సూర్యోదయానే.. చంద్రోదయానికై..!
ABN, Publish Date - Jun 11 , 2024 | 10:40 PM
ఎన్డీఏ శాసనసభ పక్షనేత హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి కూటమి దండు కదిలింది.
కుటుంబ సమేతంగా వెళ్లిన విజేతలు
విజయవాడకు కదిలిన కూటమి దండు
ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షంగా చూడాలని..
అనంతపురం, జూన 11(ఆంధ్రజ్యోతి)/టౌన: ఎన్డీఏ శాసనసభ పక్షనేత హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి కూటమి దండు కదిలింది. విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు ఎదురుగా, కేసరపల్లి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బుధవారం ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు జిల్లా నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివెళ్లారు. ఈ కారణంగా జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో మంగళవారం ఉదయం నుంచి సందడి వాతావరణం కనిపించింది. ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అక్కడ కూర్చునేందుకు అవసరమైన వీవీఐపీ, వీఐపీ పాసులు లేకపోయినా.. తమ నాయకుడు చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ఎలాగైనా నేరుగా చూడాలన్న ఆకాంక్షతో సామన్య కార్యకర్తలు సైతం వెళ్లడం విశేషం.
ముందే వెళ్లిన విజేతలు
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, జేసీ అశ్మితరెడ్డి, గుమ్మనూరు జయరాం, బండారు శ్రావణిశ్రీ తమ కుటుంబ సభ్యులతో రెండు రోజుల ముందే విజయవాడకు చేరుకున్నారు. అక్కడ మంగళవారం ఉదయం నిర్వహించిన టీడీఎల్‌పీ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో తొలిసారిగా క్లీన స్వీప్ చేసిన ఆనందంతో కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది.
అనంత సంబరం
చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రజలు చూసేందుకు వీలుగా జిల్లా వ్యాప్తంగా 45 ప్రాంతాలలో భారీ ఎల్‌ఈడీ స్ర్కీనలను ఏర్పాటు చేశారు. కలెక్టరు వినోద్ కుమార్ ఆదేశాల కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు, అభిమానులు, ప్రజల కోసం వీటిని ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ రెవెన్యూ భవనలో ఏర్పాటు చేసిన స్ర్కీనలో వేడుకలను కలెక్టర్ సహా జిల్లా ఉన్నతాధికారులు వీక్షించనున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కావడంతో జిల్లాలోని ప్రధాన కార్యాలయాలను విద్యుత దీపాలతో అలంకరించారు. కలెక్టరేట్, క్లాక్ టవర్, మున్సిపల్ కార్యాలయాలను వేడుకలకు ముస్తాబు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకలను చూసేందుకు రాజధానికి వెళ్లేవారి కోసం 32 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. చంద్రబాబును అభినందిస్తూ ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
Updated Date - Jun 11 , 2024 | 10:40 PM