Opposition meeting: బెంగళూరు సమావేశానికి 'ఆప్' గ్రీన్‌సిగ్నల్...
ABN, First Publish Date - 2023-07-16T19:17:35+05:30
విపక్షాల ఐక్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరు లో జరుగనున్న విపక్షాల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ హాజరవుతుందా లేదా అనే అనిశ్చితికి తెరపడింది. విపక్షాల సమావేశానికి తాము హాజరవుతున్నట్టు 'ఆప్' ఆదివారం సాయంత్రం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: విపక్షాల ఐక్య కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరు (Bengaluru)లో జరుగనున్న విపక్షాల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) హాజరవుతుందా లేదా అనే అనిశ్చితికి తెరపడింది. విపక్షాల సమావేశానికి తాము హాజరవుతున్నట్టు 'ఆప్' ఆదివారం సాయంత్రం స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో బీజేపీని సమష్టిగా ఎదుర్కొనేందుకు అవసరమైన ఉమ్మడి వ్యూహరచనపై బెంగళూరు సమావేశం దృష్టి సారించనుంది.
హైడ్రామా..
పార్లమెంటలో ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ మద్దతు ప్రకటిస్తేనే విపక్షాల సమావేశానికి హాజరవుతామంటూ ఆప్ ఇంతకుముందు ప్రకటించడంతో హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం బెంగళూరులో సోమవారం జరిగే ప్రతిపక్షాల సమావేశానికి తమ పార్టీ హాజరయ్యేదీ, లేనిదీ ఇప్పుడే చెప్పలేనని, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తర్వాత మాత్రమే దీని గురించి చెప్పగలనని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదిపింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ రాష్ట్రంలో గ్రూప్-ఏ అధికారుల నియామకాలు, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు తాము మద్దతివ్వబోమని ప్రకటించింది. ఢిల్లీలో సర్వీసుల నియంత్రణకు సంబంధించిన ఆర్డినెన్స్ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని, దానిని కాంగ్రెస్ సమర్థించబోదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ప్రకటించారు. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ హాజరవుతుందని భావిస్తున్నామని అన్నారు. ఆ వెనువెంటనే ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగడం, బెంగళూరు సమావేశానికి హాజరుకావాలని నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. దీనిపై ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా స్పష్టత ఇస్తూ, ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆప్ సైతం బెంగళూరు సమావేశానికి హాజరుకావాలని పీఏసీ సమావేశంలో నిర్ణయించిందని చెప్పారు. దీంతో బెంగళూరు సమావేశానికి ఆప్ హాజరుపై నెలకొన్న హైడ్రామాకు తెరపడింది.
హాజరుకానున్న 24 పార్టీలు
కాంగ్రెస్ రెండ్రోజుల పాటు (17-18) బెంగళూరులో జరుపనున్న విపక్షాల సమావేశాల్లో 24 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యే అవకాశాలున్నాయి. డీఎంకే, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, ఎన్‌సీపీ, యూబీటీ, సీపీఎం, ఎస్‌పీ, ఎన్‌సీ, పీడీపీ, సీపీఐఎంఎల్, జేఎంఎం, ఏఏపీ, రాష్ట్రీయ లోక్ దళ్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్(ఎం), ఎండీఎంకే, వీసీకే, ఆర్ఎస్‌పీ, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కొంగునాడు మక్కల్ దేశాయ్ కట్చి (కేఎండీకే), ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, ఎంఎంకే పార్టీలు పాల్గొంటాయి. ప్రధానంగా, నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరి, ఎంకే స్టాలిన్ , హేమంత్ సోరెన్, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబూ ముఫ్తీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్, లలన్ సింగ్, మనోజ్ ఝా, సీతారం ఏచూరి, డి.రాజా, ఎన్‌కే ప్రేమచంద్రన్ తదితరులు హాజరుకానున్నారు.
Updated Date - 2023-07-16T19:31:06+05:30 IST