సత్యవేడు ఎమ్మెల్యేకి షాక్
ABN, Publish Date - Sep 06 , 2024 | 12:07 AM
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని టీడీపీ నుంచీ సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
తిరుపతి, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి):సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని టీడీపీ నుంచీ సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు పార్టీ నుంచీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తనను ఆదిమూలం లైంగికంగా వేధించారంటూ ఓ తెలుగు మహిళ నాయకురాలు చేసిన ఆరోపణలను, పార్టీకి ఇచ్చిన ఫిర్యాదును అధినేత సీరియ్‌సగా తీసుకున్నారు. అందులో నిజానిజాలు, ఆరోపణల వెనుక ఇతర కోణాలు వంటివి ఏవైనా వుంటాయా అన్న విషయం కూడా అధినేత పరిగణనలోకి తీసుకోలేదు. మహిళా నేత నుంచీ తీవ్ర ఆరోపణ రావడంతో వరదసహాయక చర్యల్లో నిమగ్నమై వున్నా కూడా ఆ అంశంపై దృష్టి సారించారు. ముందస్తు చర్యల్లో భాగంగా సస్పెన్షన్‌కు ఆదేశించిన అధినేత ఆరోపణల గురించి పార్టీపరంగా అంతర్గత విచారణకు ఆదేశించారు. వాస్తవానికి గురువారం ఉదయం నుంచీ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ఈ అంశం వైరల్ అవుతుండడంతో జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆత్మరక్షణ ధోరణిలో పడ్డాయి. అంతలోనే అధినేత స్పందించిన తీరు శ్రేణులను తలెత్తుకునేలా చేసింది. నిజానికి ఆరోపణలతో పార్టీ గ్రాఫ్ తగ్గాల్సిన పరిస్థితుల్లో అధినేత నిర్ణయం సామాన్య జనంలో కూడా పార్టీ ఇమేజిని పెంచింది.
అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే ఆదిమూలం
తెలుగు మహిళ నేత ఆరోపణల వ్యవహారంలో ముందస్తు సమాచారం వుందో లేదో గానీ బుధవారం రాత్రి నుంచే ఎమ్మెల్యే ఆదిమూలం అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం. సాధారణంగా ఎమ్మెల్యే కదలికలు, పాల్గొనే కార్యక్రమాల గురించి నియోజకవర్గవ్యాప్తంగా ముఖ్య నాయకులందరికీ సమాచారం వుంటుంది. కానీ గురువారం ఉదయం నుంచీ ఆయన ఆచూకీ ఎవరికీ తెలియలేదు.పుత్తూరు శివార్లలోని నివాసంలోనూ ఎవరూ అందుబాటులో లేరు. కుటుంబీకులతో పాటు వ్యక్తిగత సిబ్బంది కూడా లేకుండా పోయారు. ఎవరి ఫోన్లూ పనిచేయలేదు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారన్న ప్రచారం జరిగింది.ఎమ్మెల్యే ఒక ఎలక్ర్టానిక్ మీడియా ప్రతినిధితో మాత్రం ఫోన్‌లో మాట్లాడి తనపై కుట్ర జరిగిందంటూ వివరణ ఇచ్చారు.తనకేమీ తెలియదని, తనపై కుట్ర జరిగిందని ఆరోపించారు. ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేశారని, తాను తప్పు చేయలేదని ఎక్కడైనా ప్రమాణానికి సిద్ధమని స్పష్టం చేశారు. తన బిడ్డల సాక్షిగా ఆమె తెలుగు మహిళా నాయకురాలిగా మాత్రమే తెలుసునని, ఇతర పరిచయాలు లేవన్నారు. ఇటీవలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన రమే్‌షబాబుతో పాటు పార్టీలోని మునుస్వామి యాదవ్, గిరిబాబు, బాలరాజు తదితర నాయకులు పన్నిన కుట్రగా ఆరోపించారు. అయితే ఆచరణలో ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో ఆయన వాదన బలహీనంగా మారింది. సాయంత్రానికి కుటుంబీకులు అందుబాటులోకి వచ్చారు. ఎమ్మెల్యేకి ఆరోగ్యం బాగాలేనందున చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. అంతకుమించి ఏ ఆస్పత్రి అన్న విషయం కూడా చెప్పలేదు. ఆ తర్వాత కుమార్తెలు, అల్లుడు కూడా ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఎప్పుడో జరిగినట్లున్న వీడియోను ఇప్పుడు ఎందుకు విడుదల చేశారో ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. కూతురు వయసున్న ఆమె అరోపణలు చేయడం వెనుక కొంతమంది టీడీపీ, వైసీపీ నాయకులున్నారని, వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు.కాగా ఎమ్మెల్యే సొంత మండలమైన బీముని చెరువులో మహిళలు ఆదిమూలానికి మద్దతు తెలిపారు.ఆదిమూలంపై ఆరోపణల వెనుక మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే పై ఆరోపణలు చేసిన మహిళ దిష్టిబొమ్మను దహనం చేశారు.
తొలుత వ్యతిరేకించి... తర్వాత సమర్ధించి
ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తెలుగు మహిళ నాయకురాలు గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు.టీడీపీ టికెట్ డాక్టర్ హెలెన్‌కు కాకుండా ఆదిమూలానికి ప్రకటించడంతో నిరసించిన ఆమె తర్వాత సమర్థించారు. తీరా ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయలేదని ఆదిమూలం నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. ఫలితాల తర్వాత ఎమ్మెల్యే వెంట నడిచారు. మూడు నెలలు కూడా గడవకనే అదే ఎమ్మెల్యే మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. నాలుగైదు నెలల్లోనే పలు మలుపులు తిరిగిన ఈ వ్యవహారంలో కేంద్ర బిందువుగా మారిన ఆమెది కేవీబీపురం మండలం.2020లో అప్పటి సత్యవేడు టీడీపీ ఇంఛార్జి జేడీ రాజశేఖర్ అనుచరురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె తర్వాత డాక్టర్ హెలెన్ వర్గంలో చేరారు.ఆదిమూలానికి టికెట్ ప్రకటించాక ఆయన తరపున ప్రచారం చేశారు.ఎన్నికల ఫలితాల తర్వాత ఎమ్మెల్యే వెంట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరగా వారం కిందట కేవీబీపురంలో ఎమ్మెల్యే పాల్గొన్న కార్యక్రమానికి ఆమె గైర్హాజరయ్యారు. ఇలా వీరి రాజకీయ సంబంధాలు అనేక మలుపులు తిరిగాయి. ఈ నేపధ్యంలో ఆమె గురువారం అకస్మాత్తుగా హైదరాబాదులో మీడియా ఎదుట ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం రేపింది.ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఓ ఎమ్మెల్యే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొనడం, పార్టీ నుంచీ సస్పెండ్ కావడం ఇదే తొలిసారి. ఈ ఘటన జిల్లాకు తలవంపులుగా మారిందనే చెప్పాలి.
Updated Date - Sep 06 , 2024 | 12:07 AM