PARITALA SUNITA : రాప్తాడును మరింత అభివృద్ధి చేస్తా..!
ABN, Publish Date - May 10 , 2024 | 12:30 AM
: టీడీపీ హయాంలో రాప్తాడు నియోజకవర్గాన్ని రూ.5 వేల కోట్లతో అభివృద్ది చేశామని మాజీ మంత్రి, టీడీపీ కూటమి అభ్యర్థి పరిటాల సునీత అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మరింతగా అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు. గెలిచిన వెంటనే పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా కృషి చేస్తామని అన్నారు. జాకీ లాంటి పరిశ్రమను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు...
అధికారంలోకి రాగానే పేరూరుకు నీరు తీసుకొస్తాం
జాకీ లాంటి పరిశ్రమను మళ్లీ రప్పిస్తాం
టీడీపీ కూటమి రాప్తాడు అభ్యర్థి పరిటాల సునీత
రాప్తాడు, మే 9: టీడీపీ హయాంలో రాప్తాడు నియోజకవర్గాన్ని రూ.5 వేల కోట్లతో అభివృద్ది చేశామని మాజీ మంత్రి, టీడీపీ కూటమి అభ్యర్థి పరిటాల సునీత అన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మరింతగా అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు. గెలిచిన వెంటనే పేరూరు డ్యాంకు నీరు తీసుకొచ్చి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా కృషి చేస్తామని అన్నారు. జాకీ లాంటి పరిశ్రమను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రజ్యోతితో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.
- ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోంది...?
పరిటాల సునీత: గ్రామాల్లో మేము ప్రచారం చేస్తున్నట్లుగా లేదు. ఎక్కడ చూసినా విజయోత్సవంలా కనిపిస్తోంది. గ్రామాలకు గ్రామాలు కదిలి వస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా ప్రజలు అపూర్వ సాగతం పలుకుతున్నారు. తమ సొంత మనిషి ఊరికి వచ్చినట్లుగా నన్ను ఆదరిస్తున్నారు. పెద్ద ఎత్తున బాణ సంచా పేలుస్తూ.. పూల వర్షం కురిపిస్తున్నారు. గజమాలలు, హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పును మళ్లీ జరగనివ్వబోమని స్పష్టంగా చెబుతున్నారు.
- ప్రచారంలో వైసీపీ వాళ్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు కదా..? ఎలా ఎదుర్కొంటున్నారు..?
పరిటాల సునీత: వైసీపీ వారికి ఓటమి తప్పదని అర్థమైంది. మాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. నిన్నటి వరకూ ఏదో గెలుద్దామని చూశారు. కానీ ఇప్పుడు వారికి కూడా నమ్మకం పోయింది. అందుకే మేము ఎక్కడికి వెళ్లినా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాళ్లు రువ్వుతున్నారు. మేము కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పగలం. కానీ మా సిద్ధాంతం అది కాదు. వైసీపీ వారు పోలీసుల మీద కూడా దాడి చేసే స్థాయికి వెళ్లిపోయారు. మరో మూడు రోజుల్లో వైసీపీ అరాచకాలకు అడ్డు పడుతుంది.
- ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని చెబుతున్నారు. దీనికి మీరేమంటారు..?
పరిటాల సునీత: ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతారు. పేరూరు డ్యాంకు నీరు ఇచ్చామంటారు. బంగారు గనులు తెరిపించామంటారు. పరిశ్రమలు తెచ్చామంటారు. సోలార్ ప్రాజెక్టులు తెచ్చామంటారు. లక్ష ఎకరాలకు నీరు ఇచ్చామంటారు. ఇందులో ఏ ఒక్కటైనా వాస్తవం ఉందా..? సొంత ఊరికి రోడ్డు వేయించుకోలేని అసమర్థుడు ప్రకా్‌షరెడ్డి. అతని మాటలకు జనం కూడా నవ్వుకుంటున్నారు. ఎవరైనా అభివృద్ధి పనుల్లో ఫ్రాడ్ చేస్తారు. కానీ ప్రకా్‌షరెడ్డి చెప్పే మాటల్లో కూడా ఫ్రాడ్ ఉంది. ఆయన మాయ మాటలు నమ్మేస్థితిలో ప్రజలు లేరు.
