ఛలో అమరావతి
ABN, Publish Date - Jul 31 , 2024 | 02:47 AM
కుప్పంనుంచి వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్ల రాజధాని పయనం నేడో రేపో పార్టీలో చేరిక కుప్పంలో వైసీపీ ఖాళీ అవుతోంది. వైసీపీనుంచి టీడీపీలోకి పెద్దయెత్తున చేరికలు ఉండబోతున్నాయని నెల రోజులుగా వినిపిస్తున్న వార్తలకు మంగళవారం సాయంత్రానికి ఒక పునాది దొరికింది. కుప్పంలోని మూడు మండలాలనుంచి మొత్తం 15 మంది వైసీపీ ఎంపీటీసీలు, నలుగురు కౌన్సిలర్లు విజయవాడ బయలుదేరి వెళ్లారు. వీరంతా నేడో, రేపో టీడీపీలో చేరనున్నారు. మిగిలిన వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కూడా అధికార పార్టీలో చేరడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
కుప్పం, జూలై 30: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ జులుం ప్రదర్శించింది. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంపైనే దృష్టి పెట్టి, పంచాయతీలను ఏకగ్రీవం చేయించుకున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. వైసీపీ అధికార దుర్వినియోగానికి నిరసనగా మండల పరిషత్తు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. దీంతో నియోజకవర్గం వైసీపీకి ఏకపక్షమైంది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. కుప్పంలో టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తామని నాడు వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికేవారు. ఒకరిద్దరు పోలీసు అధికారులు కూడా బహిరంగంగానే ఈ డైలాగ్ వాడుతుండేవారు. కానీ అది జరగలేదు. అధికార పార్టీ అక్రమాలు, అరాచకాలతో భయపడి నిద్రాణంగా ఉన్న టీడీపీ, ప్రజల మనసులను గెలుచుకుని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పునరుత్తేజం చెందింది. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. వైసీపీనుంచి చేరికలకు అధిష్ఠానం తెరతీసింది. నిజానికి కుప్పం నియోజకవర్గంలో అంతర్భాగమైన మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ చేరికతో ఆ ప్రక్రియ మొదలయ్యేదే. కానీ అతికొద్దిమంది నాయకులు అడ్డుకోవడంతో అది ఆలస్యమైంది. కానీ ఎన్నికల సమయంలో ఉపయోగపడని సదరు నాయకులను అధిష్ఠానం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు చేరికలను వేగవంతం చేయడానికి తెరవెనుక మంత్రాంగం నడిపించింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నేతృత్వంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చేరికలకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జిలను అంతర్గతంగా నియమించి ప్రయత్నాలు ప్రారంభించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు సై అంటే సై అన్నారు.
విజయవాడకు పయనం
కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 మంది కౌన్సిలర్లుండగా వారిలో 19 మంది వైసీపీవారే. మున్సిపాలిటీని ఆ పార్టీయే గెలుచుకుంది. దాడులు, దౌర్జన్యాలు జరిగాయి, అది వేరే విషయం. ఇప్పుడు ఈ 19 మంది కౌన్సిలర్లలో నలుగురు మంగళవారం సాయంత్రం విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఇంకా ఇద్దరు కౌన్సిలర్లతో మంతనాలు సాగుతున్నాయి. వారు పార్టీలోకి రాననడంలేదు కానీ, ఏవో సమస్యలున్నాయని చెబుతున్నారు. టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ నేతృత్వంలో ఈ చేరికలు జరుగుతున్నాయి.
కుప్పం మండలంలో 21 మంది ఎంపీటీసీలకు గాను ప్రస్తుతం టీడీపీకి ఇద్దరే ఉన్నారు. వైసీపీ ఎంపీటీసీలలో ముగ్గురు సాయంత్రమే విజయవాడ బయలుదేరారు. టీడీపీనుంచి ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించిన స్వాతి రాజగోపాల్ నేత్వంలో వీరు వెళ్లారు. ఇంకా ముగ్గురు ఎంపీటీసీలు కూడా చేరికలకు అంగీకరించారు కానీ, ఏవో సమస్యల కారణంగా ఆగిపోయారు. వీరి చేరిక కూడా కాస్త వెనుకా ముందూ జరుగుతుంది.
