Delhi: కుటుంబ సభ్యులతో హైదరాబాద్ బయలుదేరిన కవిత, కేటీఆర్
ABN, First Publish Date - 2023-03-22T10:32:08+05:30
ఢిల్లీ: రెండు రోజులు వరుసగా ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)... బుధవారం ఉదయం సోదరుడు మంత్రి కేటీఆర్ (Minister KTR), కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ (Hyderabad) బయలుదేరారు.
ఢిల్లీ: రెండు రోజులు వరుసగా ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)... బుధవారం ఉదయం సోదరుడు మంత్రి కేటీఆర్ (Minister KTR), కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ (Hyderabad) బయలుదేరారు. ఈరోజు విచారణ లేదని, మళ్లీ ఎప్పుడు విచారణకు రావాలో తెలియజేస్తామని ఈడీ అధికారులు (ED officials) కవితకు చెప్పారు. దీంతో ఆమె హైదరాబాద్ బయలుదేరారు.
కాగా నిన్నటి విచారణలో ఈడీ అధికారులు కవిత వాడిన ఫోన్లపైనే విచారించారు. ‘‘అన్నిసార్లు ఫోన్‌లు ఎందుకు మార్చారు? ఒకే రోజు రెండు ఫోన్లు ఎందుకు వాడారు? వెంటవెంటనే వాటిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ ..అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎమ్మెల్సీ కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సోమవారం ఆమెను దాదాపు పదిన్నర గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. వరుసగా రెండోరోజూ సుదీర్ఘంగా పది గంటలపాటు విచారించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి ప్రవేశించిన కవిత.. రాత్రి 9.40 గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. చిరునవ్వుతో కార్యకర్తలకు విజయచిహ్నం చూపుతూ కారులో కూర్చొని వెళ్లిపోయారు. సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ఆమె న్యాయవాది సోమా భరత్ కుమార్ ద్వారా లోపలికి కొన్ని పత్రాలు తెప్పించుకున్నారు. భరత్ కుమార్ కూడా దాదాపు రెండు గంటలు ఈడీ కార్యాలయంలోనే గడిపారు.
కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇప్పటికిది మూడోసారి. మొదటిసారి (మార్చి 11న) 8 గంటలు.. సోమవారంనాడు 10.30 గంటలపాటు.. మంగళవారం 10 గంటలు కలిపి దాదాపు 28 గంటలకు పైగానే ఈడీ ఆమెను ప్రశ్నించినట్లయింది. కాగా.. ఈడీ కార్యాలయంలోకి ప్రవేశించేటప్పుడు కవిత రెండు సంచుల్లో తెచ్చిన తన మొబైల్ ఫోన్లను మీడియాకు చూపిస్తూ వెళ్లారు. ఈ కుంభకోణం జరిగిన సమయంలో వాడిన ఫోన్లన్నీ తేవాల్సిందిగా ఈడీ అధికారులు ఆదేశించడంతో ఆమె వాటిని తీసుకుని వెళ్లక తప్పలేదు. అయితే, గతంలో తాను వాడిన ఫోన్లన్నింటినీ తెమ్మన్నందుకు నిరసన వ్యక్తం చేస్తూ.. ఈడీ అధికారి జోగీందర్‌కు ఆమె లేఖ రాశారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే ముందు ఆమె ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈడీ దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని.. అయినప్పటికీ తాను వారు అడిగిన ఫోన్లను సమర్పిస్తున్నానని లేఖలో తెలిపారు.
ఒక మహిళ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఆమె వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగమని కవిత వ్యాఖ్యానించారు. తన ఫోన్లను ధ్వంసం చేశానని గతంలో ఈడీ పేర్కొవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు సమన్లు జారీ చేయకుండా, తనను అడగకుండా ఈడీ ఈ ఆరోపణలు ఎందుకు చేసిందని ప్రశ్నించారు. ఈడీ తనను తొలిసారి మార్చి 11న విచారణకు పిలిచిందని.. కానీ గత ఏడాది నవంబర్‌లోనే తాను ఫోన్లను ధ్వంసం చేశానంటూ దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసిందని కవిత విమర్శించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణల మూలంగానే రాజకీయ ప్రత్యర్థులు తనను నిందిస్తున్నారని.. తద్వారా తన ప్రతిష్ఠకు, పార్టీ ప్రతిష్ఠకు తీవ్రభంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడీ వంటి దర్యాప్తు సంస్థ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని.. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని విస్మరించిందని, ఇది చాలా దురదృష్టకరమని కూడా ఆమె వ్యాఖ్యానించారు.
ఫోన్లపైనే ఆరా..
కవిత నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను మార్చి 11నే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరోజు ఆమెను విచారిస్తున్న సమయంలోనే.. సాయంత్రం ఆమె డ్రైవర్‌ను ఇంటికి పంపించి మరీ ఆ ఫోన్ ను తెప్పించుకున్నారు. సోమవారం ఆమెను.. ఈడీ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్న పది ఫోన్ల గురించి ప్రశ్నించారు. వాటిని తాను ధ్వంసం చేయలేదని, అవి కూడా తన వద్దే ఉన్నాయని కవిత చెప్పడంతో మంగళవారం విచారణకు వచ్చేటప్పుడు వాటిని కూడా తేవాల్సిందిగా ఆదేశించారు. ఈమేరకు మంగళవారం కవిత వాటిని కూడా ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో.. కవిత వాడిన మొత్తం 11 ఫోన్లు ప్రస్తుతం ఈడీ స్వాధీనంలో ఉన్నట్లయింది. కాగా.. విచారణలో భాగంగా.. దర్యాప్తు అధికారి జోగీందర్, మహిళా అధికారి భానుప్రియతో పాటు ముగ్గురు అధికారులు ఆమెపై ప్రధానంగా ఫోన్లలో జరిగిన సంభాషణలు, సందేశాలకు సంబంధించే ప్రశ్నల వర్షం కురిపించారని తెలిసింది.
కవితతోపాటు.. శరత్ రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు తదితరులు ఫోన్లను మార్చడం గురించి కూడా వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మార్చిన అన్ని ఫోన్లలో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి వారు ఢిల్లీ మద్యం కుంభకోణం గురించి ఆరా తీసినట్లు సమాచారం. వారు అడిగిన ప్రశ్నలకు కవిత.. తాను ఫోన్లను కావాలని మార్చలేదని, తన వంటమనిషి, పార్టీ కార్యకర్తలు, తోటి కోడలు కూడా తన ఫోన్లు వాడుతూ ఉంటారని, ఏ ఫోన్‌నూ ధ్వంసం చేయలేదని చెప్పారని.. గతంలో ఆమె పలు మీడియా చానల్స్‌కు చెప్పిన విషయాల్నే ఈడీ అధికారులకూ చెప్పారని.. విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. కవిత తదుపరి విచారణ ఎప్పుడు అనే విషయాన్ని ఈడీ అధికారులు వెల్లడించలేదు.
నంబర్లు రెండు.. ఫోన్లు పది
ఢిల్లీ మద్యం కుంభకోణం జరిగిన సమయంలో.. కవిత రెండు నంబర్లతోనే పది ఫోన్లను మార్చినట్టు ఈడీ గుర్తించింది. 6209999999 నంబర్‌తో ఆరు ఫోన్లు.. 8985699999 నంబర్‌తో నాలుగు పోన్లు ఆమె మార్చారని గుర్తించింది. ఈ కుంభకోణంలో కవితతో సహా 36 మంది 70 పోన్లను మార్చారని ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-03-22T10:32:08+05:30 IST