ఊహించిందే జరిగింది!
ABN, Publish Date - May 17 , 2024 | 02:11 AM
సార్వత్రిక ఎన్నికల్లో శాంతిభద్రతలను నియంత్రించడంలో పోలీసు యంత్రాంగం విఫలం కావడంతో అంతా ఊహించినట్టుగానే జరిగిపోయింది. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటు వేసిన ఎన్నికల కమిషన్.. తిరుపతి డీఎస్పీ సురేంద్రరెడ్డి, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ భాస్కర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచి సీఐ రాజశేఖర్, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డిని సస్పెండు చేసింది.
జిల్లా ఎస్పీ బదిలీ ఫ తిరుపతి డీఎస్పీ, ఎస్బీ డీఎస్పీ సస్పెన్షన్
స్పెషల్ బ్రాంచి సీఐ, అలిపిరి సీఐ కూడా.. ఫ ఐదుగురిపైనా శాఖాపరమైన విచారణ
ఎన్నికల కమిషన్ సంచలనాత్మక చర్యలు
చంద్రగిరి నియోజకవర్గంలో ‘పోలింగ్’.. అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం
సార్వత్రిక ఎన్నికల్లో శాంతిభద్రతలను నియంత్రించడంలో పోలీసు యంత్రాంగం విఫలం కావడంతో అంతా ఊహించినట్టుగానే జరిగిపోయింది. ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటు వేసిన ఎన్నికల కమిషన్.. తిరుపతి డీఎస్పీ సురేంద్రరెడ్డి, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ భాస్కర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచి సీఐ రాజశేఖర్, అలిపిరి సీఐ రామచంద్రారెడ్డిని సస్పెండు చేసింది. ఎస్పీ సహా వీరందరిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. దీనికి తోడు ఈసీ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం జిల్లాలో కూడా హింసాత్మక ఘటనల పూర్వాపరాలను, వాటిని అడ్డుకోవడంలో, అనంతర చర్యల్లో ఎస్పీ సహా కింది స్థాయి అధికారులు వ్యవహరించిన తీరును లోతుగా విచారించి ఈసీకి నివేదిక ఇవ్వనుంది. ఎన్నికల నిర్వహణను ఆషామాషీగా తీసుకున్న అధికారులు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
నామినేషన్ల నాడే తొలి ప్రమాద ఘంటికలు
చంద్రగిరి వైసీపీ, టీడీపీ అభ్యర్థులను గత నెల 25వ తేదీన ఒకే సమయంలో నామినేషన్లకు అనుమతించినప్పుడే అధికారుల అవగాహనా రాహిత్యం బట్టబయలైంది. టీడీపీ అభ్యర్థి కోసం భారీ ఎత్తున తరలివచ్చిన శ్రేణులను పోలీసులు నియంత్రించలేకపోయారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద ఇరువర్గాలూ రాళ్ళదాడికి దిగడంతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి వాహనంపై రాళ్లు, కర్రలతో దాడి జరిగింది. లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది. వాస్తవానికి అప్పుడే అధికారులు అప్రమత్తమై చంద్రగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించివుండాల్సింది. కానీ అలా జరగలేదు.
డక్కిలి, చిల్లకూరు మండలాల్లోనూ హింసాత్మక ఘటనలు
ఫ గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండల టీడీపీ అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వరరెడ్డికి తిక్కగుంటపాలెంలో రొయ్యల చెరువులు ఉన్నాయి. పోలింగ్‌కు ముందు రోజైన ఆదివారం రాత్రి రొయ్యల చెరువుల్లో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. దీంతో రూ. 15 లక్షలు విలువైన రొయ్యలు చనిపోయి నీటిపైకి తేలాయి. ఈ ఘటనపై బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశాడు.
ఫ వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం అల్తూరుపాడులో పోలింగ్ రోజు ఓ కానిస్టేబుల్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామస్తులు దాడిచేసి కొట్టారు. ఫ గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం చింతవరం గ్రామానికి చెందిన టీడీపీ నేత గోపాల్ పోలింగ్ రోజు టీడీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపిస్తూ మరుసటి రోజైన మంగళవారం వైసీపీ వర్గీయులు ఇనుప రాడ్లతో దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచారు.
