‘బోటు’ రూటు మారింది!
ABN, Publish Date - Sep 15 , 2024 | 05:15 AM
ప్రకాశం బ్యారేజీ వద్ద ఇప్పటి వరకు పైకి కనిపించిన బోటు కృష్ణానదిలోకి దిగిపోయింది.
పూర్తిగా నదిలోకి మునిగిపోయిన బోటు
లాగేకొద్దీ రోప్, క్రేన్‌పై పెరుగుతున్న బరువు
బ్యారేజీ వద్ద నుంచి 10అడుగులు ముందుకు
ఒక్కో బోటు100టన్నుల బరువుండే చాన్స్
విజయవాడ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రకాశం బ్యారేజీ వద్ద ఇప్పటి వరకు పైకి కనిపించిన బోటు కృష్ణానదిలోకి దిగిపోయింది. భారీ ఇనుప రోప్‌లను మెలికవేసి క్రేన్‌తో లాగుతుంటే కొంచెం కొంచెం మాత్రమే కదులుతోంది. లాగుతున్న కొద్దీ రోప్, క్రేన్‌పై బరువు పెరుగుతోంది. బ్యారేజీ వద్ద మొత్తం మూడు బోట్లు ఉన్నట్టు బెకమ్ కంపెనీ ఇంజనీర్లు, అబ్బులు టీం గుర్తించిన విషయం తెలిసిందే. వీటిలో ఒక్కో బోటును తొలగించడానికి నిపుణులు వేస్తున్న ప్రణాళికలు ఫలించడం లేదు. ఆక్సి ఆర్క్ కటింగ్ ద్వారా పైకి కనిపిస్తున్న బోటును రెండు ముక్కలు చేస్తే తొలగింపు సులువుగా ఉంటుందని భావించారు. ఈ ప్లాన్ కాస్తా రివర్స్ అయింది. బోటులోకి నీరు ప్రవేశించడంతో ఆసాంతం కిందికి దిగిపోయింది. బోటును యథాస్థితికి తీసుకొచ్చినప్పటికీ దాన్ని లాగడం కష్టతరమవుతోంది. బ్యారేజీ గేటు వద్ద నీళ్లలో మునిగిపోయిన బోటు ఐదు నుంచి పది అడుగుల ముందుకు వచ్చినట్టు కార్మికులు చెబుతున్నారు. బోటు బరువు 40 టన్నులు ఉంటుందని తొలుత భావించారు. తాజా పరిణామాలను బట్టి ఒక్కో బోటు 100 టన్నుల వరకూ బరువు ఉంటుందని అబ్బులు టీం గుర్తించింది. ఈ బోటులో 250 టన్నుల ఇసుకను లోడ్ చేయవచ్చని నిర్ధారించారు. ఇందులో లోడ్ పూర్తిగా ఉంటే మొత్తం బరువు 350 టన్నులు. బోటు ఎత్తు 3.8 మీటర్లు, వెడల్పు 7, పొడవు 35 మీటర్లు ఉన్నట్టు తేలింది.
పూర్తికాని కటింగ్
బోటుకు అడుగు భాగాన ఆక్సి ఆర్క్ కటింగ్ ద్వారా కట్ చేయాలని భావించారు. ఇందుకోసం వైజాగ్‌కు చెందన సీ లయన్ కంపెనీ డైవర్లు రంగంలోకి దిగారు. నీళ్లలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోటు అడుభాగాన్ని పూర్తిగా కట్ చేయలేకపోయారు. ప్రవాహ ఉధృతితో డైవర్లు ఇబ్బంది పడ్డారు. అవకాశం ఉన్న మేరకు కట్ చేశారు. ఈ రంధ్రాల నుంచి లోపలకు నీరు ప్రవేశించి బోటు మునిగిపోయిందని భావిస్తున్నారు. భారీ ఇనుప రోప్‌ను ఘాట్ మీద నుంచి ఒక క్రేన్ లాగుతోంది. ఇక్కడ ప్రాంగణం విశాలంగా లేకపోవడంతో క్రేన్ కొంతదూరం వరకు రోప్‌ను లాక్కుని వెళ్లి మళ్లీ ముందుకు రావాల్సి వస్తోంది. మళ్లీ రోప్‌ను అక్కడి నుంచి లాక్కుని వెళ్లాల్సి వస్తోంది. దీంతో చాలావరకు సమయం క్రేన్‌కు రోప్‌ను కట్టడంతోనే సరిపోతోంది. ప్రకాశం బ్యారేజీ స్లూయిజ్ గేటుకు వెనుక వైపున ఒక చిన్న గోడను నిర్మించారు. బోటు కదులుతున్న సమయంలో ఈ గోడను ఢీ కొడుతున్నట్టు అనుమానిస్తున్నారు.
నేడు ‘వాటర్ లోడింగ్’ ప్లాన్
ఎన్ని ప్రయత్నాలు చేసినా బోటు కొంతమేరకు మాత్రమే ముందుకు కదులుతుండటంతో ఆదివారం వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయాలని అబ్బులు టీం నిర్ణయించింది. ఈ బోట్లను లాగడానికి గొల్లపూడి నుంచి ఆరేడు కార్గో బోట్లను రప్పించారు. వీటిలో రెండింటిని పూర్తిగా నీటితో నింపి, మునిగి ఉన్న బోటుతో లాక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ బోట్లు నీళ్లలోకి దిగుతాయి. తర్వాత వాటిలో ఉన్న నీటిని తోడేస్తారు. దీంతో అవి పైకి వచ్చే సమయంలో మునిగిన బోటు కూడా పైకి లేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తుందని అబ్బులు టీం భావిస్తోంది. నీళ్లలో మునిగిన ఓడలను పైకి లేపడానికి బెలూన్ టెక్నాలజీ ఉన్నా అది ఇలాంటి చోట్ల పనిచేయదని అబ్బులు తెలిపారు.
ఏలేరుకు మళ్లీ వరద
ఆందోళన కలిగిస్తున్న ఇన్‌ఫ్లో
పిఠాపురం, సెప్టెంబరు 14: కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వాయర్‌లోకి పెరుగుతున్న ఇన్‌ఫ్లో ఆందోళన కలిగిస్తోంది. ఇన్‌ఫ్లోకు అనుగుణంగా కాలువలకు వరద నీరు విడుదల చేస్తున్నారు దీంతో ఏలేరు కాలువల్లో వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఏలేరు రిజర్వాయర్‌లో 3రోజులుగా పెరుగుతూ వస్తున్న ఇన్‌ఫ్లో శనివారం 6,107 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటిమట్టం 85.80 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటినిల్వలు 22.56 టీఎంసీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రిజర్వాయర్ నుంచి వరద నీటి విడుదలను 5,875 క్యూసెక్కులకు పెంచారు. కాకినాడ జిల్లాలోని కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి తదితర మండలాల పరిధిలో కాలువలకు భారీగా గండ్లుపడ్డాయి. ప్రస్తుతం వీటిని నుంచి వరద నీరు మళ్లీ పొలాల్లోకి చేరుతోంది. ఇంకా సుమారు 5,700 ఎకరాలు ముంపులో కొనసాగుతున్నాయి. దీంతో అక్కడక్కడా మిగిలిన కొద్దిపాటి పంటలు చేతికందకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Sep 15 , 2024 | 05:17 AM