‘రంజాన్ తోఫా’ ఏదీ?
ABN, Publish Date - Apr 11 , 2024 | 01:53 AM
టీడీపీ హయాంలో ఇస్తున్న రంజాన్ తోఫాకు మరిన్ని సరుకులు కలిపి ఇస్తామని 2019లో రంజాన్ సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చెప్పారు.
జగనన్న పాలనలో ముస్లింలకు అన్నీ మైనసే
తిరుపతి(కపిలతీర్థం), ఏప్రిల్ 10: టీడీపీ హయాంలో ఇస్తున్న రంజాన్ తోఫాకు మరిన్ని సరుకులు కలిపి ఇస్తామని 2019లో రంజాన్ సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చెప్పారు. 2020 నుంచి ఇస్తామన్నారు. ఆ మాటలను నిజమని మైనారిటీలు నమ్మారు. కానీ, ఐదేళ్లయినా రంజాన్ తోఫా ఇవ్వలేదు. మాట నిలబెట్టుకోలేదు. ‘మైనార్టీ వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు మిగిలివున్న చర్యలు చేపడతాం. ఆ పార్టీ (టీడీపీ) చేసిందేమి లేదు. మా పార్టీయే (వైసీపీ) ఎంతో చేసింది’ అని చెప్పడమే కానీ చేసిందేమీ లేదని ముస్లింలు అంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో బియ్యం కార్డున్న ముస్లిం కుటుంబాలకు చంద్రన్న రంజాన్‌తోఫా కిట్ అందించేవారు. వాటిలో రెండు కిలోల చక్కెర, ఐదు కిలోల గోధుమ పిండి, కిలో సేమియా, వంద గ్రాముల నెయ్యి వంటి సరుకులు ఉండేవి. వీటితో పేద ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకొనే వారు. దీనికి మరిన్ని సరుకులు కలిపి ఇస్తానని అధికారంలోకి వచ్చిన జగన్.. ఆ మాటే మరిచారు. ముస్లింల ఇంట పండుగంటే గోధుమలు, సేమియాలు, చక్కెర ఉం డా ల్సిందే. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే నిత్యావసరాల్లో గోధుమ పిండి, కందిపప్పును రెండు నెలలుగా నిలిపేసింది. కేవలం అర కిలో చక్కెర మాత్రం అందిస్తోంది. దీంతో పండుగ రోజున ఇంటిల్లిపాదీ చక్కెరతో పాయసం(ఖీర్) చేసుకోవాలన్నా కిలో పైనే చక్కెర అవసరమవుతుంది. రేషన్ దుకాణాల్లో ఇచ్చే అరకిలో చక్కెర సరిపోక మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.
షాదీఖానా, ఈద్గాల ఊసేలేదు
ముస్లిం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధిని వైసీపీ పూర్తిగా విస్మరించింది.టీడీపీ పాలనలో షాదీఖానాల నిర్మాణం, మసీదులకు మరమ్మతులు, ఈద్గాల అభివృద్ధి, ప్రహరీల నిర్మాణానికి ప్రతీ ఏడాదీ నిధులు మంజూరు చేసేవారు.వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీటి జాడే లేదు. పలుమార్లు మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా ప్రతిపాదనలు పంపినా ఒక్క రూపాయీ మంజూరు కాలేదని ముస్లిం సోదరులు వాపోతున్నారు. తిరుపతి, సూళ్లూరుపేట, గూడూరుల్లోని షాదీఖానా భవనాల మరమ్మతులకు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా ఇంత వరకు పట్టించుకున్న వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చినప్పుడే గౌరవ వేతనాలు
జిల్లాలో సుమారు 450కి పైగా మసీదులున్నాయి. వీటిల్లో 350మందికి పైగా ఇమామ్‌లు(ఆరాఽధకులు), మౌజన్‌లు(మసీదు సేవకులు) ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వీరికి గౌరవ వేతనం అందేది.ప్రస్తుతం ఆరు నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రంజాన్ పండుగను కూడా సంతోషంగా చేసుకోలేకపోతున్నారు.గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా నెల నెలా గౌరవ వేతనాలు అందేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వారిచ్చినప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు మౌజన్లు, ఇమామ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమని అడిగితే ఆ మరుసటి రోజునే దేవుడి సేవ నుంచి తప్పిస్తున్నారంటున్నారు.
దుల్హన్ సాయం ఆగిపోయింది
నిరుపేద ముస్లింలు సైతం వారి ఇంట్లో నిఖా వేడుకను ఉన్నంతలో వైభవంగా జరుపుకుంటారు. నిఖా చేయడం ఆర్థిక భారం కాకూడదనే ఆర్థిక చేయూతను అందించేందుకు గత ప్రభుత్వం దుల్హన్ పథకం కింద నిఖా చేసుకున్న దంపతులకు ఆర్థికసాయం అందించేది. కానీ ప్రస్తుతం దుల్హన్ పథకం అందని ద్రాక్షాలా మారింది. దీంతో ఈ పథకం అండగా ఉందనే ధీమాతో అప్పులు చేసి మరీ వారి బిడ్డలకు నిఖా చేసిన వారికి ఈ పథకం అందక అప్పులకు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తోంది. జిల్లాలో దాదాపు ఐదు వందలకు పైగా జంటలు దుల్హన్ పథక సాయం కోసం ఎదురు చూస్తున్నాయి.
Updated Date - Apr 11 , 2024 | 07:01 AM