గాదంకి టోల్‌ప్లాజా వద్ద గంజాయి కలకలం
ABN, Publish Date - Aug 18 , 2024 | 12:35 AM
కారు డిక్కీ నుంచి రోడ్డుపైపడ్డ రెండు ప్యాకెట్లు
పాకాల/చంద్రగిరి, ఆగస్టు 17: రెండు గంజాయి ప్యాకెట్లు కారు డిక్కీ నుంచి రోడ్డుపైపడిన ఘటన గాదంకి టోల్ ప్లాజా వద్ద శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, టోల్ ప్లాజా అధికారుల సమాచారం మేరకు.. శనివారం రాత్రి పాకాల మండలం గాదంకి సమీపంలోని టోల్‌ప్లాజా స్పీడ్ బ్రేకర్ వద్ద తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న ముదురు నీలి రంగు కారు డిక్కీ నుంచి రెండు ప్యాకెట్లు ఎగిరి రోడ్డుపై పడ్డాయి. ఆ తర్వాత కారు అతివేగంగా వెళ్లిపోయింది. దీన్ని టోల్ సిబ్బంది గమనించి.. ప్యాకెట్లను పరిశీలించగా, అందులో గంజాయి కనిపించింది. వెంటనే ఐడీ పార్టీ పోలీసులకు సమాచారం అందించారు. కారు వేగంగా వెళ్లడం, డిక్కీలో నుంచి ప్యాకెట్లు ఎగిరిపడటం టోల్‌గేట్ సీసీ కెమెరాలో రికార్డు అయింది. కారు డిక్కీ నిండా ప్యాకెట్లు ఉండటం వల్లే డోర్ పూర్తిగా లాక్ పడలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈసంఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Updated Date - Aug 18 , 2024 | 12:35 AM