ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సందడిగా గ్రామసభలు

ABN, Publish Date - Aug 24 , 2024 | 05:26 AM

ఒక్కరోజే 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది.

13,326 పంచాయతీల్లో ఒకేరోజు.. అట్టహాసంగా నిర్వహించిన కూటమి ప్రభుత్వం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఒక్కరోజే 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ గ్రామసభల్లో ఉపాధి హామీ పథకంలో చేపట్టబోయే పనులకు సంబంధించి జాబితాతోపాటు స్వర్ణ గ్రామ పంచాయతీకి సంబంధించి పలు పనులకు ఆమోదం లభించింది. సర్పంచులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు ఈ సభల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోనసీమ జిల్లా వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొనగా, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలోని మైసూరావారిపల్లెలో జరిగిన గ్రామసభలో పాల్గొన్నారు. ఆయనతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌ కృష్ణతేజ పాల్గొన్నారు. మంత్రులు ఆయా జిల్లాల్లో గ్రామసభల్లో పాల్గొని సర్పంచులలో నూతనోత్తేజాన్ని కలిగించారు. ఎమ్మెల్యేలు కూడా విధిగా ఏదో ఒక గ్రామసభలో పాల్గొని గ్రామసభల ప్రాధాన్యాన్ని తెలియజేశారు. ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించి గ్రామ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా గ్రామాల్లో ఏయే పనులు అవసరమో? ముందుగానే అధికారులు గుర్తించి గ్రామసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి గ్రామసభల ద్వారా ఉపాధి పనులకు ఆమోదం లభించడంతో ఉపాధి హామీ సిబ్బందికి ఊరట లభించింది. సర్పంచులు ఇకపై గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇది మార్గదర్శకంగా నిలిచిందంటున్నారు. చంద్రబాబు వానపల్లిలో, పవన్‌కల్యాణ్‌ మైసూరావారిపల్లెలో చేసిన ప్రసంగాలు రాష్ట్రవ్యాప్తంగా సర్పంచుల్లో ఆత్మసైర్యం నింపాయి. గ్రామ పంచాయతీలు ఒక వైభవ స్థితికి వస్తాయని, కేరళ, తమిళనాడుల్లో మాదిరిగా గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని నమ్ముతున్నారు. దీంతో గ్రామాలకు దక్కాల్సిన నిధులు, విధులు సమకూరతాయని, సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధిశాఖను నిర్వహించడంతో ఆ శాఖకు అత్యంత ప్రాధాన్యమేర్పడిందని పేర్కొంటున్నారు. చాలా జిల్లాల్లో 75 శాతం వరకు వైసీపీ సర్పంచులు ఉన్నప్పటికీ, పార్టీలకతీతంగా వారు పాల్గొని గ్రామ సభలను నిర్వహించారు.

ఏ మంత్రి ఎక్కడ? ఏం చెప్పారంటే..?

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలోని సానివాడ గ్రామసభలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పల్లె ప్రాంతాలే పట్టుకొమ్మలని, ప్రతి పల్లెను స్వర్ణ గ్రామంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామసభలో మాట్లాడుతూ ప్రజలు కోరుకున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం చేసి చూపుతుందన్నారు.

గృహనిర్మాణ- సమాచారశాఖల మంత్రి కొలుసు పార్ధసారథి ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేట గ్రామసభలో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో మంత్రి విచారణకు ఆదేశించారు.

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బాపట్ల జిల్లా నగరం మండలం ధూళిపూడి గ్రామసభలో మాట్లాడుతూ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసి, గ్రామాలను అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామని చెప్పారు.

విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామసభలో మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి గ్రామసభలు వారధిగా ఉపయోగపడతాయన్నారు.

రోడ్లు-భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామసభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీల రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు.

ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేట గ్రామసభలో.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే పేదల కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తోందని తెలిపారు.

గిరిజన-మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలస, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజు పేట గ్రామసభల్లో పాల్గొన్నారు. పంచాయతీల అభివృద్ధి నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రూ.4,500 కోట్లు విడుదల చేస్తుందని, ఆ నిధుల్లో రూ.990 కోట్లను నేరుగా సర్పంచుల ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు.

గనులు-ఎక్సైజ్‌శాఖల మంత్రి కొల్లు రవీంద్ర కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లి, చిన్నాపురం, తాళ్లపాలెం గ్రామసభల్లో మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం ఉపమాకలో హోంమంత్రి వంగలపూడి అనిత, మాకవరపాలెం గ్రామసభకు స్పీకర్‌ సీహెచ్‌ అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో చేపట్టనున్న పనులు, 2025-26 నుంచి వరుసగా నాలుగేళ్లకు ప్రణాళికలపై సభల్లో చర్చించారు. స్వర్ణగ్రామాలుగా రూపొందించే అంశాలపై సర్పంచ్‌ల ఆధ్వర్యంలో చర్చించి, తీర్మానాలు తీసుకున్నారు.

వాగ్వాదాలు.. ఘర్షణలు..: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం పంచాయతీలో నిర్వహించే గ్రామసభకు తనకు సమాచారం ఇవ్వలేదని... గ్రామ సచివాలయం వద్ద సర్పంచ్‌ తమ్మినేని వాణి (మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం భార్య) నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడి సభలో సర్పంచ్‌, జనసేన వర్గీయులు తన్నుకున్నారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గం సర్పవరం గ్రామసభలో జనసేన ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌, ఎమ్మెల్యే పంతం నానాజీ ఫొటోలు లేకపోవడంతో నేతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 24 , 2024 | 05:26 AM

Advertising
Advertising
<