ఆర్డీవో పరిశీలన
ABN, Publish Date - Jul 31 , 2024 | 02:29 AM
రామచంద్రాపురం మండల పరిధిలోని భూమికి తిరుపతి రూరల్ మండలం తహసీల్దార్ ధ్రువీకరించినట్లు నకిలీ రికార్డు తయారైన వ్యవహారంపై రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది.
నేటి విచారణకు డాక్యుమెంట్లు తేవాలని ఇరువర్గాలకు, అధికారులకు ఆదేశం
తిరుపతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రామచంద్రాపురం మండల పరిధిలోని భూమికి తిరుపతి రూరల్ మండలం తహసీల్దార్ ధ్రువీకరించినట్లు నకిలీ రికార్డు తయారైన వ్యవహారంపై రెవెన్యూ యంత్రాంగంలో కదలిక వచ్చింది. ‘వైసీపీ నేత లీలలు’ శీర్షికన సోమవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించారు. స్థల వివాదానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆర్డీవో నిశాంత్‌రెడ్డిని ఆదేశించారు. దాంతో మంగళవారం ఆర్డీవో.. రామచంద్రాపురం మండలం సి.రామాపురంలోని సర్వే నెంబరు 73/3 భూమిని పరిశీలించారు. బాధితుడు కె.పురుషోత్తమ రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆర్సీపురం మండలంలో ఉన్న తన భూమిలోని 10 సెంట్లను తిరుపతి రూరల్ మండల తహసీల్దార్ ఇచ్చినట్టు నకిలీ 1-బీ, అడంగల్‌ను ప్రైవేట్ మీ-సేవ లేదా ఇంటర్నెట్ సెంటర్లో సృష్టించారన్నారు. దీనికి ఆర్సీపురం, రూరల్ మండలాల ఉద్యోగులు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. అనంతరం ఆ భూమిని డిల్లీరాణి (భర్త వైసీపీ నేత భానుకుమార్ రెడ్డి) పేరున డాక్యుమెంట్ నెంబరుగా (2282/2022)గా రిజిస్టర్ చేశారని, తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో పూర్తిస్థాయి డాక్యుమెంట్లను బుధవారం ఆర్డీవో కార్యాలయంలో జరిగే విచారణకు తేవాలని ఇరువర్గాలతోపాటు అక్కడి రెవెన్యూ అధికారులను ఆర్డీవో ఆదేశించారు.
Updated Date - Jul 31 , 2024 | 02:29 AM