ఓటోత్సాహం దేనికి సంకేతం?
ABN, Publish Date - May 15 , 2024 | 12:11 AM
చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల కన్నా 2.07 శాతం ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 2019లో 85.02 శాతం పోలవగా ఇప్పుడు 87.09 శాతం నమోదైంది.
చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల కన్నా 2.07 శాతం ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 2019లో 85.02 శాతం పోలవగా ఇప్పుడు 87.09 శాతం నమోదైంది. పోలింగ్ పెరుగుదల దేనికి సంకేతమనే అంశంపై భిన్న అంచనాలు పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. 2019లో పోలింగ్ పెరుగుదలను ప్రభుత్వ వ్యతిరేకతగా చెప్పుకున్న వైసీపీ, ఇప్పుడు అదే పెరుగుదలను ప్రభుత్వ అనుకూలతగా చెప్పడం విశేషం. సహజంగా పోలింగ్ పెరుగుదల ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేకతనే ప్రతిబింబిస్తుంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరి నిలబడ్డారు. రాత్రి పది గంటల దాకా కొన్ని చోట్ల పోలింగ్ కొనసాగింది. ఎర్రటి ఎండలోనూ జనం ఎగబడి ఓట్లేశారు. ఉత్సవాలకు హాజరైనట్లుగా జనం పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఈ ఓటోత్సాహమే పార్టీలను పైకి ఎన్ని చెప్పినా లోలోన ఆందోళన పరుస్తోంది. ఈసారి క్యూల్లో మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. వృద్ధులు కూడా ఉత్సాహంగా వచ్చి ఓట్లు వేశారు. ఇదంతా జగన్ పథకాల సంతృప్తికి సంకేతం అని వైసీపీ చెబుతుండగా, చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పట్ల ఆశ, నమ్మకమే ఈ ఉత్సాహం అని టీడీపీ అంచనా కడుతోంది. జూన్ 4న కానీ అసలు కత తేలదు.
అత్యధికం కుప్పంలో
అన్ని నియోజకవర్గాల్లోనూ పోలింగ్ శాతం 80 దాటింది. ఈసారి అత్యధికంగా కుప్పంలో 89.88ు, అత్యల్పంగా చిత్తూరులో 81.24ు నమోదైంది. కుప్పంలో 4.45 శాతం పెరుగుదల చంద్రబాబుకు భారీ ఆధిక్యతకు సూచన అని భావిస్తున్నారు. 2019లో అత్యధికంగా జీడీనెల్లూరులో 86.45ు, అత్యల్పంగా చిత్తూరులో 79.27ు ఓట్లు పోలయ్యాయి. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ మహిళల నిర్ణయం కీలకం కానుంది. మహిళా ఓటర్లు అధికంగా ఉండగా.. అనుగుణంగానే 13,065 మంది మహిళలు పురుషుల కంటే అధికంగా పోలింగ్‌లో పాల్గొన్నారు.
2019, 2024 ఎన్నికల పోలింగ్ (శాతాల్లో)
నియోజకవర్గం 2024 2019
పుంగనూరు 86.62 85.15
నగరి 87.08 86.22
జీడీనెల్లూరు 88.69 86.45
చిత్తూరు 81.24 79.27
పూతలపట్టు 87.66 85.92
పలమనేరు 87.90 86.12
కుప్పం 89.88 85.43
మొత్తం 87.09 85.02
నియోజకవర్గాల వారీగా ఓటింగ్ ఇలా..
నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైనవి మహిళలు పురుషులు
పుంగనూరు 238,868 206,916 104,717 102,196
నగరి 202,574 176,399 90,316 86,078
జీడీనెల్లూరు 204,949 181,779 90,971 90,805
చిత్తూరు 202,850 164,788 84,278 80,493
పూతలపట్టు 220,999 193,730 97,767 95,962
పలమనేరు 267,896 235,476 117,862 117,614
కుప్పం 225,775 202,920 101,608 101,306
మొత్తం 15,63,911 13,62,008 687,519 674,454
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి/చిత్తూరు కలెక్టరేట్
Updated Date - May 15 , 2024 | 12:11 AM