పాడేరు మెడికల్ కాలేజీలో నేటి నుంచి అడ్మిషన్లు
ABN, Publish Date - Sep 17 , 2024 | 03:58 AM
పాడేరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది.
తొలివిడతలో 20 సీట్ల భర్తీకి చర్యలు
19 నాటికి పూర్తి చేయాలని ఉత్తర్వులు
నెలాఖరుకు మిగిలిన 30 సీట్లు భర్తీ
అక్టోబరు 1 నుంచి తరగతులు
పాడేరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): పాడేరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి విడతగా 20 సీట్లను కేటాయించి వాటి ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 19వ తేదీ సాయంత్రం 3 గంటల్లోపు పూర్తి చేయాలని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ నరసింహం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు గురువారంలోగా 20 సీట్లను, నెలాఖరులోగా మిగిలిన 30 సీట్లతో కలిపి మొత్తం 50 సీట్లను భర్తీచేస్తారు. అక్టోబరు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ మెడికల్ కాలేజీలో ఈ ఏడాది ప్రవేశాలకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ నరసింహం, ఇతర అధికారులకు ప్రిన్సిపాల్ డాక్టర్ టి.హేమలత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.
మొత్తం 50 సీట్లు మంజూరు
పాడేరు మెడికల్ కళాశాలకు ఈ ఏడాది (2024-25) 50 సీట్లు మంజూరయ్యాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వ కోటా 22 సీట్లు కాగా, కేంద్ర కోటాలో 7 సీట్లు ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోటాలో 15 సీట్లు (ఏడాదికి రూ.12 లక్షలు చెల్లించాలి), ఎన్‌ఆర్‌ఐ కోటాలో 6 సీట్లు (ఏడాదికి రూ.20 లక్షలు చెల్లించాలి) ఉన్నాయి. ప్రస్తుతానికి రాష్ట్ర కోటా కింద తొలి విడతలో 20 సీట్ల భర్తీకి ఉత్వర్తులు అందాయి. విడతల వారీగా నెలాఖరుకు మొత్తం 50 సీట్లను భర్తీ చేస్తారు.
Updated Date - Sep 17 , 2024 | 03:59 AM