Mallikarjun Kharge: మధ్యప్రదేశ్‌లో కుల గణన నిర్వహిస్తాం.. ఖర్గే బిగ్ ప్రామిస్
ABN, First Publish Date - 2023-08-22T15:31:15+05:30
కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాగానే కుల గణన చేపడతామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వాగ్దానం చేశారు.
భోపాల్: కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో అధికారంలోకి రాగానే కుల గణన (cast census) చేపడతామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వాగ్దానం చేశారు. ఎంపీలో కీలకమైన బుందేల్‌ఖండ్ ప్రాంతంలో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సిఫారసుతో మంజూరైన బుందేల్‌ఖండ్ ప్యాకేజీని బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.
''కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని రైతుల రుణాలను మాఫీ చేస్తాం. రూ.500కే ఎల్‌పీజీ సిలెండర్ ఇస్తాం. మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు చేస్తాం. 100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలో కులగణన చేపడతాం. ప్రస్తుతం మా వర్కింగ్ కమిటీలో 6 మంది బీసీలు ఉన్నారు'' అని ఖర్గే తెలిపారు.
దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారు...
మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం అక్రమంగా అధికారంలోకి వచ్చిందని ఖర్గే విమర్శించారు. ''వాళ్లు (బీజేపీ) మా ఎమ్మెల్యేలను దొంగిలించారు. పైకి మాత్రం సొంత సిద్ధాంతాల మీద ప్రభుత్వం ఏర్పాటు చేశామని చెబుతుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్లలో ఏం చేసిందని నిలదీస్తుంటారు. మేము రాజ్యాంగాన్ని రక్షించాం'' అని ఖర్గే చెప్పారు. పరోక్షంగా మోదీని ప్రస్తావిస్తూ, ఆయన ఎలా ప్రధాని అయ్యారని ప్రశ్నించారు. ఈడీని చూపించి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని, కర్ణాటక, మణిపూర్‌లలో కూడా జరిగింది అదేనని అన్నారు. ఎక్కడ అధికారం కోల్పేతే అక్కడ ఇలాంటి పనులే చేసి వాళ్లు (బీజేపీ) అధికారంలోకి వస్తుంటారని విమర్శించారు. కొందరు వ్యక్తులు రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారని, కానీ అది సాధ్యం కాదని ఖర్గే అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు 140 కోట్ల మంది కంకణబద్ధులై ఉన్నారని చెప్పారు.
ఎన్నికలప్పుడే ప్రధానికి సంత్ రవిదాస్ గుర్తొస్తాడు..
షెడ్యూల్డ్ కులాల ఆరాధ్యదైవమైన సంత్ రవిదాస్ సార్మకాలయాన్ని రూ.100 కోట్లతో నిర్మించేందుకు ప్రధానమంత్రి మోదీ ఇటీవల శంకుస్థాపన చేయడంపై మాట్లాడుతూ, సాగర్‌లో రవిదాస్ ఆలయం కోసం శంకుస్థాపన చేశారని, ఢిల్లీలో రవిదాస్ ఆలయాన్ని కూల్చేశారని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే మోదీకి సంత్ రవిదాస్ గుర్తొస్తారని విసుర్లు విసిరారు. హింసతో అట్టుకుడుకుతున్న మణిపూర్‌కు మోదీ చేసిందేమీ లేదని అన్నారు.
దళితుల జనాభా 1.13 కోట్లు...
2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌లో దళితుల జనాభా 1.13 కోట్లుగా ఉంది. ఈశాన్య మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఎస్‌సీలకు 6 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 5 సీట్లు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకుంది. మొత్తంగా 26 అసెంబ్లీ సీట్లు ఈ ప్రాంతంలో ఉండగా, గత ఎన్నికల్లో బీజేపీ 15, కాంగ్రెస్ 9, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు చెరో సీటు గెలుచుకున్నాయి. కాగా, ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.
Updated Date - 2023-08-22T15:31:15+05:30 IST