Swapnalok complex fire incident: ‘స్వప్నలోక్’లో ఆరుగురి మృతికి కారణమిదే
ABN, First Publish Date - 2023-04-06T13:49:09+05:30
టీవల సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ భారీ అగ్ని ప్రమాదం(Swapnalok Complex Fire Incident) ..
వాణిజ్య భవనాల్లో పాత వైరింగ్
ఏళ్ల నాటి ప్యానల్ బోర్డులు
అగ్నిప్రమాదాలకు ఆస్కారం
హైదరాబాద్: ఇటీవల సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ భారీ అగ్ని ప్రమాదం(Swapnalok Complex Fire Incident) జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి కారణాలను విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదానికి కారణం చాలా ఏళ్లక్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు, ప్యానల్ బోర్డులతో షార్ట్ సర్క్యూట్‌కు కారణమని నిర్ధారణకు వచ్చారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించక పోవడం పలు ఆరోపణలు వస్తున్నాయి.
సికింద్రాబాద్‌లో స్వప్నలోక్ తరహాలో వందల సంఖ్యలో వాణిజ్య, పాత భవనాల్లో 15, 20 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ల, సెల్లార్లతో ఇష్టారాజ్యంగా ప్యానల్ బోర్డులు ఏర్పాటు చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రోజు రోజుకు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు పెరుగుతున్నా.. విద్యుత్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు స్థానికులు ఆరోపిస్తున్నారు.
వాణిజ్య భవనాలు, కాంప్లెక్స్‌లలో ఎలాంటి విద్యుత్ తీగలు వాడాలి, ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశంపై అవగాహన కల్పించాల్సిన విద్యుత్ శాఖ అధికారులు అలాంటివేమీ చేయడం లేదని అంటున్నారు. కేవలం కనెక్షన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని
ఆరోపిస్తున్నారు. వాణజ్య కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాళ్లు, ఐదంతస్తులు దాటిన భవనాలు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలకు హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలంటే ముందుగా విద్యుత్ తనిఖీ శాఖ (సీఈఐజీ) నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు ఎంత లోడ్ వినియోగిస్తారో తెలిపేలా విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకుంటే డీఈ, ఏడీఈ, ఏఈ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎస్టిమేషన్ రూపొందించి కనెక్షన్లు మంజూరు చేస్తారు. సరఫరా నిర్వహణ కోసం 10శాతం చార్జీలను వసూలు చేస్తున్న విద్యుత్‌శాఖ పాత విద్యుత్ తీగల పని తీరుపై దృష్టి సారించడం లేదు.
తనిఖీలు మరిచారు..
విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంతో పాటు విద్యుత్‌సరఫరా పనితీరు పరిశీలించాల్సి బాధ్యత స్థానిక అధికారులపై ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. విద్యుత్‌కనెక్షన్ల వరకు మేం ఇస్తాం.. ప్రతి నెలా బిల్లులు తీసుకుంటాం.. మాకేం సంబంధం అన్నట్లు విద్యుత్‌శాఖ పనితీరు ఉంది. ప్రతి సంవత్సరం లైన్ ఇన్స్‌పెక్టర్లు క్షేత్రస్థాయి విద్యుత్ లోడ్ చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఎక్కడా లోడ్ తనిఖీచేయడం లేదనే ఆరోపణలున్నాయి.
పాత లోడుకు అనుగుణంగానే...
గ్రేటర్‌లో పలు భవనాల్లో 10 ఏళ్ల క్రితం అప్పటి లోడ్‌కు అనుగుణంగా వేసిన విద్యుత్‌తీగలనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. విద్యుత్‌తీగలు పాతబడిపోవడంతో పాటు అదనపు లోడ్ పడి తీగలు కాలిపోయే అవకాశాలున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యాపార, వాణిజ్య సంస్థల్లో ఇష్టానుసారంగా వైరింగ్ చేస్తున్నా, లెక్కకు మించి ఏసీలు, సర్వర్లు వినియోగిస్తూ విద్యుత్ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బహుళ అంతస్తులు, కమర్షియల్ కాంపెక్స్‌ల్లో తనిఖీలు చేయకుండానే సర్టిఫికెట్లు జారీచేయడంతో విద్యుత్‌ప్రమాదాలు పెరుగుతున్నాయి.
Updated Date - 2023-04-06T13:51:11+05:30 IST