High Court: ఆమెను వెంటనే విడుదల చేయండంటూ హైకోర్టు ఆదేశాలు.. నిండు గర్భిణి అయిన కూతురిని చూసుకునేందుకు..!
ABN , First Publish Date - 2023-11-11T17:25:24+05:30 IST
జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళను కేరళ హైకోర్టు ముందస్తుగా విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళను కేరళ హైకోర్టు(Kerala High court) ముందస్తుగా విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 21 కింద దేశప్రజలకు ఉన్న జీవించే హక్కు ఉన్నతమైదని ఈ సందర్భంగా పేర్కొంది. డిటెన్షన్‌లో ఉన్న ఓ మహిళ కూతురికి త్వరలో నెలలు నిండుతాయని, ఆమెను చూసుకునేందకు ఎవరూ లేరని మహిళ తరపు లాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో, హైకోర్టు మానవతాదృక్పథంతో మహిళను ముందస్తు విడుదలకు అనుమతించింది.
నిందితురాలిని కేరళ అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం-2007 (కేఏఏపీఏ యాక్ట్-KAAPA) కింద అరెస్టు చేశారు. అయితే, మహిళ కూతురు గర్భవతి కావడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. తన కూతురి బాగోగులు చూసుకునే వారెవరూ లేనందుకు శిక్షకాలాన్ని కుదిస్తూ ముందస్తుగా విడుదల చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఏ.ముస్తాక్ అహ్మద్, జస్టిస్ శోభ అన్నమ్మ ఈపెన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేప్పటింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
‘‘కేఏఏపీఏ యాక్ట్‌లోని సెక్షన్ 3(1) కింద విధించిన డిటెన్షన్‌పై కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు. అయితే, పిటిషనర్‌కు ఉన్న ఆర్టికల్ 21 హక్కును(Article 21) గుర్తించేందుకు కోర్టుపై పరిమితులు ఏమీ లేవు. అసాధారణ సందర్భాల్లో న్యాయస్థానం ఆర్టికల్-21 కింద కస్టడీలో ఉన్న వారిని విడుదల చేయచ్చు. సహేతుక కారణాలు ఉన్నప్పుడు పౌరుల జీవనం, స్వేచ్ఛ కోసం ఉన్నతమైన ఆర్టికల్ 21 హక్కును కస్టడీలోని వారికి కల్పించవచ్చు’’ అని న్యాయస్థానం పేర్కొంది. పిటిషనర్ కూతురి బాగోగులు చూసుకునేందుకు ఎవరూ లేరని ఆమె తరపు న్యాయవాది తమ దృష్టికి తెచ్చినట్టు ధర్మాసనం పేర్కొంది. దీంతో, పాటూ మానవతా దృక్పథం దృష్ట్యా డిటెన్షన్ కాలాన్ని మారుస్తున్నట్టు పేర్కొంది.
కాగా. ఈ కేసులో నిందితురాలిపై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. వీటిలో అధిగభాగం సెక్షన్ 406 (నమ్మకద్రోహం) సెక్షన్ 420 (మోసం) కింద నమోదయ్యాయి. అయితే, ఈ కేసుకు సంబంధించి మునుపటి తీర్పులో జోక్యం చేసుకోలేదని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే మహిళ డిటెన్షన్ కాలంలో చాలావరకూ జైల్లోనే ఉందని, డిసెంబర్ 15న డిటెన్షన్ ఎక్స్‌పైర్ కానుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ను నవంబర్ 14న జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.