ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దోషం దందా

ABN, Publish Date - Aug 18 , 2024 | 12:33 AM

ముక్కంటి ఆలయంలో ఆగని వసూళ్లపర్వం

రాహుకేతు మండపం వద్ద బారులు తీరిన భక్తులు

శ్రీకాళహస్తి, ఆగస్టు 17: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులను దోపిడీ చేయడం ఆగడమేలేదు. ప్రత్యేకించి రాహుకేతు పూజల్లో భక్తుల నుంచి బలవంతపు వసూళ్లు విచ్చలవిడిగా సాగిస్తూనే ఉన్నారు. గత వైసీపీ పాలనలో ఒక దోషపూజల విభాగంలోనే రూ.50కోట్లకు పైగా అక్రమ సొమ్మును పోగేసి అప్పటి పాలకులు, అధికారులు పంచుకున్నారన్నది బహిరంగ రహస్యం.కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆలయంలో అధికారులు కొద్దిరోజుల పాటు ఈ దందాలను పక్కన పెట్టారు. అక్రమ సంపాదనకు అలవాటుపడిన సిబ్బంది మళ్లీ బహిరంగ వసూళ్లకు తెరతీశారు. అయితే ఈసారి దోష పూజల్లో దక్షిణకు పక్కాగా అధిక ధరలు కేటాయించి మరీ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.గ్రహణకాల అభిషేకాలను దర్శించుకోవడానికి,రాహుకేతు సర్పదోష పూజలు జరిపించుకునేందుకు విదేశాల నుంచి సైతం పెద్దసంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తుంటారు.రాహుకేతు పూజలను ఐదు రకాల ధరలతో విక్రయిస్తారు.రూ.500, రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5వేలు టిక్కెట్లుగా విభజించి ఆయా మండపాల్లో బ్యాచ్‌ల వారీగా పూజలు చేస్తుంటారు. ఉదయం 6నుంచి సాయంత్రం 6 వరకు రోజూ ఈ పూజలు జరుగుతూనే ఉంటాయి. మండపాల్లో ఆశీనులైన భక్తులకు సామూహికంగా సంకల్పాన్ని మైక్‌లో అనౌన్స్‌ చేస్తూ రాహుకేతు పూజలు జరిపిస్తారు. ఇదే మైక్‌ నుంచి అక్కడ పనిచేసే సిబ్బంది బహిరంగంగా దక్షిణ సమర్పించాలంటూ భక్తులను డిమాండు చేస్తున్నారు. దక్షిణ సమర్పిస్తేనే మీ దోషం పోతుందంటూ మానసికంగా భయపెడుతున్నారు.రూ.101 చెల్లించాలంటూ పీడించి మరీ వసూలు చేస్తున్నారు. నెల రోజుల నుంచి రూ.2,500 పూజల్లో అయితే రూ.201, రూ.5వేల పూజల్లో అయితే తప్పనిసరిగా రూ.501 దక్షిణ పెట్టాలంటూ భక్తులను బలవంతపెడుతున్నారు. ఆలయంలో నెలకు రాహుకేతు పూజలు సుమారు లక్ష వరకు జరుగుతాయని అంచనా. ప్రభుత్వం మారినా రాహుకేతు పూజామండపాల్లో వసూళ్లు ఆగలేదు. పైగా దక్షిణ ధరను ఖచ్చితంగా నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. ఇటీవల రూ.2,500 పూజల్లో రూ.201 దక్షిణ పెట్టాలంటూ అక్కడ సిబ్బంది మైక్‌లో ఆదేశించారు. అయితే రూపాయి నాణెం లేని కొందరు భక్తులు ఏంచేయాలో అర్థం కాక చుట్టుపక్కల వారిని యాచించాల్సిన దుస్థితి ఎదురైంది. మొత్తంగా ఆలయంలో రాహుకేతు పూజల ద్వారా లక్షలాది రూపాయల సొమ్మును పోగేసి కింది నుంచి పైస్థాయి అధికారి వరకు పంచుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాహుకు, కేతువుకు వేర్వేరుగా సమర్పించండి

గతంలో పూజ చేసుకున్న తరువాత రూ.500 రాహుకేతు పూజల్లో రూ.101 సమర్పించాలని మైకులో భక్తులను ఆదేశించేవారు. అయితే ఇప్పుడు రద్దీ తక్కువుండే రోజుల్లో రాహువుకు రూ.151, కేతువుకు రూ.151 చొప్పున వేర్వేరుగా సమర్పిస్తేనే దోషం పోతుందంటూ వసూలు చేస్తున్నారు. పెరిగిన ఆదాయాన్ని వాటాలు వేసుకునే విషయంలో విబేధాలు తలెత్తాయి. దాంతో రూ.500 మండపంలో పనిచేసే ఓ అర్చకుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

యధేచ్ఛగా హారతిపళ్లేలతో వసూళ్లు

ఇటీవల ఆలయంలో హారతి పళ్లేల దందా బాగా పెరిగింది.హారతి పళ్లేల ద్వారా భక్తుల నుంచి దక్షిణ వసూలు చేయడాన్ని దేవదాయశాఖ నిషేధించింది.కానీ ముక్కంటి ఆలయంలో మాత్రం వైసీపీ పాలనలో హారతిపళ్లేల ద్వారా అధిక ఆదాయాలు లభించే స్థానాల కోసం పలువురు అర్చకులు పోటీపడ్డారు. ముడుపులు సమర్పించి మరీ ఆదాయ స్థావరాలను చేజిక్కించుకున్నారు. మూడేళ్ల క్రితం ఉన్నతస్థాయిలో ఉండే ఇద్దరు అర్చకులు భక్తుల ఎదుటే దక్షిణ విషయమై హారతి పళ్లేలను ఒకరిపై ఒకరు విసురుకునే స్థాయికి వివాదం రేగింది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొద్దిరోజుల పాటు ఈ వసూళ్లను పక్కన పెట్టారు. కొద్దిరోజుల వ్యవధిలోనే ప్రధాన ఆలయంతో పాటు చిన్నచిన్న పరివార దేవతల వద్ద కూడా దాదాపు 20చోట్ల హారతి పళ్లేలు వెలిశాయి. బాహాటంగా దక్షిణ సమర్పిస్తేనే హారతి అనే విధంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.

Updated Date - Aug 18 , 2024 | 12:33 AM

Advertising
Advertising
<