Tummala: మాజీమంత్రి తుమ్మల హాట్ కామెంట్స్.. తగ్గేదేలేదు.. తలదించుకునేది లేదు.. ఎన్నికల్లో పోటీచేసి తీరతా..
ABN, First Publish Date - 2023-08-26T11:02:24+05:30
‘తగ్గేదేలేదు. తలదించుకునేది లేదు. మీకోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. గోదావరి జలాలతో ఉమ్మడిజిల్లా ప్రజల పాదాలను
ఖమ్మం, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘తగ్గేదేలేదు. తలదించుకునేది లేదు. మీకోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. గోదావరి జలాలతో ఉమ్మడిజిల్లా ప్రజల పాదాలను కడిగేవరకు విశ్రమించేది లేదు. 40ఏళ్లుగా మీ చేతులతో నన్ను రాజకీయంగా ఉన్నతస్థాయికి చేర్చారు. ఈ ఎన్నికల్లో నన్ను పోటీ చేయకుండా చేశామనుకుంటున్న వారిది తాత్కాలిక ఆనందమే. అవసరమైతే శ్వాసయినా వదులుకుంటాను తప్ప నాపై మీకున్న నమ్మకాన్ని, మీతో ఉన్న బంధాన్ని వదలుకోను’ అంటూ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Former Minister Tummala Nageswara Rao) భావోద్వేగంగా ప్రసంగించారు. ఇటీవల ప్రకటించిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాలో తుమ్మలకు స్థానం దక్కకపోవడం పట్ల అటు తుమ్మలతో పాటు ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తుమ్మలనాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి ఖమ్మం రాగా.. ఆయనకు నాయకన్‌గూడెం(Nayakangudem) వద్ద వేలాది మంది నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వేలసంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలతో మహార్యాలీ నిర్వహించారు. నాయకన్‌గూడెం నుంచి ఖమ్మం గొల్లగూడెంలోని తుమ్మల నివాసరం వరకు సుమారు 35కిలోమీటర్లు ర్యాలీ సాగింది. ఈ క్రమంలో తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో తుమ్మల ఉద్వేగంగా మాట్లాడారు. ఎన్నో కుయుక్తులు పన్ని, ఈ సారి ఎన్నికల్లో తనను పోటీచేయకుండా అడ్డుకున్నామనుకునే వారికి తాత్కాలిక ఆనందమే మిగులుతుందన్నారు. ప్రజల సంకల్పం నెరవేర్చేందుకు, తాను ఇచ్చిన మాట ప్రకారం గోదావరి జలాలను తెచ్చి ప్రజల పాదాలను కడిగేందుకు కచ్చితంగా పోటీలో ఉంటానని ప్రకటించారు.
గతంలో అనేకసార్లు తాను రాజకీయంగా పడిపోతున్నసమయంలో జిల్లా ప్రజలు ఎత్తుకుని రాజకీయంగా మళ్లీ అందలం ఎక్కించారని, వారిచ్చిన స్ఫూర్తి, బలం అలాగే ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఉమ్మడి రాష్ట్రంలో తాను మంత్రిగా చేసిన అభివృద్ధి పనులు, జిల్లా అభివృద్ధికి చేసిన కృషిని సుదీర్ఘంగా వివరించారు. శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తి, గత ముఖ్యమంత్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఉమ్మడిజిల్లాను అందరికంటే మిన్నగా అభివృద్ధి చేశానని, జిల్లా ప్రజల జీవనస్థితిగతులు మెరుగుపరిచానన్నారు. వాస్తవానికి తాను రాజకీయం అనుబంధాన్ని తెంచుకోవానుకన్నానని, కానీ ప్రజలు ఇంకా తనపై చూపుతున్న అభిమానం, ఆవేశాన్ని చూసి ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నానన్నారు. జిల్లాకోసం, ప్రజలకోసం రాజకీయాల్లోనే కొనసాగుతానని, తనకు అవసరం లేకపోయినా.. ప్రజల కోసం, గోదావరి జలాలతో వారి పాదాలు కడగడం కోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించారు. పాలేరు, వైరా, లంకసాగర్ లాంటి ప్రాజెక్టులను గోదావరి జలాలతో నింపేవరకు విశ్రమించేదిలేదన్నారు. కొందరు కుయుక్తులు పన్ని తనను అడ్డుకోవాలనుకున్నారని పరోక్షంగా జిల్లాలోని అధికారపార్టీ నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించిన తుమ్మల ప్రజలు తనను వచ్చేఎన్నికల్లో గెలిపించి తీరుతారని, తనను గుండెల్లో పెట్టుకుని రాజకీయంగా బతికిస్తారన్న నమ్మకం ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్ ప్రజల చేతుల్లో ఉందని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని.. జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తనకు అండగా నిలిచేందుకు వాజేడు లాంటి మారుమూల కుగ్రామాల నుంచి కూడా అభిమానులు తరలి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