ఫ చిల్లకూరు 114, 117 బూత్‌లలో పోలింగ్ రోజు టీడీపీ నేత కొండా రామచంద్రారెడ్డిపై వైసీపీ నేత నరేంద్ర రెడ్డి దాడి చేసి కొట్టారు. బాధితునికి రక్షణ కల్పించాల్సిన చిల్లకూరు ఎస్‌ఐ అంజిరెడ్డి దానికి భిన్నంగా బాధితుడినే లాఠీతో చితకబాదారు. తోపులాట, ఘర్షణతో టీడీపీ అభ్యర్థి పాశం సునీల్‌కుమార్‌తో పాటు టీడీపీ దళిత మహిళా నేత విజయ కూడా గాయపడ్డారు.
నానీపై దాడి ఘటనలో బట్టబయలైన పోలీసు వైఫల్యం
పోలింగ్ మరునాడు టీడీపీ అభ్యర్థి నానీపై జరిగిన దాడి ఘటనలో పోలీసు వైఫల్యం బయటపడింది. నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి తగిన రక్షణ లేదని ఆయన హైకోర్టును ఆశ్రయించి గన్‌మెన్ భద్రత పొందారు. అలా పొందిన కొద్ది రోజులకే ఆయనపై ఏకంగా హత్యాయత్నం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నేతకు తగిన భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం విఫలమైంది. తర్వాత కూడా అక్కడ పరిస్థితులను అదుపు చేయడంలో పోలీసు యంత్రాంగం చేతులెత్తేసింది. వర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ దాడి ఈవీఎంలు వుంచిన స్ట్రాంగ్ రూముల భద్రతను కూడా ప్రశ్నార్థకం చేసింది.
పోలింగ్ రోజు ఐదు చోట్ల ఉద్రిక్తత
ఈనెల 13న పోలింగ్ సందర్భంగా రామచంద్రాపురం మండలం బ్రాహ్మణకాల్వ పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల నడుమ ఘర్షణ జరిగింది. బీఎ్‌సఎఫ్ జవాన్ గాల్లోకి కాల్పులు జరిపినా పరిస్థితి అదుపులోకి రాలేదు. వైసీపీ అభ్యర్థి మోహిత్‌రెడ్డి భారీగా అనుచరులను వెంటదీసుకుని టీడీపీ కంచుకోట వంటి ఆ గ్రామంలోకి వచ్చి తమ ఏజంట్లపై దాడి చేసింది ఎవరంటూ టీడీపీ ఏజంట్లపై దౌర్జన్యానికి యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. అదే రోజు నానీ స్వగ్రామమైన పాకాల మండలం పులివర్తివారిపల్లికి వెళ్లిన వైసీపీ అభ్యర్థిని గ్రామస్తులు అడ్డుకోగా ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను నిర్బంధించారన్న ప్రచారంతో తుమ్మలగుంటలో గ్రామస్తులు పోలింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టి మోహిత్ క్షేమంగా వచ్చేవరకూ ఈవీఎంలను తరలించడానికి వీల్లేదని అడ్డుపడ్డారు. అక్కడ టీడీపీ నేత దొడ్ల కరుణాకర్‌రెడ్డిపై దాడికి యత్నించారు. అదే రోజు రాత్రి చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లి గ్రామాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయులు దాడులు, ప్రతిదాడులకు పాల్పడ్డారు. ఆ గ్రామాలకు మోహిత్ అనుచరులతో వెళ్లడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. వైసీపీ సర్పంచ్ ఇల్లు, రెండు కార్లను టీడీపీ వర్గీయులు తగులబెట్టారు.
కలెక్టర్ లక్ష్మీశా బదిలీతో అప్రమత్తం కాని యంత్రాంగం
ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లకు మించి విధులు నిర్వర్తిస్తున్న అధికారుల బదిలీల్లో భాగంగా కలెక్టర్ వెంకట్రమణారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీశా గత డిసెంబరులో కలెక్టర్‌గా వచ్చారు. ఆయన తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిని ఇంటికి వెళ్ళి మరీ కలసి శాలువా కప్పి సత్కరించడంతో ప్రతిపక్షాల నమ్మకాన్ని కోల్పోయారు. ప్రతిపక్ష పార్టీల నేతల ఫిర్యాదుతో ఈసీ ఆయన్ను గత నెల 2వ తేదీన బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రవీణ్‌కుమార్‌ను కలెక్టర్‌గా నియమించింది. ఈసీ తీరు ఎలా వుందో ఈ ఘటన స్పష్టంగా వెల్లడించినా జిల్లాలో అధికారులు మాత్రం అప్రమత్తం కాలేదు.