శాంతిపురం మండలం తీసుకుంటే ఇక్కడ మొత్తం 18 మంది ఎంపీటీసీలుండగా సి.బండపల్లెకు చెందిన నామాలప్ప మాత్రమే టీడీపీ ఎంపీటీసీ. మిగిలిన 17 వైసీపీ ఎంపీటీసీలలో ఆరుగురు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బీఆర్.సురేశ్‌బాబు ఆధ్వర్యంలో విజయవాడ బయలుదేరారు.
గుడుపల్లె మండలంలో 13 మంది ఎంపీటీసీలుండగా వారంతా వైసీపీకి చెందినవారే. వీరిలో ఒక్క ఎంపీటీసీ మాత్రం ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. మిగిలిన 12 మంది ఎంపీటీసీలలో ఆరుగురు మండల టీడీపీ అధ్యక్షుడు బాబునాయుడు ఆధ్వర్యంలో విజయవాడ బయలుదేరారు. ఇంకా ఇద్దరు ఎంపీటీసీలు వేరే పనులమీద వెళ్లి అక్కడే ఉన్నట్లు సమాచారం.
రామకుప్పం మండలంనుంచి మాత్రం మంగళవారం ఎవరూ విజయవాడ వెళ్లలేదు. 16 మంది ఎంపీటీసీలుండగా అందులో ఒకరైన ఎంపీపీ మృతి చెందారు. మిగిలిన 15 మంది ఎంపీటీసీలలో ఆరేడుమంది ఎంపీటీసీలు ప్రత్యేకంగా రెండుమూడు రోజుల తర్వాత టీడీపీలో చేరడానికి విజయవాడ బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిసింది. బుధవారం లేదంటే గురువారంనాడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఏకమొత్తంగా టీడీపీలో చేరనున్నారు.
రెండో విడతలో మరిన్ని చేరికలు
వైసీపీనుంచి టీడీపీలో చేరికలు ఇక్కడితో ఆగేలా లేవు. రెండో విడతలో మరిన్ని జరగడానికి ఆస్కారం ఉంది. టీడీపీలో చేరడానికి తొలుత ప్రయత్నించి ఒకరిద్దరు నేతల కినుకతో వెనుకబడిన మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్‌తోపాటు, నాలుగు మండలాల జడ్పీటీసీల చేరికకు కూడా ఇప్పటికే రంగం సిద్ధమైనట్లు తెలిసింది. సర్పంచుల చేరిక కూడా వారితో కలిపో లేక విడిగానో జరగనున్నాయని పార్టీ వర్గాల సమాచారం. ముందుగా కిందిస్థాయిలో చేరికలను ప్రోత్సహించి మండల పరిషత్తులను హస్తగతం చేసుకున్న తర్వాత, మున్సిపాలిటీపైన, జడ్పీటీసీ పదవులపైనా దృష్టి సారించడానికి ఇప్పటికే అధిష్ఠానం సిద్ధం చేసింది. టీడీపీలో ఒకరిద్దరు నాయకులనుంచి కొంతమంది కార్యకర్తలనుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించడానికి అంచెలంచెలుగా చేరికలను జరుపనున్నారు. ఈ చేరికల వల్ల పార్టీకి కానీ, ఎన్నికల్లో కష్టపడ్డ కార్యకర్తలకు కానీ ఎటువంటి నష్టం, అన్యాయం జరగకుండా చూస్తామని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. మొన్న నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలోనూ ఇదేరకమైన హామీ ఇచ్చారు. సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రతిపక్ష పార్టీని ఖాళీ చేయించాలన్న ఏకైక లక్ష్యంతో టీడీపీ అధిష్ఠానం జాగ్రత్తగా వ్యూహం రచించి అమలు చేస్తోంది.
Updated Date - Jul 31 , 2024 | 02:47 AM