నగరపాలక అధికారులపై ‘విజిలెన్స్’
ABN, Publish Date - Aug 12 , 2024 | 01:41 AM
తిరుపతి నగర పాలక సంస్థలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ మంత్రి నారాయణ ఆదేశించారు. ఆమేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి విభాగపు స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు.
- టీడీఆర్ బాండ్ల జారీ, నిధులు దుర్వినియోగం చేసిన అధికారుల్లో గుబులు
- విచారణకు ఆదేశించిన మంత్రి నారాయణ
తిరుపతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర పాలక సంస్థలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ మంత్రి నారాయణ ఆదేశించారు. ఆమేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి విభాగపు స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరపాలక సంస్థలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజాదర్బార్ (ఆర్టీజీ)లో భాగంగా మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. ఈక్రమంలో మంత్రి నారాయణకు తిరుపతి కార్పొరేషన్లోని అవినీతి అధికారుల గుట్టు విప్పాలని మంత్రి లోకేశ్ ద్వారా ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ నారాయణ నిర్ణయం తీసుకోవడంతో అవినీతి అధికారుల్లో గుబులు పట్టుకుంది. తిరుపతిలో జరిగిన ట్రాన్స్‌ఫర్‌బుల్ డెవల్‌పమెట్ రైట్ (టీడీఆర్) బాండ్ల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. రూ.4వేల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగినట్టు అప్పట్లో పత్రిపక్ష టీడీపీ నేతలు ఆరోపించారు. అభివృద్ధి పేరుతో తుడా వేయాల్సిన మాస్టర్ ప్లాన్ రోడ్లను పక్కా ప్రణాళికతో తెరపైకి తీసుకొచ్చి స్థలాలు కోల్పోయిన వారి పేర్లతో బాండ్లు తీసుకుని కోట్లు కొల్లగొట్టారు. అగ్రికల్చర్, రెసిడెన్షియల్ పరిధిలోని స్థలాలను కూడా కమర్షియల్‌గా రిజిస్ట్రేషన్ విలువ పెంచేసి భారీగా లబ్ధి పొందారు. వైసీపీ నేతల జేబుల్లోకి దాదాపు రూ.400 కోట్ల వరకు వెళ్లినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగంలో ఇష్టానుసారంగా నిధులు దుర్వినియోగమయ్యాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటకాగిన అధికారులపై కూడా విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది.
Updated Date - Aug 12 , 2024 | 01:41 AM