంటే అసెంబ్లీకి వెళ్లాలి. అలాకాకుండా పార్టీ మనుగడ కోసం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడం హాస్యాస్పదం’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని నందమూరులోని ఎర్ర కాలువ వరద ముంపు బారిన పడిన పంట చేలను ఆమె పరిశీలించి మాట్లాడారు. వైఎస్ మానస పుత్రికగా రైతుల కోసం ప్రారంభించిన జలయజ్ఞం కార్యక్రమానికి జగన్ పాలనలో సమాధి కట్టారు. పాత మంచినీటి ప్రాజెక్టులకు మరమ్మతులు కూడా చేయకపోవడం దారుణం. అందువల్లే రైతులు రాష్ట్రంలో వరదలకు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటి ప్రభుత్వమైనా రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుని, రైతులకు నష్టపరిహారం అందించాలి’ అని డిమాండ్ చేశారు. మొలలోతు నీటిలో దిగి కుళ్లిన నారును పరిశీలించి రైతుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
Updated Date - Jul 25 , 2024 | 03:39 AM