TSPSC Leakage: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ విచారణపై హైకోర్టు కీలక ఆదేశాలు
ABN, First Publish Date - 2023-03-21T14:02:42+05:30
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విచారణను హైకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) విచారణను హైకోర్టు (Telangana High Court) ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. మంగళవారం ఈ కేసుకు సంబందించి హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ ధన్కా (Supreme Court Senior Counsel Vivek Tanka) వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున ఏజీ బీఎస్ ప్రసాద్ (AG BS Prasad) వాదించారు. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ వివరాలు కోర్టుకు సమర్పించాల్సిందిగా ఏజీని కోర్టు ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై విచారణ చేపట్టాలంటూ ఎన్‌ఎస్‌యూఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు విచారణ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు.
అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు:
బలమూర్ వెంకట్, ఓయూ విద్యార్థులు కోర్టులో పిటిషన్ వేశారని.. కోర్టులో ధాఖలు చేసిన పిటిషన్, అఫిడవిట్ ఉద్దేశపూర్వకంగా వేశారన్నారు. ఇప్పటి వరకు కేసులో 9 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. పిటిషనర్లు కేవలం ఇద్దరే అరెస్ట్ అయ్యారని అంటున్నారని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ బోర్డ్‌కు చెందిన ఇద్దరితో పాటు మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్ ఇది అని కోర్టుకు చెప్పారు. పిటిషనర్‌కు లోకస్ స్టాండీ లేదని విచారణ హర్హత లేదన్నారు. లీకేజీలో కేసులో సిట్ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని ఏజీ కోర్టులో వాదనలు వినిపించారు.
వివేక్ ధన్కా వాదనలు...
అంతకు ముందు పిటిషనర్ల తరపున వివేక్ ధన్కా వాదనలు వినిపించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే ఇద్దరు మాత్రమే నిందితులు అని ఐటీ మినిస్టర్ చెబుతున్నారని... ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్నారు. ఒకే మండలంలో 20 మందికి మంచి మార్కులు వచ్చాయని... దీనిపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే నిజనిజాలు బయట పడతాయని తన్క వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఏఈ, గ్రూప్ 1, ఏఈఈ, డీఏవో పరీక్షలను టీఎస్‌పీఎస్సీ బోర్డ్ రద్దు చేసిందన్నారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీలో సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఐటీ మినిస్టర్ స్వయాన కేవలం ఇద్దరు నిందితులకు మాత్రమే సంబంధం ఉంది అని చెప్పారని... కేసు మొదటి దశలోనే ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉంది అని ఎలా చెపుతారని ప్రశ్నించారు.
ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదు, సీబీఐ ద్వారానే విచారణ జరగాలని కోర్టుకు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ క్వాలిఫై అయిన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్ సైట్‌లో ఎందుకు పెట్టలేదని అడిగారు. టీఎస్‌పీఎస్సీ అంత రహస్యంగా అభ్యర్థుల వివరాలు ఎందుకు ఉంచుతోందని అన్నారు. ఒకే మండలం నుంచి 20 మంది అభ్యర్థులు అత్యధిక మార్కులతో క్వాలిఫై అయ్యారని... ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ, లేక ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలని వినతి చేశారు. గతంలో వ్యాపమ్ స్కాంలో సీబీఐకి సుప్రీంకోర్టు అప్పగించిందని చెబుతూ... మధ్యప్రదేశ్ వ్యాపమ్ స్కాం జడ్జిమెంట్ కాపీని వివేక్ తన్క హైకోర్టుకు సమర్పించారు.
ఇరువురి వాదనలు విన్న హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
Updated Date - 2023-03-21T14:12:23+05:30 IST