ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీఎండీసీలో 400 మంది పాగా!

ABN, Publish Date - Jul 03 , 2024 | 05:20 AM

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) సర్కారుకు సిరులు తీసుకొచ్చే బంగారు బాతు. ఏటా మైనింగ్‌ రూపంలో కనీసం రూ.5 వేలకోట్ల ఆదాయం సమకూరుతోంది.

జగన్‌ అండ్‌కో సిఫారసులతో

కాంట్రాక్టు నియామకాలు

కీలక స్థానాల్లో పెద్దిరెడ్డి మనుషులు

కొమ్ముకాసేవారికి ఏరికోరి పోస్టింగ్‌

ఇతర శాఖల నుంచీ తెచ్చి కీలక బాధ్యతలు

జగన్‌ పత్రిక ఉద్యోగికీ పునరావాసం

ప్రశ్నించిన రెగ్యులర్‌ ఉద్యోగులు బయటికి

ఆఫీసుకు రావద్దు.. ఇంట్లోనే ఉండాలని హుకుం

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) సర్కారుకు సిరులు తీసుకొచ్చే బంగారు బాతు. ఏటా మైనింగ్‌ రూపంలో కనీసం రూ.5 వేలకోట్ల ఆదాయం సమకూరుతోంది. దీంతో జగన్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, వారి సొంత మనిషి వెంకటరెడ్డి తదితరులు దీన్ని ఒడిసిపట్టారు. ఇటు సొంత అవసరాలు, గనుల లీజులు, టెండర్లలో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు. తమ నిర్ణయాలను నిర్భీతిగా అమలు చేసేందుకు 400 మంది సొంత మనుషులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా ఏపీఎండీసీలో నియమించుకున్నారు. ప్రభుత్వం మారి కూటమి సర్కారు కొలువు తీరినా ఇంకా వారు దర్జాగా ఆ ఉద్యోగాల్లోనే కొనసాగుతున్నారు. తమ అడ్డగోలు చర్యలు, అడ్డూఅదుపులేని దోపిడీ దందాలు, ఫైళ్ల గురించి ప్రశ్నించేవారిని ఆఫీసుకురావొద్దంటూ హుకుం జారీ చేశారు. ఇంట్లోనే ఉండాలని, నెలనెలా జీతం పంపిస్తామని, ఆఫీసు వ్యవహారాల్లో వేలుపెట్టవద్దని ఆదేశించారు. తర్వాత విచ్చలవిడిగా ఏపీఎండీసీని సొంతానికి వాడేసుకున్నారు. మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు అనే మూడు కేటిగిరీల్లో మొత్తం వైసీపీ సైన్యమే ఉంది. సర్కారు దృష్టిపెట్టకపోతే తర్వాత ఏ ఆధారమూ దొరక్కపోవచ్చని సీనియర్‌ అధికారులే చెబుతున్నారు.

సొంత మనుషుల పునరావాస కేంద్రం..

గనుల శాఖ పరిధిలో ఒక కార్పొరేషన్‌గా ఏపీఎండీసీ ఉంది. భారీ, చిన్న తరహా ఖనిజాల తవ్వకాలు, లీజులు, కాంట్రాక్టులు, వేలం తదితర వ్యవహారాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. బొగ్గు, ఇసుక, బీచ్‌శాండ్‌, ఐరన్‌ఓర్‌, మాంగ నీస్‌, క్వార్ట్జ్‌, బెరైటీస్‌ తదితర ఖనిజాల వ్యవహారాలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని సులియారీలో కేంద్రం ఏపీఎండీసీకి బొగ్గు బ్లాక్‌లను కేటాయించింది. జార్ఖండ్‌లోని గిరిధ్‌లోని బ్రహ్మదీయ కొల్‌మైన్‌ ఉంది. దీంతోపాటు మంగంపేటలోని బెరైటీస్‌ ప్రాజెక్టు ఆసియాలోనే అతిపెద్దది. ప్రపంచంలోనే అతి విలువైన బీచ్‌శాండ్‌ కూడా ఏపీలోని శ్రీకాకుళం, విశాఖ బీమిలీలో లభిస్తోంది. క్వార్ట్జ్‌, ఐరన్‌ఓర్‌, గ్రానైట్‌ వ్యాపారంలో మన రాష్ట్రం టాప్‌లో ఉంది. వీటి నిర్వహణకు సహజంగానే మానవ వనరులు చాలా అవసరం. ఈ మేరకు ఏపీఎండీసీలో ఉద్యోగులు ఉన్నారు. జగన్‌ సర్కారు వచ్చాక దీన్ని సొంత మనుషుల పునరావాస కేంద్రంగా మార్చుకున్నారు. వివిధ మైనింగ్‌ ప్రాజెక్టులు, ఎండీసీ ప్రధాన కార్యాలయం, ఇతర ఆఫీసుల్లో పలు హోదాల్లో 400 మంది ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించారు. జగన్‌ కార్యాలయంలోని ధనుంజయరెడ్డి, ముత్యాలరాజు, నాటి గనుల మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు ఎంపీ మిథున్‌రెడ్డి, గనుల డైరెక్టర్‌, ఏపీఎండీసీ ఎండీగా వ్యవహరించిన వెంకటరెడ్డి సొంత మనుషుల లిఖితపూర్వక, మౌఖిక సిఫారసులతో ఆ 400 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.

