P Chidambaram: ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమిని ఊహించలేదు...
ABN, Publish Date - Dec 17 , 2023 | 04:53 PM
బీజేపీ ప్రతి ఎన్నికను ఇదే తుది సమరంగా భావించి పోరాడుతుందని, ఈ విషయాన్ని విపక్ష పార్టీలు గ్రహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపిందని, ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయం ఏ మాత్రం ఊహించలేదని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) ప్రతి ఎన్నికను ఇదే తుది సమరంగా భావించి పోరాడుతుందని, ఈ విషయాన్ని విపక్ష పార్టీలు గ్రహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం (P Chidambaram) అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపిందని, ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ (Congress) పరాజయం ఏ మాత్రం ఊహించలేదని, ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ బలహీనతను కాంగ్రెస్ అగ్రనాయకత్వం పరిష్కరిస్తుందని తాను ఆశిస్తున్నట్టు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో చిందబంరం పేర్కొన్నారు.
నాలుగు పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 40 శాతం ఓటింగ్ షేర్ నిలబెట్టుకుందని చిదంబరం చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ఇది 45 శాతానికి పెరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. చివరి వరకూ ప్రచారం సాగించడం, బూత్ మేనేజిమెంట్, ఎన్నికల రోజు తప్పనిసరిగా ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించడం వంటి అంశాలపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుందని సూచించారు. బీజేపీ అనుసరిస్తున్న పోలరైజేషన్, ముస్లిం-క్రైస్తవ వ్యతిరేక ప్రచారం, హైపర్ నేషనలిజంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని కాంగ్రెస్ దీటుగా సమాధానం ఇచ్చేందుకు తగిన వ్యూహరచన చేయాల్సి ఉంటుందన్నారు.
కులగణన కీలకాంశమే కానీ..
2024 ఎన్నికల్లో కులగణనను ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ భావిస్తుండటంపై అడిగినప్పుడు, అది కీలకమైన అంశమేనని, అయితే ఎన్నికల ఫలితాలను నిర్దారించే అంశం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగం, ద్రవ్యోల్భం అనేవి జాబితాలో ప్రధానాంశాలని, ఈ రెండూ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్టు ప్రతి సర్వేలోనూ వెల్లడవుతోందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వంటివి రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఓట్ బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశాలపై అడిగినప్పుడు, పెద్ద నోట్ల రద్దు పాతపడిన అంశమని అన్నారు. నల్లధనం పదేపదే పట్టుబడుతున్న సందర్భాల్లోనే పెద్దనోట్ల అంశం తెరపైకి వస్తుంటుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కల్లోకి రాని రూ.1,760 కోట్ల నగదును ఈసీఐ సీజ్ చేసిందని గుర్తు చేశారు. ఎన్ఆర్‌సీ, సీఏఏలకు ప్రభుత్వ చురుకుగా పావులు కదిపి, అమలుకు ప్రయత్నిస్తే అవి కీలక అంశాలవుతాయని చెప్పారు.
గాలి మారొచ్చు...
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తుందంటూ సర్వేలు చెబుతున్న జోస్యంపై చిదంబరం స్పందిస్తూ, బీజేపీకి అనుకూలంగా గాలులు ఉండవచ్చని, అయితే గాలులు దిశ మార్చుకోవచ్చని అన్నారు. అయితే, బీజేపీ ఏ ఎన్నికలను తేలిగ్గా తీసుకోదని, అదే తమ చివరి సమరంగా భావించి పోరాడుతుందని, ఆ పార్టీ పోరాట లక్షణాన్ని విపక్షాలు గ్రహించాల్సి ఉంటుందని సమాధానమిచ్చారు.
'ఇండియా' కూటమి సన్నాహకాలు, ప్రధాని అభ్యర్థిత్వంపై...
లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి సన్నాహకాలను చిదంబరం ప్రస్తావిస్తూ, కూటమి నేతలు కనీసం 400 నుంచి 425 సీట్లకు బీజేపీతో పోరాడే అభ్యర్థులను గుర్తించాల్సి ఉంటుందని అన్నారు. ఇండియా కూటమి నేతల అంతర్గత చర్చల గురించి తాను వెల్లడించలేనని, అయితే ఎన్నికలకు మరో మూడు నెలల వ్యవధి మాత్రమే ఉందనే విషయాన్ని కూటమి నేతలు తప్పనిసరిగా గుర్తిస్తారని తాను చెప్పగలనని అన్నారు. కూటమి నేతలపై ప్రజల స్పందనకు అనుగుణంగానే ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ఉండాలని, దీని కంటే ముందు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలవడమే కీలకమవుతుందని చిదంబరం అన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 04:53 PM