వేలాది వాహనాలతో మహార్యాలీ
- అడుగడుగునా తుమ్మలకు ఘనస్వాగతం
- కానరాని బీఆర్‌ఎస్ జెండాలు
- కాంగ్రెస్ జెండాలతో కార్యకర్తల సందడి
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద ఆయన అనుచరులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం 12గంటలకే తుమ్మల ఫొటో ముద్రించి ఉన్న తెల్లజెండాలతో అక్కడికి చేరుకున్న అభిమానులు, వారి వాహనాలతో పాలేరు ఖమ్మం రహదారిపై సందడి కనిపించింది. ‘నాయకులు, కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపించి. మీ వెంట మేం.. మీ నిర్ణయమే మా నిర్ణయం.. జైతుమ్మల.. జైజై తుమ్మల’ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత వేలాది కార్లు, ద్విచక్రవాహనాలతో ఖమ్మంలోని తుమ్మల నివాసం వరకు సుమారు 35కిలోమీటర్లు మహార్యాలీ జరగ్గా.. ఓపెన్‌టా్‌ప వాహనం నుంచి తుమ్మల అభివాదం చేస్తూ సాగారు. ఈ క్రమంలో పలుచోట్ల మహిళలు తుమ్మలకు హారతులిచ్చి, తిలకం దిద్ది మద్దతు పలికారు. ‘పాలేరు గడ్డ తుమ్మల అడ్డా’ అంటూ యువకులు నినాదాలు చేశారు. ఆతర్వాత ఖమ్మం నగరంలోకి ప్రవేశించిన సమయంలోనూ తుమ్మలకు ఘన స్వాగతం దక్కింది. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తుల్లో తుమ్మల జెండాలు చేతబట్టి నృత్యాలు చేశారు. గుండాల, వాజేడు లాంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అభిమానులు స్వచ్ఛందంగా, సొంత ఖర్చుతో తరలొచ్చారు. అయితే ఈ మహార్యాలీలో ఎక్కడా అధికార బీఆర్‌ఎస్ జెండాలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలు, ఫ్లెక్సీలు కనిపించలేదు. వాహనాలపై కూడా తుమ్మల ఫొటోలు, నినాదాలు ముద్రించిన స్టిక్కర్లు, తుమ్మల ఫొటో ముద్రించిన తెల్ల జెండాలు కనిపించాయి. ఇదిలాఉంటే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ జెండాలు చేతపట్టుకుని పలుచోట్ల ర్యాలీకి స్వాగతం పలకడం చర్చనీయాంశమైంది.
తుమ్మల వర్గంలో ఆనందం.. బీఆర్ఎస్లో మౌనం
కేవలం రెండురోజుల వ్యవధిలోనే తుమ్మల వర్గీయులు తలపెట్టిన మహార్యాలీకి ఉమ్మడిజిల్లా నుంచి వేలాదిమంది అభిమానులు తరలిరావడం, తుమ్మలకు అఖండ స్వాగతం దక్కడంతో తుమ్మల వర్గంలో ఆనందం కనిపించింది. తమ నేత బలం, బలగం చెరిగిపోనిదని, ఆయన నిజమైన ప్రజానాయకుడని అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదంతా గమనించిన బీఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం మౌనంగానే ఉన్నాయి. తుమ్మల తన నిర్ణయం వెల్లడించని నేపథ్యంలో ఆ పార్టీ నేతలెవరూ స్పందించలేదు.
తుమ్మల అడుగులు కాంగ్రెస్ వైపేనా?
మాజీమంత్రి తుమ్మల రాజకీయ అడుగులు కాంగ్రెస్ వైపేనా? అన్న చర్చ జరుగుతోంది. మహార్యాలీలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలు, బీఆర్‌ఎస్ జెండాలు ఎక్కడా కనిపించలేదు. కేవలం తుమ్మల ఫొటో ఉన్న తెల్ల జెండాలే కనిపించాయి. కొందరు కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ జెండాలతో ర్యాలీకి వచ్చి తుమ్మలకు సంఘీభావం తెలపడం, ఇతర ఏ పార్టీలకు చెందిన జెండాలు, నాయకులు కనిపించకపోవడంతో తుమ్మల కాంగ్రె్‌సలో చేరడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.
Updated Date - 2023-08-26T11:03:25+05:30 IST