వీరు కాకుండా, అదానీ కంపెనీ, ఇతర కార్పొరేట్లలో పనిచేసిన వారిని, రిటైరై ఇక ఎందుకూ పనికిరారు అనుకున్న మరి కొందరిని తీసుకొచ్చి కీలక పోస్టుల్లో కూర్చోబెట్టి లక్షల రూపాయల వేతనాలు చెల్లిస్తున్నారు. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సిఫారసుతో ఏపీఎండీసీతోపాటు గనుల శాఖ డైరెక్టరేట్‌లోనూ 32 మందికి కాంట్రాక్ట్‌ కొలువులు ఇచ్చారు. ఇలా వచ్చినవారిలో రాజశేఖరెడ్డి అనే వ్యక్తి మాంగనీస్‌ కాంట్రాక్టర్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ సొమ్మును దారి మళ్లించారు. పెద్దిరెడ్డి, మిఽథున్‌రెడ్డి సిఫారసులతో ఉద్యోగాలు పొందిన వారు మార్కెటింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, మానవ వనరులు, ఫైనాన్స్‌ వంటి ఆయువుపట్టు విభాగాల్లోనే పనిచేస్తున్నారు. దీంతో ఉన్నతస్థాయిలో ఏ నిర్ణయం తీసుకున్నా వీరికి వెంటనే తెలిసిపోతోంది. వీరికి తెలియకుండా ఫైలు కదిలే పరిస్థితి లేనంతగా ఏర్పాట్లు చేశారు. ఇసుక, బీచ్‌శాండ్‌ టెండర్లలో అడ్డగోలుగా నిబంధనలు చేర్చారు. బొగ్గు టెండర్లలో అదానీకే మేలు చేయడానికి ఏపీఎండీసీ వడ్డీలు చెల్లించేలా నిబంధనలు తీసుకొచ్చిపెట్టారు. బీచ్‌శాండ్‌లోనూ కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా టెండర్‌ డాక్యుమెంట్లు రూపొందించారు. చివరకు హైకోర్టు జోక్యంతో వీరి బండారం బయటికొచ్చింది.


అసిస్టెంట్‌ మేనేజర్‌గా జగన్‌ పత్రిక ఉద్యోగి..

జగన్‌ పత్రికలో పనిచేసే ఓ వ్యక్తికి ఏపీఎండీసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టు ఇచ్చి సకల మర్యాదలు కల్పించారు. ఆయన పెద్దిరె డ్డి, గనుల వెంకటరెడ్డి సేవలోనే తరించిపోయారు. గనుల శాఖ పరిధిలో ఏం జరిగినా వెంటనే తాడేపల్లికి సమాచారం మోసుకెళ్లడమే ఈయన అసలు పని. ఆయనను అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులో రెగ్యులరైజ్‌ చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ప్రభుత్వం మారినా ఆయన్ను ఇంకా కొనసాగిస్తున్నారు.

ఇతర శాఖల నుంచి వలసలు..

ఏపీఎండీసీలో వేలకోట్ల ఆదాయం ఉండటంతో ఇతర శాఖల్లో ఉన్న కొందరు ఇక్కడ పనిచేసి దండుకునేందుకు ఆసక్తి చూపారు. కడప జిల్లాకు చెందిన ఓ వ్యవసాయ అధికారి డిప్యూటేషన్‌పై వచ్చి బెరైటీ్‌సపై వాలిపోయారు. వెంకటరెడ్డితో ఉన్న పరిచయాలను అడ్డంపెట్టుకొని భర్తతో ఓ బినామీ కంపెనీ ఏర్పాటుచేసి బెరైటీస్‌ వ్యాపారం చేశారు. అందులో తేడాలు రావడంతో అక్రమాలు బయటికొచ్చాయి. దీంతో అధికారులు ఆమెను సొంత శాఖకు పంపించారు. ఇక విశాఖ ఉక్కులో పనిచేస్తోన్న బోస్‌ అనే అధికారిని తీసుకొచ్చి ఏపీఎండీసీలో బొగ్గు, ఇతర కీలక వనరుల కాంట్రాక్టులు చూసే బాధ్యత అప్పగించారు. ఆయన వ్యవహారమూ రచ్చకెక్కడంతో ప్రభుత్వం వెంటనే వెనక్కి పంపించింది. ఇలా ఇతర విభాగాలు, శాఖల నుంచి వచ్చిన వారి వ్యవహారాలకు అంతేలేకుండా పోయింది. ఇదంతా వెంకటరెడ్డి చలవేనని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.

ప్రశ్నించేవారు ఇంటికే పరిమితం..

ఇసుక, బొగ్గు, బెరైటీస్‌ వ్యవహారంలో పెద్దిరెడ్డి, వెంకటరెడ్డి విధానాలను ప్రశ్నించిన రెగ్యులర్‌ ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. తమను ప్రశ్నించేవారు కీలక హోదాల్లో ఉండటానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఇలా ఇద్దరు అధికారులను డ్యూటీ నుంచి తప్పించి బలవంతంగా ఇంటికి పంపించారు. ఇంట్లోనే ఉండాలని, ఆఫీసుకు రావొద్దని మౌఖికంగా ఆదేశించారు. వారు కోర్టులకు వెళ్లకుండా ఉండేందుకు నెలనెలా జీతాలు చెల్లించారు. అంటే విధులకు దూరంగా ఉన్నా డ్యూటీలో ఉన్నట్టు రికార్డులు రూపొందించి నాలుగేళ్ల పాటు జీతాలు చెల్లించారు. ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం వారిద్దరూ తిరిగి విధులకు హాజరవుతున్నారు.

Updated Date - Jul 03 , 2024 | 05:20 AM

Advertising
Advertising