తెలంగాణ హద్దులు దాటి ఏపీలోకి..
ABN, Publish Date - Jun 22 , 2024 | 03:11 AM
తుంగభద్ర నదిలో ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇసుక తవ్వకాల్లో సరిహద్దు వివాదం తలెత్తింది.
తుంగభద్రలో ఇసుక అక్రమ తవ్వకాలు
51 ఇసుక ట్రాక్టర్ల యజమానులకు జరిమానా
కర్నూలు, జూన్ 21(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదిలో ఏపీ- తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇసుక తవ్వకాల్లో సరిహద్దు వివాదం తలెత్తింది. కర్నూలు, తెలంగాణకు చెందిన జోగులాంబ గద్వాల కలెక్టర్లు పరస్పరం చర్చలు జరిపి వివాదానికి తెరదించారు. వివరాలివీ.. కర్నూలు రూరల్ మండలం ఆర్.కొంతలపాడు, సుంకేసుల గ్రామాల సమీపంలో నాణ్యమైన ఇసుక నిల్వలు ఉన్నాయి. వీటికి సమీపంలోనే సుంకేసుల జలాశయం, తాగు, సాగునీటి ప్రాజెక్టులు ఉండడం వల్ల ఏపీ అధికారులు ఇసుక రీచ్‌కు అనుమతి ఇవ్వలేదు. నది అటువైపున జోగులంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తూర్పు గార్లపాడు గ్రామం వద్ద తుంగభద్ర నదిలో ఇసుక రీచ్‌కు ఆ రాష్ట్రం అనుమతి ఇచ్చింది. దీంతో టీఎస్ శాండ్ యాప్‌లో రాయల్టీ చెల్లించి ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. ఆ రీచ్‌లో ఇసుక నిల్వలు ఖాళీ కావడంతో ఏపీ పరిధిలో ఉన్న ఇసుకపై తెలంగాణ ఇసుక రవాణాదారుల కన్ను పడింది. దాదాపు ఏడాదిన్నరకు పైగా అనుమతి పేరిట అక్రమంగా సరిహద్దు దాటి 100మీటర్లకు పైగా ఏపీ భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఇసుక తవ్వకాలు, రవాణా చేస్తున్నారని కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు, సుంకేసులుకు చెందిన కె.మహానంది, శ్రీరాములుతోపాటు గ్రామాల రైతులు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ సృజన ఆదేశాల మేరకు కర్నూలు రూరల్ తహసీల్దారు రామాంజులు నాయక్, సీఐ శ్రీధర్, మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ మురహరి, ఇతర రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇసుక అక్రమంగా తవ్వకాలు చేసి రవాణా చేస్తున్న 51 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక తరలించిన ఒక్కో ట్రాక్టరు నుంచి రూ.5 వేల జరిమానా వసులు చేసేలా నిర్ణయం తీసుకున్నారు.
Updated Date - Jun 22 , 2024 | 07:17 AM