- ఆరు మాసాలుగా టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. దీనిపై మీరేమంటారు..?
పరిటాల సునీత: వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలకు ప్రధానమైన కారణాలు రెండు ఉన్నాయి. రాష్ట్రం బాగుండాలి.. నియోజకవర్గం బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. వైసీపీ నాయకుల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది. అందుకే నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నుంచి భారీగా టీడీపీలోకి చేరుతున్నారు. వలసలు పెరగడానికి ఇంకో ప్రధానమైన కారణం ఎమ్మెల్యే సోదరుల వ్యవహారం. గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఆస్తులు అమ్మి ప్రకా్‌షరెడ్డిని గెలిపించారు. కానీ ఆయన గెలిచిన తరువాత కార్యకర్తల్ని, నాయకుల్ని కనీసం పలకరించిన పాపాన పోలేదు. పైగా వారినే ఇబ్బందులు పెడుతున్నారు. వారి భూములను లాక్కున్నారు. అందుకే వారు విరక్తి చెంది ప్రకా్‌షరెడ్డిని ఓడించాలన్న లక్ష్యంతో టీడీపీలోకి వస్తున్నారు.
- ప్రజల్లో పరిటాల కుటుంబానికి ఆదరణ ఎలా ఉంది...?
పరిటాల సునీత: పరిటాల అనే పేరు ఎప్పటికీ ప్రజల్లో గుండెల్లో ఉంటుంది. నాతో పాటు మా కుటుంబ సభ్యులు ఈ సారి ప్రచారంలో పాల్గొన్నారు. మా కోడళ్లు, చెల్లెళ్లు, ఆడబిడ్డల ప్రచారాన్ని కూడా ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. పరిటాల రవి చేసిన మంచి పనులు కొనసాగిస్తుండటంతోనే ప్రజలు మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నారు.
- ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఏం సందేశం ఇస్తారు...?
పరిటాల సునీత: 2019లో ఒక తప్పు జరిగింది. తద్వారా రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో వెనుకబడ్డాయి. ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గత ఎన్నికల్లో ప్రకా్‌షరెడ్డి పేద అరుపులు, దొంగ ఓట్లతో గెలిచారు. ఈ సారి అలాంటి తప్పు జరగకూడదు. రాష్ట్రం బాగుండాలన్నా, రాప్తాడు అభివృద్ధి చెందాలన్నా టీడీపీకి ఓటు వేయండి. అరాచక పాలనకు చరమ గీతం పాడండి. ఇది మీ కోసం, మీ బిడ్డల కోసం అని నేను వేడుకుంటున్నాను.
- పేరూరు డ్యాంకు నీరు తీసుకువస్తారా..? బంగారు గనులను తెరిపిస్తారా..?
పరిటాల సునీత: మేము అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యం.. పేరూరు డ్యాంకు నీరు ఇవ్వడమే. నాలుగు రిజర్వాయర్లు పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే మా తాపత్రయం. బంగారు గనులను తెరిపించే దిశగా టీడీపీ హయంలోనే అడుగులు పడ్డాయి. ఇది కేంద్రంతో మాట్లాడాల్సిన అంశం. జియోలాజికల్ శాఖ అధికారులతో మాట్లాడి గనులు తెరిపించేందుకు కృషి చేస్తాను. మేము ప్రకా్‌షరెడ్డి మాదిరిగా అబద్ధాలు చెప్పం. చేసి చూపిస్తాం.
- అధికారంలోకి వచ్చిన తరువాత ఎలాంటి అభివృద్ధి చేస్తారు..?
పరిటాల సునీత: అభివృద్ధి, సంక్షేమాన్ని అర్హులందరికీ అందిస్తాం. పేరూరుకు నీరందించే పనులు వేగంగా చేపడతాం. ప్రతి ఎకరాకు సారు అందించే ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే సోదరులు తరిమికొట్టిన జాకీ లాంటి పరిశ్రమలు మళ్లీ తీసుకొస్తాం. ఇక్కడ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తాం. అధ్వాన్నంగా ఉన్న రోడ్లను బాగు చేయిస్తాం. ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. ఆ కేసులను కొట్టివేయించేందుకు చర్యలు తీసుకుంటాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - May 10 , 2024 | 12:30 AM