నేలకు దిగనున్న ఇసుక ధరలు
ABN, Publish Date - Jul 07 , 2024 | 02:08 AM
గత ఐదేళ్ళుగా నింగికెక్కిన ఇసుక ధరలు రేపటి నుంచీ నేలకు దిగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇసుకను ఉచితంగా అందజేస్తామన్న హామీకి అనుగుణంగా కొత్త ప్రభుత్వం ఇసుకపై నూతన విధానాన్ని రూపొందించింది.
జిల్లాలో ఐదు స్టాక్ పాయింట్లు జూ రేపటినుంచి పంపిణీ
జూ రోజుకు ఒకరికి 20 టన్నులు మాత్రమే!
తిరుపతి(కలెక్టరేట్)/తిరుపతి, జూలై6(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ళుగా నింగికెక్కిన ఇసుక ధరలు రేపటి నుంచీ నేలకు దిగనున్నాయి. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇసుకను ఉచితంగా అందజేస్తామన్న హామీకి అనుగుణంగా కొత్త ప్రభుత్వం ఇసుకపై నూతన విధానాన్ని రూపొందించింది. ప్రాధమికంగా స్టాక్ పాయింట్ల నుంచీ ఇసుకను వినియోగదారులకు అందించేందుకు విధి విధానాలను ప్రకటించింది.స్టాక్ పాయింట్ నిర్వహణకు, లోడిం గ్‌కు అయ్యే ఖర్చు వంటి వాటికి మాత్రమే వినియోగదారులు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. ఇది నామమాత్రపు ధరేనని,రవాణా ఖర్చు మాత్రం వినియోగ దారులు భరించాల్సి వుంటుందని ప్రకటించింది. మొత్తం మీద గత ఐదేళ్ళుగా రూ. 5 వేల నుంచీ రూ. 6 వేల వరకూ పలికిన ఇసుక లోడు ధర ఇపుడు ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం జిల్లాకు సంబంధించిన ఇసుక లభ్యత, స్టాక్ పాయింట్ల వివరాలు, నిర్ణయించిన ధరల వివరాలను కలెక్టర్ వెంకటేశ్వర్ సీఎస్‌కు వివరించారు.
ఐదు స్టాక్ పాయింట్లలో ధరలిలా...
జిల్లాలో సోమవారం నుంచీ ఐదు స్టాక్ పాయింట్లు జనానికి అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని సుబ్బానాయుడు కండ్రిగ వద్ద రెండు , పిచ్చాటూరు మండలం ఏకే బీడు వద్ద ఒకటి, దొరవారిసత్రం మండలం మామిళ్ళ పాడులో ఒకటి, వెంకటగిరి మండలం మొదులుగుంటలో ఒకటి చొప్పున ఐదు స్టాక్ పాయింట్లను జిల్లా యంత్రాంగం గుర్తించింది. వీటిని సోమవారం నుంచీ తెరవనున్నారు. ఉదయం 6 నుంచీ సాయంత్రం 6 దాకా స్టాక్ పాయింట్లలో ఇసుక బట్వాడా జరుగుతుంది.సుబ్బానాయుడు కండ్రిగ, ఏకే బీడుల్లోని మూడు స్టాక్‌పాయింట్లలో టన్ను ఇసుకకు రూ. 200 చొప్పున ప్రభుత్వానికి చెల్లించాలి. మామిళ్ళపాడు వద్ద రూ. 465 చొప్పున, మొదులుగుంట స్టాక్ పాయింట్‌లో టన్నుకు రూ. 590 వంతున చెల్లించాలి.ఆధార్ కార్డు ప్రాతిపదికగా రోజుకు ఒక వ్యక్తికి గరిష్టంగా 20 టన్నుల ఇసుక మాత్రమే స్టాక్ పాయింట్‌లో కేటాయించనున్నారు. అంటే ట్రాక్టర్ లోడ్ ప్రాతిపదిక తీసుకుంటే రోజుకు ఐదు లోడ్‌ల ఇసుక మాత్రమే ఒకరు పొందడానికి వీలవుతుంది.ఇసుక ధరల చెల్లింపునకు ప్రభుత్వం డీఎంజీ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వెబ్‌సైట్‌లోని క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్(ఫోన్‌పే, పేటీఎం, గూగూల్‌పే) ద్వారా చెల్లించి స్టాక్ పాయింట్ వద్ద రశీదు చూపిస్తే ముందు వచ్చిన వారికి ముందుగా అన్న ప్రాతిపదికన ఇసుక కేటాయింపులు జరుగుతాయి.ఇసుక ద్వారా వచ్చిన ఆదాయం కూడా స్థానిక సంస్థలకే జమ కానుంది.
అందుబాటులో 2లక్షల మెట్రిక్ టన్నులు
జిల్లాలో సుమారు 2లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. నాయుడుపేట పరిధిలోని కూచివాడలో సుమారు 5లక్షల క్యూబిక్ మీటర్ల టన్నుల ఇసుక తవ్వకాలకు మైనింగ్ అధికారులు రీచ్‌లను గుర్తించారు. పర్యావరణ అనుమతులు రాగానే ప్రజావసరాలకు కావాల్సిన ఇసుక అందుబాటులోకి రానుంది.
గ్రామ ప్రజల అవసరాలకు ఉచితమే... యంత్రాలకు నో ఎంట్రీ
గ్రామ పంచాయతీల పరిధిలోని వాగులు వంకల్లో ఇసుక తీత, లోడింగ్ వంటి వాటికి యంత్రాలు వాడకూడదని ప్రభుత్వం సూచించింది. గ్రామప్రజల అవసరాల నిమిత్తం ఇసుకను ఉచితంగా వినియోగించుకోవచ్చు. అయితే ఇసుక వ్యాపారులు ఎవరైనాసరే అక్రమంగా ఇసుక తరలించినా డంపింగ్ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని అధికారులు హెచ్చరించారు. దీనిపై పోలీసులు,సెబ్, రెవెన్యూ శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి.
Updated Date - Jul 07 , 2024 | 08:31 AM