ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గాలేరు-నగరిపై మళ్లీ ఆశలు

ABN, Publish Date - Jul 13 , 2024 | 12:11 AM

రూ. 2500 కోట్లతో పూర్తి కావాల్సిన కాంట్రాక్టు రద్దు, రూ. 5 వేల కోట్ల అంచనాతో ప్రత్యామ్నాయ ప్రణాళిక , పరిశీలనలోనే ముగిసిపోయిన పుణ్యకాలం

చంద్రబాబు హయాంలో జరిగిన బాలాజీ రిజర్వాయర్‌ కట్ట పనులు

తిరుపతి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పర్యటించిన సందర్భంగా ఆ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చారు.అన్ని రంగాల్లో వెనుకబాటుతనానికి గురైన ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం చేయాల్సిందే. అయితే సొంత జిల్లాలో ఐదేళ్ళుగా అతీగతీ లేకుండా పోయిన గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు విషయంలోనూ జిల్లా ప్రజలు ఆయన నుంచీ ఇదే ప్రాధాన్యతను కోరుకుంటున్నారు. 1985 నుంచీ జిల్లా వాసులను ఊరిస్తున్న గాలేరు-నగరి ప్రాజెక్టును దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏ ముహూర్తాన ప్రకటించారో గానీ అప్పటి నుంచీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే వుంది. రామారావు తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు మారినా పనులు మొదలైంది మాత్రం చంద్రబాబు హయాంలోనే. గత ఐదేళ్ళూ వైసీపీ ప్రభుత్వంలో పనులు స్తంభించడమే కాక మునుపటి కాంట్రాక్టును రద్దు పరిచి డిజైన్‌ సైతం మార్చేశారు. ఇపుడు మళ్ళీ చంద్రబాబు సీఎం కావడంతో సొంత జిల్లా ప్రజల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి.

ప్రాజెక్టు నేపధ్యం

దివంగత సీఎం ఎన్‌టీ రామారావు రాయలసీమలో కరువు శాశ్వత నివారణ కోసం గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు రెండవ దశలో 8 నుంచీ 14 వరకూ మొత్తం ఏడు ప్యాకేజీల కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాకు నీరందించాల్సి వుంది. తిరుపతి రూరల్‌, రామచంద్రాపురం, వడమాలపేట, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, కేవీబీపురం, పిచ్చాటూరు, నాగలాపురం, నిండ్ర, విజయపురం, పుత్తూరు, నగరి, నారాయణవనం తదితర 14 మండలాల్లో 1.035 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి వుంది. దీనికోసం ఉమ్మడి కడప జిల్లా నుంచీ శేషాచల పర్వతాలలో రెండు చోట్ల టన్నెళ్ళు తవ్వాలి. మొదటి టన్నెల్‌ ద్వారా నీరు రేణిగుంట మండలం బాలాజీ రిజర్వాయర్‌కు చేర్చాలి. అక్కడ నుంచీ మల్లిమడుగు రిజర్వాయర్‌కు, ఆపై పద్మసాగర్‌, శ్రీనివాస సాగర్‌, వేణుగోపాల సాగర్‌, వేపగుంట, అడవి కొత్తూరు రిజర్వాయర్లను నింపాలి. మల్లిమడుగు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచి మిగిలిన రిజర్వాయర్లను కొత్తగా నిర్మించాలి. రెండు టన్నెళ్ళతో కూడిన 94 కిలోమీటర్ల ప్రధాన కాలువ, ఏడు రిజర్వాయర్ల నిర్మాణానికి 2005లో రూ. 2189 కోట్ల అంచనాతో అప్పటి ప్రభుత్వం పనులు మంజూరు చేసింది. 2008లో మళ్ళీ అంచనాలను రూ. 2526 కోట్లకు సవరించింది. పనులకు అనుమతి ఇచ్చిన నాటి వైఎస్‌ ప్రభుత్వం పనులు మాత్రం మొదలు పెట్టలేదు. దీంతో 2014 వరకూ ఆరేళ్ళ పాటు ప్రాజెక్టు మరుగునపడింది.