అనుభవలేమితో ఎస్పీ తప్పటడుగు!
శాంతి భద్రతల నిర్వహణ, ఎన్నికల నిర్వహణల్లో తగిన అనుభవం, అవగాహన లేకపోవడంతోనే ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తప్పటడుగు వేసినట్టు తెలుస్తోంది. 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఈయన రంపచోడవరంలో అసిస్టెంట్ ఎస్పీగా, కర్నూలు జిల్లాలో సెబ్ ఏఎస్పీగా, విజయవాడలో లా అండ్ ఆర్డర్ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. ఎస్పీగా తిరుపతిలోనే తొలి పోస్టింగ్. సరిగ్గా ఎన్నికల సమయంలో ఎస్పీగా విధులు చేపట్టడంతో తగిన అనుభవం, అవగాహన లేక కింది స్థాయి అధికారులపై ఆధారపడటం ఆయనకు చేటు చేసింది. అనుభవం, సమర్థత కలిగిన తదుపరి స్థాయి అధికారులు వున్నప్పటికీ వారిని పక్కనపెట్టి వారి కంటే కింది స్థాయిలో వున్న కొందరు అధికారులపై ఆధారపడ్డారని, అధికార పార్టీ నేతలతో అంటకాగుతున్న వారి సలహాలు, సూచనలతోనే విధి నిర్వహణలో విఫలమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఘర్షణలు జరగడం, 2019లో ఏడు చోట్ల రీ పోలింగ్ జరగడం వంటి గత చరిత్రను ఎస్పీ పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తోంది. దీనికి తోడు తిరుపతి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నాటి ఘర్షణలు, 2021 తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల నాటి ఉదంతాలూ పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు. జిల్లాకు ఎస్పీగా వచ్చినపుడు ఇక్కడి గత చరిత్రను తెలుసుకుని దానికనుగుణంగా జాగ్రత్తలు తీసుకుని వుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
తిరుపతి ఎమ్మెల్యే బహిరంగంగా బెదిరించినా..
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పోలింగ్‌కు రెండు రోజులు ముందు జీవకోనలో ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా ఆంధ్రజ్యోతి ప్రతినిధులను బెదిరించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఇదిఉల్లంఘించడమే అయినా పోలీసులు స్పందించలేదు. జర్నలిస్టు సంఘాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బెదిరింపులు మళ్ళీ కొనసాగుతుండడంతో మరోసారి ఎస్పీ దృష్టికి తెచ్చేందుకు సం ఘాలు యత్నించినా కనీసం కలిసేందుకు కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు.
మరోసారి గంగలో కలసిన జిల్లా పరువూ ప్రతిష్ఠ
గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన నాటి కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమే్‌షరెడ్డిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో పలమనేరు డీఎస్పీ, శ్రీకాళహస్తి, పుంగనూరు సీఐలపైనా బదిలీ వేటు పడింది. తర్వాత తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల నాటి ఘటనలతో అప్పటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీశా, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, ఇద్దరు సీఐలు, ఓ ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, తిరుపతి అర్బన్ తహసీల్దారు, డిప్యూటీ తహసిల్దారు సస్పెన్షన్‌కు గురయ్యారు. తాజా ఎన్నికల్లో తిరుపతి కలెక్టర్ లక్ష్మీశా కూడా బదిలీ వేటుకు గురయ్యారు. ఈ ఘటనలతో ఇప్పటికే దారుణంగా దెబ్బతిన్న జిల్లా పరువు ప్రతిష్టలు తాజాగా ఈసీ ఆదేశాలతో మరింతగా గంగ పాలయ్యాయి.
Updated Date - May 17 , 2024 | 02:11 AM