Wife: నువ్వు చెప్పిందంతా అబద్ధం.. ఏం జరిగిందో నిజం చెప్పమంటూ చావుబతుకుల్లో ఉన్న భార్యను పోలీసులు నిలదీస్తే..!
ABN, First Publish Date - 2023-11-11T19:13:04+05:30
భార్యపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఓ భర్త ఆమె ప్రమాదవశాత్తూ మంటల్లో చిక్కుకుందని నమ్మించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ముంబైలో వెలుగు చూసిన ఈ ఘటనలో నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కాలినగాయాలతో చావుబతుకుల్లో ఉన్న తన భార్యను ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేర్పించాడు. వంట వండుతుంటే స్టవ్ పేలి భార్యకు గాయాలు అయ్యాయని తెలిపాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో తను కూడా గాయాలపాలయ్యానని తెలిపాడు. కాలినగాయాలతో నరకం అనుభవిస్తున్న భార్య కూడా అదే చెప్పింది. అయితే, పోలీసులు ఆ జంట ఇంట్లోకెళ్లి తనిఖీ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబైలోని అంధేరీ ప్రాంతంలో(Andheri) ఓ జంట నివసిస్తుంటుంది. భర్త అజయ్ రాజీవ్ పర్మార్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో, భార్య గుడ్డీ పర్మార్‌తో అతడికి నిత్యం గొడవలు జరుగుతుండేవి. మంగళవారం కూడా వారి మధ్య వివాదం తలెత్తింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో, మరింత రెచ్చిపోయిన అజయ్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. భార్య మంటల్లో చిక్కుకుని విలవిల్లాడటం చూసి భయపడిపోయాడు. తనపై కేసు నమోదవుతుందనే భయంతో అతడే స్వయంగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. వంటింట్లో స్టవ్ పేలడంతో భార్య మంటల్లో చిక్కుకుని గాయపడిందని పోలీసులకు, ఇరుగుపొరుగుకు చెప్పాడు(Man who set wife ablaze and tried to pass it off as accident).
ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆ జంట ఉంటున్న ఇంట్లో స్టవ్ పేలిన దాఖలాలు ఏవీ కనిపించలేదు. దీంతో, వారికి అనుమానం మొదలైంది. ఈ క్రమంలో తాసీల్దార్ ఆదేశాల మేరకు మరోసారి బాధితురాలి వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు ఆసుపత్రికి వెళ్లారు. అసలేం జరిగిందో చెప్పమని ఆమెను ప్రశ్నించడంతో జరిగినదంతా చెప్పుకొచ్చింది. భర్త తరచూ తాగొచ్చి తనను కొట్టేవాడని కూడా పేర్కొంది. అతడి ఒత్తిడి మేరకే తాను స్టవ్ పేలినట్టు చెప్పాల్సి వచ్చిందని వివరించింది. దీంతో, పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం, గృహహింస తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, అతడిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు.
Updated Date - 2023-11-11T19:18:24+05:30 IST