Hyderabad: పుష్ప సినిమా తలపించేలా... అంత కంటే కొత్త తరహాలో గంజాయి తరలింపు
ABN, First Publish Date - 2023-03-05T14:24:50+05:30
అక్రమ రవాణాలో ఈ ముఠాది ఓ స్టయిల్.. పుష్ప సినిమా తరహాలో పోలీసులను పక్కదారి పట్టించేందుకు కతర్నాక్ ప్లాన్ వేశారు.
హైదరాబాద్: గంజాయి(Ganja) అక్రమ రవాణాలో ఈ ముఠాది ఓ స్టయిల్.. పుష్ప సినిమా తరహాలో పోలీసులను పక్కదారి పట్టించేందుకు కతర్నాక్ ప్లాన్ వేశారు. డీసీఎం వాహనంలో ప్రత్యేకంగా ఖాళీ ప్రదేశాన్ని సృష్టించారు. అందులో గంజాయి దాచి రవాణా చేస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని అన్నవరం (Annavaram) నుంచి పలు ప్రాంతాలకు గుట్టుగా గంజాయి సరఫరా చేస్తున్నారు. ఏకంగా ఆరుసార్లు పోలీసుల కళ్లుగప్పి బాగానే హైదరాబాద్ (Hyderabad), మహారాష్ట్ర (Maharashtra)లోని వివిధ ప్రాంతాలకు యధేచ్చగా గంజాయి అక్రమ రవాణా చేశారు. ఏడోసారి మాత్రం పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు. పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో గంజాయిని తరలిస్తున్న ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ (Choutuppal) పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ముఠాలోని నలుగురిని శనివారం అరెస్టు చేసి 400 కిలోలు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. హనుమకొండ (Hanamkonda )కు చెందిన బానోత్ వీరన్న, హైదరాబాద్ (Hyderabad) వాసులు కర్రె శ్రీశైలం, కేతావత్ శంకర్ నాయక్, వరంగల్‌కు చెందిన పంజా సూరయ్య ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం నుంచి రాజమండ్రి, ఖమ్మం, తొర్రూరు, తిరుమల్‌గిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో డీసీఎం వాహనం లోపల మార్పులు చేసి ఖాళీ ప్రదేశాన్ని సృష్టించి అందులో గంజాయి ప్యాకెట్లను నింపుతున్నారు. దానిపై ఇనుప షీట్లు ఉంచి బోల్టులతో బిగిస్తున్నారు. ఆపై ఏదో ఓ లోడును తీసుకుని నగరానికి పయనమవుతున్నారు. ఇలా ఆరుసార్లు గుట్టుగా గంజాయిని అనుకున్నచోటుకు తరలించారు. ఏడోసారి దొరికిపోయారు.
వాహనంలో గంజాయి తరలిస్తున్నారని, డీసీఎం (DCM Vehicle) కు ముందు ఓ హ్యుందాయ్ క్రెటా కారును పైలట్‌లా పంపిస్తూ..జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు.. శనివారం తెల్లవారుజాము 4 గంటల సమయంలో చౌటుప్పల్ లోని వలిగొండ చౌరస్తాలో పోలీసులు కాపు కాశారు. పైలట్‌గా వచ్చిన కారును అడ్డుకుని ఆ వెనకే వచ్చిన డీసీఎంను ఆపారు. అనుమానంతో వాహనం లోపలి భాగాన్ని కాలితో తన్నిచూడగా శబ్దంలో తేడా వచ్చింది. ఇనుపషీట్లపై బోల్టులు తొలగించడంతో 400కిలోల గంజాయి ఉంది. కారులో వచ్చిన ఇద్దరితోపాటు డీసీఎంలో వెళ్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేశారు.
Updated Date - 2023-03-05T14:41:53+05:30 IST