తోకలేనిపిట్టల గూడు చెదిరింది
ABN, Publish Date - Jul 21 , 2024 | 02:39 AM
కమ్మని కలల కబుర్లు, ఆనంద విషాదాల సమాచారాలు మోసుకొచ్చే తోకలేని పిట్టల ఎర్రని గూడు ఇప్పుడిలా మిగిలింది. ఒకప్పుడది.. ఎదురుచూపుల ఖిల్లా.. కలల కార్ఖానా.. శనిరాశలు రెక్కలు విప్పుకుని ఎగిరిపోయే ముందు వాలేది ఈ ఎర్రపెట్టెలోనే. ఎంత ఇష్టం.. ఎంత భద్రం.. ఈ గూడు! కబురు మోసుకొచ్చే జాబుగువ్వలుండేది ఈ గూటిలోనే కదా అని దారినపోయేవారంతా ఈ ఎర్రపెట్టెను అపురూపంగా చూసుకుంటూ కదిలిపోయేవారు.
కుప్పం: కాలం కఠినమైంది కదా! మంచైనా చెడైనా అంగీకరించాల్సిందే, అనుసరించాల్సిందే. అరచేతిలో ఇమిడిపోయిన ఆరంగుళాల బుల్లి ఫోను ముందు ఈ ఎర్రపెట్టె వెలవెలపోయింది. రోజులకు రోజులు సమాచారం ఎగిరి రావాల్సిన అవసరం అంతరించిపోయింది. క్షణాల్లో సమాచారం బట్వాడా అయిపోతున్న కాలంలో ఈ జాబుల గూడు ఒక గతకాలపు జ్ఞాపకంగా మారిపోయింది. ఇదిగో ఇలా.. కుప్పంలో జాతిపిత విగ్రహం ఎదుట కూరగాయల దుకాణదారుల మధ్య కనీకనిపించకుండా దాగిపోయి వచ్చీపోయేవారిని దీనంగా చూస్తోంది.
Updated Date - Jul 21 , 2024 | 02:39 AM