ప్రాజెక్టుకు ప్రాణం పోసిన చంద్రబాబు

2014లో చంద్రబాబు సీఎం కాగానే సొంత జిల్లాలో మరుగున పడిన గాలేరు-నగరి ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోశారు. రూ. 2526 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. ఆయన చొరవతో జిల్లా యంత్రాంగం పరుగులు పెట్టింది. భూసేకరణ పనులు జోరందుకున్నాయి. పద్మసాగర్‌, శ్రీనివాస సాగర్‌ రిజర్వాయర్లకు సంబంధించి ప్రైవేటు భూముల సేకరణ ముగిసింది. బాలాజీ రిజర్వాయర్‌ కట్ట నిర్మాణం, అక్కడ నుంచీ మల్లిమడుగు రిజర్వాయర్‌ వరకూ కాలువ తవ్వకం పనులు, మల్లిమడుగు రిజర్వాయర్‌ సామర్ధ్యం పెంపు పనులు మొదలయ్యాయి. మల్లిమడుగు రిజర్వాయర్‌ సామర్ధ్యం 0.18 టీఎంసీలుగా వుండగా దాన్ని 2.65 టీఎంసీలకు పెంచేందుకు రూ. 56.08 కోట్లతో పనులు మొదలు కాగా రూ. 25 కోట్ల పనులు చేశారు. వేణుగోపాల సాగర్‌ అంచనా వ్యయం రూ. 160 కోట్లు. ఇందులో రూ. 35 కోట్ల పనులు పూర్తయ్యాయి. కాలువతో సహా వేపగుంట సాగర్‌, అడవికొత్తూరు రిజర్వాయర్ల అంచనా వ్యయం రూ. 129.8 కోట్లు. ఇందులో 75 శాతం పనులు పూర్తయ్యాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు రాక టన్నెళ్ళ నిర్మాణం పెండింగ్‌ పడింది. మిగిలిన రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణలో అటవీ శాఖ నుంచీ అనుమతులు రాలేదు. 2019లో ఎన్నికలు వచ్చేటప్పటికీ గాలేరు-నగరి ప్రాజెక్టు పనుల పురోగతి చాలా ఆశాజనకంగా వుండింది.

జగన్‌ రాకతో టెండర్లు రద్దు... డిజైన్‌ మార్పు

2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి జగన్‌ సీఎం కావడంతో ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. పనులన్నీ ఆగిపోయాయి. నిధులూ విడుదల కాలేదు. 2020 జూలై 8న ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది. పాత డిజైన్‌ ప్రకారం పనులు చేపడితే రామచంద్రాపురం మండలంలో ప్రతిపాదిత పద్మసాగర్‌, శ్రీనివాస సాగర్‌ రిజర్వాయర్ల పరిసరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకుందని, భూముల విలువ విపరీతంగా పెరిగిపోయినందున భూసేకరణ ప్రభుత్వానికి భారమవుతుందన్న వాదన తెరపైకి తెచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఆ వంకతో ఆ రెండు రిజర్వాయర్లనూ రద్దు చేశారు. గండికోట రిజర్వాయర్‌ నుంచీ కాలువ తవ్వి నీటిని గాలేరు-నగరి కాలువకు మళ్ళించేలా ప్రత్యామ్నాయ డిజైన్‌ను రూ. 5013 కోట్ల అంచనాతో 2021 ఆగస్టులో రూపొందించారు. అయితే అప్పటినుంచీ ఆ ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదానికి నోచుకోలేదు. దీంతో ఐదేళ్ళ పాటు ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. మరోవైపు పాత టెండర్లు రద్దయ్యాయి. రీ టెండర్లు పిలవలేదు. డిజైన్‌ కూడా మార్చివేసినా దానికీ అనుమతులు లేవు. నిధులూ ఇవ్వలేదు. అటవీ శాఖ అనుమతులు కూడా సాధించలేదు. ఫలితంగా గత వైసీపీ ప్రభుత్వం గాలేరు-నగరి ప్రాజెక్టు ఊపిరి తీసేసినట్టయింది.

చంద్రబాబుపైనే ఆశలు

ఇటీవలి ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి సీఎం కావడంతో గాలేరు-నగరి ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ఎన్నికల ముందు ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా బాలాజీ రిజర్వాయర్‌ ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే ఈ పనులను పూర్తి చేస్తానని, జిల్లాలో కరువును శాశ్వతంగా నిర్మూలిస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఆయనే ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించిన నేపధ్యంలో ఇపుడు తొలి ప్రాధాన్యత కింద ఈ ప్రాజెక్టును ఎంపిక చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ప్రాజెక్టు పనులను సమీక్షించి, అవసరమైన అంచనాలు రూపొందించాలని, ఆ మేరకు నిధులు మంజూరు చేసి వేగంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరుతున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 12:11 AM

Advertising
Advertising
<